శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక రంగాల్లో దేశ సాంకేతిక అగ్రగణ్యతకు సి-డాక్ కీలకం: ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్


· భారత అంతరిక్ష, డిజిటల్ భవితకు సి-డాక్ కీలకం: డాక్టర్ ఎస్. సోమనాథ్

· సి-డాక్ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. జాతీయ కార్యక్రమాల్లో దాని వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని వివరించిన ప్రముఖులు

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 3:51PM by PIB Hyderabad

అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (సి-డాక్) 39వ వ్యవస్థాపక దినోత్సవాన్నుద్దేశించి.. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ వర్చువల్‌గా ప్రసంగించారు. అత్యున్నత స్థాయి కంప్యూటింగ్, సైబర్ భద్రత, సెమీకండక్టర్ సాంకేతికతలు, ఇతర అధునాతన డిజిటల్ రంగాల్లో దేశ సమర్థతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందంటూ సి-డాక్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్, జాతీయ సెమీకండక్టర్ మిషన్, జాతీయ క్వాంటం మిషన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో సి-డాక్ సేవలను వివరిస్తూ... అత్యాధునిక పరిశోధన, మౌలిక సదుపాయాల ద్వారా ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ దేశ వైజ్ఞానిక, డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేస్తోందని శ్రీ ఎస్. కృష్ణన్ అన్నారు. ఆపరేటింగ్ సిస్టంలు, డేటా బేస్‌ల వంటి మౌలిక సాంకేతికతల్లో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చిన ఆయన... క్వాంటం కంప్యూటింగ్, ఆర్ఐఎస్సీ-వి, బ్లాక్ చెయిన్, ఐవోటీ వంటి అధునాతన రంగాలపై దృష్టిపెట్టడం అత్యావశ్యకమని స్పష్టం చేశారు. పరిశ్రమలు, విద్యా సంస్థలు, రక్షణ రంగాలతో బలమైన సహకారంతో పాటు.. వాస్తవిక ఫలితాలనిచ్చే అనువర్తిత పరిశోధన ప్రాధాన్యాన్ని శ్రీ కృష్ణన్ ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశ్రమలతో సి-డాక్ భాగస్వామ్యాలు విస్తరిస్తుండడం, వ్యూహాత్మక రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతుండడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌తో మొదలుపెట్టి అన్ని కేంద్రాల్లోనూ వ్యవస్థాపక దినోత్సవాల నిర్వహణ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

సమావేశాన్నుద్దేశించి ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. దేశ అంతరిక్ష, డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడంలో సి-డాక్ అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. పరమ్ సిరీస్ ద్వారా సూపర్‌కంప్యూటింగ్‌లో సంస్థ బలమైన పరంపరనూ, అలాగే అంతరిక్ష కార్యక్రమాల కోసం కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్ వ్యవస్థల అభివృద్ధిలో ఇస్రోతో సి-డాక్ సహకారాన్నీ ఆయన ప్రస్తావించారు.

అంతర్జాతీయంగా ప్రస్తుత పరిణామాలను పేర్కొంటూ... ఉపగ్రహ సమూహాల వేగవంతమైన విస్తరణ, ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త వ్యవస్థల వినియోగం పెరుగుతుండడం, అభివృద్ధి చెందుతున్న రంగాలతో అంతరిక్ష సాంకేతికతల అనుసంధానాన్ని డాక్టర్ సోమనాథ్ ప్రస్తావించారు. చిన్న ఉపగ్రహ వేదికలు, సరఫరా వ్యవస్థలు, కీలక భాగాలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతిక స్వావలంబన సాధించడం అత్యావశ్యకమని స్పష్టం చేశారు. జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన సూపర్‌ కంప్యూటింగ్ మిషన్‌ను మార్చుకోవాలని, అధునాతన కంప్యూటింగ్ - అంతరిక్ష సాంకేతికతల్లో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సి-డాక్‌ను కోరారు.

సి-డాక్ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సుదీప్ శ్రీవాస్తవ శుభాకాంక్షలు తెలిపారు. అధునాతన సాంకేతికతల్లో భారత్ సామర్థ్యాలను పెంపొందించడంలో సి-డాక్ కీలక పాత్ర పోషిస్తోందంటూ అభినందించారు. ప్రజలే కేంద్రంగా సాంకేతిక అభివృద్ధి విధానాలపై దృష్టి సారించడం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు. పరిశోదన - వాణిజ్యీకరణ మధ్య అంతరాలను తొలగించాలని, అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఆవిష్కరణ, పేటెంట్లు, ఉన్నతిని సాధించే దిశగా నిరంతర కృషి అత్యంత ప్రధానమైన అంశాలని ఆయన పేర్కొన్నారు.

ఈ 39వ వ్యవస్థాపక దినోత్సవంలో సి-డాక్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఇ. మాగేశ్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, ఎండీ డాక్టర్ రణ్‌ధీర్ ఠాకూర్, సీఎస్ఐఆర్ - భారత రసాయన సాంకేతిక సంస్థ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, ఐఐటీ- గాంధీనగర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రజత్ మూనా, రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ డీజీ (ఎంఈడీ, సీవోఎస్, సీఎస్) శ్రీమతి షీనా రాణి. ఆర్ పాల్గొన్నారు.

ఆవిష్కరణలను, స్వావలంబనను, వ్యూహాత్మక సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ.. తద్వారా కీలక, అధునాతన సాంకేతిక రంగాల్లో భారత్‌ను అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలపడంలోనూ సి-డాక్ ప్రాధాన్యాన్ని ప్రముఖులు వివరించారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2241297) సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English