నీతి ఆయోగ్
విశాఖపట్నం ఏడీపీ, ఏబీపీ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్ (దక్షిణ) ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
09 MAR 2026 7:17PM by PIB Hyderabad
ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం, ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం (ఏడీపీ, ఏబీపీ) ద్వారా మార్చి 9, 2026న విశాఖపట్నంలో ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్ (దక్షిణ)ను నీతి ఆయోగ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, దక్షిణ భారతదేశంలోని జిల్లా పరిపాలనా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో అభివృద్ధి ఫలితాలను మెరుగుపరచడంలో సహకరించిన అనుసరణీయ జిల్లా స్థాయి ఆవిష్కరణలను, పాలనా పద్ధతుల ప్రదర్శనపై ఈ సదస్సు దృష్టి సారించింది.
నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ (ఏడీపీ, ఏబీపీ) శ్రీ రోహిత్ కుమార్ ప్రసంగిస్తూ.. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల కార్యక్రమ పురోగతిని వివరించారు. ఈ దిశగా జిల్లా, బ్లాక్ స్థాయి అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రజల భాగస్వామ్యం, వివిధ శాఖల సమన్వయంతో దీన్ని జన ఆందోళన్‌గా మార్చాలని స్పష్టం చేశారు. అనేక అభివృద్ధి సూచీలు సంతృప్త స్థాయికి చేరుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా దక్షిణ రాష్ట్రాల అద్భుత పనితీరును ఆయన ప్రశంసించారు.
ఈ సెమినార్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ అనంత్ శంకర్ సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సెమినార్‌లో మూడు ప్రధానాంశాలపై సాంకేతిక సదస్సులు జరిగాయి. ఇవి విద్య, నైపుణ్యాభివృద్ధి.. ఆరోగ్యం, పోషకాహారం, సామాజిక అభివృద్ధి.. నైపుణ్యాభివృద్ధి రంగాల్లో జిల్లా స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించాయి.
విద్య, నైపుణ్యాభివృద్ధిపై జరిగిన సాంకేతిక సదస్సు-Iలో పలు జిల్లాలు వినూత్న కార్యక్రమాలను ప్రదర్శించాయి. ప్రాథమిక అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చేపట్టిన నిర్మాణ్ కార్యక్రమాన్ని, గ్రామీణ యువతలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఎన్టీఆర్ జిల్లా రూరల్ ఇంక్యుబేషన్ సెంటర్ నమూనాను వివరించాయి.
ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై జరిగిన సాంకేతిక సదస్సులు - II, III.. మహిళలు, పిల్లల్లో రక్తహీనతను నివారించేందుకు బీదర్ జిల్లా చేపట్టిన అనీమియా ముక్త్ కార్యక్రమాన్ని, మాతృత్వ ఆరోగ్య ఫలితాలను మెరుగుపరిచేందుకు నిర్మల్ జిల్లా అమలు చేస్తున్న అమ్మ రక్షిత కార్యక్రమంతో సహా పలు వినూత్న ఉత్తమ పద్ధతులను వివరించాయి. యువత నైపుణ్యాలను పెంపొందించటానికి జిల్లా స్థాయిలో చేపట్టిన వినూత్న పద్ధతులను, అదనపు ఆవిష్కరణలను కర్నూలు జిల్లా కలెక్టర్ పంచుకున్నారు.
ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల కార్యక్రమ అమలును బలోపేతం చేయటానికి జిల్లాలు పరస్పరం నేర్చుకోవటం, విజయవంతమైన నమూనాల డాక్యుమెంటేషన్, స్థానిక పరిస్థితులకనుగుణంగా ఆవిష్కరణల విస్తరణ వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ విధానాల సంకలనాన్ని ఆవిష్కరించారు. ఇందులో దక్షిణ రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి ప్రభావవంతమైన కార్యక్రమాలను పొందుపరిచారు. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సేవలను మెరుగుపరచటానికి, అభివృద్ధి ఫలితాలను సాధించటానికి ఇదొక అనుసరణీయ నమూనాల నిధిగా ఉపయోగపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2237296)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8