సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాదులో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్‌... వేగంగా పురోగమిస్తున్న దేశ ఏవీజీసీ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు ఊతం


· సృజనాత్మక సాంకేతికతలు, కథన రీతుల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే సామర్థ్యం హైదరాబాదుకు ఉందన్న శ్రీ సంజయ్ జాజు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 3:33PM by PIB Hyderabad

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ప్రొడక్షన్, ఇన్నొవేషన్ స్టూడియో... ఐలైన్ స్టూడియోస్ ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇది దేశంలో నెట్‌ఫ్లిక్స్ పరిధిని మరింత విస్తరించడమే కాకుండా.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీసీజీ) రంగానికి సంబంధించి ఒక విశేషమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్, ఇన్నొవేషన్ వ్యవస్థను విస్తరించుకోవాలన్న నెట్‌ఫ్లిక్స్ వ్యూహంలో భాగంగా ఈ స్టూడియోను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజూ మాట్లాడుతూ.. సృజనాత్మక సాంకేతికతలు, దృశ్య శ్రవ్య కథన రీతులు, డిజిటల్ వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా ఈ నగరం నిలిచిందని వ్యాఖ్యానించారు.

 

అద్భుతమైన కథన వారసత్వం భారత్‌కు ఉందనీ, సాంకేతిక పురోగతి వల్ల కథన తీరుతెన్నులూ, వేదికల్లో వేగంగా మార్పులొస్తున్నాయనీ ఆయన అన్నారు. వినోదం నేడు కళ, సాంకేతికతల సమ్మేళనంగా మారిందనీ, ఐలైన్ స్టూడియోస్ వంటి కార్యక్రమాలు భవిష్యత్ కథన రీతులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయనీ పేర్కొన్నారు.

 

సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ.. దక్షిణాసియాలో అత్యంత ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్ స్టూడియోస్ సేవలందిస్తుందనీ, అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుందనీ శ్రీ సంజయ్ జాజూ చెప్పారు.

గతేడాది ముంబయిలో నిర్వహించిన ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సృజనాత్మక, సాంస్కృతిక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే ‘ఆరెంజ్ ఎకానమీ’ ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 15 వేలు, కళాశాలల్లో 500 ‘కంటెంట్ క్రియేటర్ ల్యాబు’ల ఏర్పాటును కేంద్ర బడ్జెటులో ప్రకటించినట్టు శ్రీ సంజయ్ జాజు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగాలకు పెట్టిందిపేరుగా ఉన్న హైదరాబాద్‌.. ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ జాజూ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే బాహుబలి వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయనీ, అలాగే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్న పలు అంతర్జాతీయ స్టూడియోలూ నగరంలో ఉన్నాయనీ గుర్తుచేశారు.

భారత సృజనాత్మక సాంకేతికతల సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాదులో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. సృజనరంగ సాంకేతికతలకూ, కంటెంటు సృజనకూ  అనువైన వాతావరణాన్ని ఇది మరింతగా కల్పిస్తుందని అన్నారు.

 

హైదరాబాదులోని ఉత్తేజకరమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేక పాన్ ఇండియా, బహుభాషా చిత్రాలను నిర్మిస్తోందని శ్రీ జాజూ అన్నారు. నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలూ, ఐలైన్ వంటి కార్యక్రమాలూ ఈ పరిశ్రమకు మరింత లబ్ధిని చేకూరుస్తాయన్నారు. దీనివల్ల ఉన్నత ప్రమాణాలతో కూడిన కంటెంట్ సృజనకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2238956) సందర్శకుల సూచీ సంఖ్య : : 72
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English