కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

24 గంట‌లు, 48 గంట‌ల్లో క‌చ్చితంగా డెలివ‌రీ చేసేలా మూడు కొత్త పోస్ట‌ల్ సేవ‌లు ప్రారంభించిన త‌పాళా శాఖ‌


- హైద‌రాబాద్ స‌హా ఆరు మెట్రో న‌గ‌రాల్లో అందుబాటులోకి కొత్త సేవ‌లు

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 3:59PM by PIB Hyderabad

హైద‌రాబాద్ స‌హా ఆరు మెట్రో న‌గ‌రాల్లో మూడు కొత్త పోస్ట‌ల్ సేవ‌ల‌ను త‌పాళా శాఖ మంగ‌ళ‌వారం ప్రారంభించింది. 24 గంటలు, 48 గంట‌ల్లో క‌చ్చితంగా డెలివరీ అందించేలా రూపొందించిన 24 స్పీడ్ పోస్ట్‌, 24 స్పీడ్ పోస్ట్ పార్సిల్‌, 48 స్పీడ్ పోస్ట్‌ సేవ‌ల‌ను ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మ‌సాని చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో గ‌ల‌ భారతీయ విద్యాభవన్స్‌ కళాశాల ఆడిటోరియంలో సైతం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ వీణా కుమారి డెర్మల్ మాట్లాడుతూ.. ఈ కొత్త సేవ‌లను అందుబాటులోకి తీసుకురావ‌డం పోస్టల్ సేవల చ‌రిత్ర‌లో ఒక మైలురాయిగా అభివర్ణించారు. రిటైల్, బిజినెస్ వినియోగ‌దారుల‌ మారుతున్న అవసరాలను తీర్చడానికి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇండియా పోస్ట్ కొత్త సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింద‌ని ఆమె పేర్కొన్నారు. ఈ కొత్త సేవలు ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లో 38 బుకింగ్ కార్యాలయాలు, 94 డెలివరీ కార్యాలయాలు '24 స్పీడ్ పోస్ట్స్', '24 స్పీడ్ పోస్ట్ పార్శిల్' సేవలను నిర్వహిస్తాయని, అలాగే '48 స్పీడ్ పోస్ట్' సేవలను 176 బుకింగ్ కార్యాలయాలు, 94 డెలివరీ కార్యాలయాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఈ సేవల కింద వచ్చే అన్ని కన్సైన్‌మెంట్‌లను ప్రాధాన్యతగా పరిగణిస్తామ‌ని తెలిపారు.

'24 స్పీడ్ పోస్ట్' సేవ‌లు ప్ర‌త్యేకంగా డాక్యుమెంట్ల డెలివ‌రీ కోసం రూపొందించారు. బుక్ చేసిన మ‌రుస‌టి రోజు క‌ల్లా డాక్యుమెంట్ల డెలివ‌రీ పూర్త‌వుతుంది. '24 స్పీడ్ పోస్ట్ పార్శిల్' స‌ర్వీసు 5 కేజీల వరకు ఉండే పార్శిళ్ల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇవి కూడా మరుసటి రోజు క‌ల్లా డెలివరీ అవుతాయి. '48 స్పీడ్ పోస్ట్' స‌ర్వీసు ద్వారా 48 గంటలలోపు డాక్యుమెంట్ల‌ డెలివరీ జ‌రుగుతుంది. డెలివరీలో ఆలస్యమైతే కొన్ని షరతులకు లోబడి నగదు వాపసు సౌకర్యాన్ని సైతం త‌పాళా శాఖ అందిస్తుంది.

ప్రత్యేక ప్యాకేజింగ్, ఎస్ఎంఎస్‌ అలర్ట్‌లతో కూడిన‌ ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్, వ్యాపార వినియోగదారుల కోసం 'ముందు బుక్ చేసి తర్వాత చెల్లించే' సౌకర్యం, ఉచిత పికప్ సేవలు, ఓటీపీ ఆధారిత సురక్షిత డెలివరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ వంటివి అదనపు ఫీచర్లు కూడా ఈ మూడు సేవ‌ల్లో ఉన్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం.ఎస్. సుమితా అయోధ్య, హెడ్‌క్వార్టర్స్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీమతి ఎన్.ఆర్. విశాలాక్షి, తెలంగాణ సర్కిల్ పోస్టల్ అకౌంట్స్ డైరెక్టర్ శ్రీ సంపర్, హెడ్‌క్వార్టర్స్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీమతి రిప్పన్ దుల్లెట్, హెచ్.ఆర్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ వై. నరేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241309) సందర్శకుల సూచీ సంఖ్య : : 84
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English