రక్షణ మంత్రిత్వ శాఖ
అతి స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ వైమానిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 9:35PM by PIB Hyderabad
ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వేదికగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అతి స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థ (వీఎస్‌హెచ్‌వోఆర్ఏడీఎస్)కు చెందిన మూడు వరుస వైమానిక సపరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. వివిధ వేగాలు, పరిధులు, ఎత్తుల్లో ఎగురుతూ వచ్చే హై-స్పీడ్ ముప్పులను తటస్థీకరించడంలో వీఎస్‌హెచ్‌వోఆర్ఏడీఎస్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని తిరిగి ధ్రువీకరించడానికి ఈ పరీక్షలు నిర్వహించారు.
అన్ని వైమానిక పరీక్షల సమయంలోనూ, మన క్షిపణులు వివిధ రకాల ముప్పు పరిస్థితుల్లో శత్రు విమానాలను అనుసరిస్తూ, తీవ్రమైన ముప్పు గల అన్ని ప్రాంతాలను ఎదుర్కొంటూ హై-స్పీడ్ వైమానిక లక్ష్యాలను అడ్డగించి నాశనం చేశాయి. ఫీల్డ్ ఆపరేటర్లు లక్ష్యాన్ని గుర్తించి, క్షిపణి ద్వారా కాల్పులు జరిపే ప్రక్రియ ద్వారా ఈ వ్యవస్థ సరిగ్గా, సమర్థంగా, సురక్షితంగా పని చేస్తుందని నిర్ధారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.
చాందీపూర్‌లోని ఐటీఆర్ వేదికగా ఏర్పాటు చేసిన టెలిమెట్రీ, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, రాడార్ల వంటి వివిధ శ్రేణి పరికరాల ద్వారా సంగ్రహించిన విమాన డేటా, విస్తృత శ్రేణి వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో వీఎస్‌హెచ్‌వోఆర్ఏడీఎస్ ప్రభావాన్ని ధ్రువీకరించింది. డీఆర్‌డీవో సీనియర్ అధికారులు, అభివృద్ధి- ఉత్పత్తి భాగస్వాములతో పాటు ఉమ్మడి దళాల ప్రతినిధుల సమక్షంలో ఈ వినియోగదారు ధ్రువీకరణ వైమానిక పరీక్షలు జరిగాయి.
వీఎస్‌హెచ్‌వోఆర్ఏడీఎస్ అనేది ఇతర డీఆర్‌డీవో ప్రయోగశాలలు, అభివృద్ధి-ఉత్పత్తి భాగస్వాముల సహకారంతో పరిశోధనా కేంద్రం ఇమారత్ ద్వారా దేశీయంగా రూపొందించిన, అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ వైమానిక రక్షణ వ్యవస్థ. ఈ క్షిపణి వ్యవస్థ సాయుధ దళాల మూడు విభాగాలైన భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ వ్యవస్థ వైమానిక పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో, సాయుధ దళాలు, పరిశ్రమలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. వీఎస్‌హెచ్‌వోఆర్ఏడీఎస్ నిర్వహించిన మూడు వరుస వైమానిక పరీక్షలు గొప్ప విజయాన్ని సాధించాయని, ఈ వ్యవస్థను త్వరలోనే సాయుధ దళాల్లో చేర్చవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధిలో పాల్గొన్న మొత్తం డీఆర్‌డీవో బృందాన్ని, సాయుధ దళాలను, పరిశ్రమ భాగస్వాములను రక్షణ శాఖ కార్యదర్శి, పరిశోధనాభివృద్ధి సంస్థ-డీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2234089)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4