శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని ఏఆర్‌సీఐలో Nd-Fe-B రేర్ ఎర్త్ ప‌ర్మినెంట్ మ్యాగ్నెట్స్‌ తయారీ కోసం పైలట్ ప్లాంట్ ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 20 MAR 2026 5:30PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ఏఆర్‌సీఐ)లో Nd-Fe-B (నియోడైమియం-ఐరన్-బోరాన్) రేర్ ఎర్త్ ప‌ర్మినెంట్ మ్యాగ్నెట్స్‌ తయారీ కోసం ఒక పైలట్ ప్లాంట్ ఏర్పాటుచేశారు.
 
ఈ పైలట్ ప్లాంట్‌ను భార‌త ప్ర‌భుత్వ శాస్త్ర‌, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్. విజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భార‌త ప్ర‌భుత్వ శాస్త్ర‌, సాంకేతిక విభాగం మాజీ  కార్యదర్శి, ఏఆర్‌సీఐ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, మిధాని, మాజీ సీఎండీ, టెక్నికల్ రివ్యూ కమిటీ మెంబర్ డాక్టర్ ఎస్.కె.ఝా, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్ఆర్ఎఫ్‌) సీఈఓ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్‌తో పాటు వివిధ పరిశ్రమలు, జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

 

ఏఆర్‌సీఐలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌ స్ట్రిప్-కాస్ట్ అల్లాయ్ నుంచి ఫినిష్డ్ సింటర్డ్ మాగ్నెట్స్ వరకు పూర్తి స్థాయి త‌యారీ విధానాన్ని అవలంబిస్తుంది. దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన తయారీ వ్యవస్థ అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.
 
అరుదైన ఖ‌నిజాల రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి, ప్ర‌పంచ అరుదైన ఖ‌నిజాల వాల్యూ చైన్‌లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ పైలట్ ప్లాంట్ ఒక ముఖ్యమైన అడుగు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ సాంకేతికతలలో Nd-Fe-B అయస్కాంతాలు అత్యవసరమైన భాగాలు.
 
ఈ సందర్భంగా ప్రొఫెసర్ అభ‌య్ కరాండికర్ మాట్లాడుతూ.. ప్రపంచ సరఫరా గొలుసులో తలెత్తే లోపాలు, స్వచ్ఛ ఇంధనం, అధునాతన తయారీ రంగాలలో భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా అరుదైన ఖ‌నిజాల‌లో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని నిర్మించడంలో ఈ ప్లాంట్ ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 దిశగా పయనిస్తున్న వేళ, వనరుల పరిమితులను అధిగమించడం, కీలక సాంకేతికతలలో స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం మన అభివృద్ధి వ్యూహంలో ప్రధానమ‌ని ఆయ‌న అన్నారు. ఇలాంటి స‌దుపాయాల ఏర్పాటు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, ఆటుపోట్ల‌కు త‌ట్టుకునే సామ‌ర్థ్యాన్ని, పోటీతత్వాన్ని పెంచుతాయ‌ని పేర్కొన్నారు.

 


 
సంస్థాగత విధానాలు, మిషన్-ఆధారిత కార్య‌క్ర‌మాల‌ ద్వారా పరిశోధనలను భారీ ఆవిష్కరణలుగా మార్చడానికి ఒక అనుకూలమైన వ్యవస్థను నిర్మిస్తున్నామని అన్నారు. స‌రికొత్త‌ సాంకేతికతలలో భారతదేశాన్ని ప్ర‌పంచ అగ్ర‌గామిగా నిలబెట్టడంలో భాగస్వాములు కావాలని పరిశ్రమలు, అంకుర సంస్థ‌లు, విద్యాసంస్థలను ప్రొఫెసర్ అభ‌య్‌ కరాండికర్ ఆహ్వానించారు.
 
ప్రస్తుతం రేర్ ఎర్త్ మాగ్నెట్ సరఫరా గొలుసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని చోట్ల మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందికరంగా మారిందని గుర్తు చేశారు. ఖ‌నిజాల‌ నుంచి అయ‌స్కాంతాల‌ తయారీ వరకు వాల్యూ చైన్‌ అంతటా స్వదేశీ సామర్థ్యాలను స్థాపించడం వల్ల సరఫరా భద్రత, పోటీతత్వం, సాంకేతిక నాయకత్వం పెరుగుతాయ‌ని, ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని అన్నారు.
 
సాంకేతికత ధ్రువీక‌ర‌ణ‌, సుల‌భ‌త‌ర ప్రక్రియ, పరిశ్రమల సహకారం, ప్రదర్శన, స్వదేశీ ఆవిష్కరణలను వాణిజ్య తయారీ స్థాయికి తీసుకెళ్లడం, డీప్-టెక్ స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి ఈ పైలట్-స్కేల్ ప్లాంట్ ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


 
ఏఆర్‌సీఐ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ.. పరిశోధన స్థాయి నుంచి తయారీ స్థాయికి మారడమే ఈ పైలట్ ప్లాంట్‌ను నిజంగా విశిష్టమైనదిగా చేస్తుందని అన్నారు. దీనిలోని సరళత నిరంతర ఆవిష్కరణలకు, ప్రక్రియ ఆప్టిమైజేషన్‌కు, ఉత్పత్తి అభివృద్ధికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ మాట్లాడుతూ.. భారతదేశపు ఈవీ వ్య‌వ‌స్థ‌తో సహా కీలక సాంకేతికతలను వేగవంతం చేయడానికి 'మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్‌'(ఎంఏహెచ్ఏ) చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. అనువర్తిత పరిశోధనలలో చురుకుగా పాల్గొనవలసిందిగా ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించారు.
 
ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్. విజయ్ మాట్లాడుతూ.. ఆరుదైన ఖ‌నిజాల‌ వెలికితీత నుంచి అయ‌స్కాంత‌ తయారీ వరకు ఏఆర్‌సీఐ పూర్తిస్థాయి ‘మినరల్-టు-మార్కెట్’ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని, ఇది పరిశ్రమలతో అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.

కాగా, ఈ పైలట్ ప్లాంట్ పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రేరేపిస్తుందని, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని, స్వదేశీ అరుదైన ఖ‌నిజ అయ‌స్కాంతాల‌ సాంకేతికతల వాణిజ్యీకరణకు మద్దతు ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహ‌నాల‌ వ్యవస్థ, అధునాతన మెటీరియల్స్ తయారీ వృద్ధికి కూడా దోహదపడుతుంది.
 
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి, వికసిత్ భారత్ 2047 సంక‌ల్పాన్ని సాకారం చేసుకోవడానికి ఇది ఒక కీలక అడుగు.

 

***


(రిలీజ్ ఐడి: 2243086) సందర్శకుల సూచీ సంఖ్య : : 52
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English