వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నకిలీ ఐఎస్ఐ మార్క్‌తో విద్యుత్ కేబుళ్ల త‌యారీ.. బీఐఎస్ అధికారుల దాడి!


* రూ.5 లక్షల విలువైన పీవీసీ వైర్లు, కేబుళ్లు స్వాధీనం

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 2:53PM by PIB Hyderabad

న‌కిలీ ఐఎస్ఐ మార్కుతో విద్యుత్ వైర్లు, కేబుళ్లు త‌యారు చేస్తున్న ఓ ప‌రిశ్ర‌మ‌లో భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS), హైదరాబాద్ శాఖ అధికారులు సోమ‌వారం ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు. చ‌ర్ల‌ప‌ల్లి పారిశ్రామిక వాడ‌లో ఉన్న ఓ ప‌రిశ్ర‌మ‌లో కొన్నేళ్లుగా బీఐఎస్ అనుమ‌తి లేకుండా కేబుళ్ల‌ను త‌యారీ చేయ‌డంతో పాటు న‌కిలీ ఐఎస్ఐ ముద్ర‌లు, లైసెన్సు నెంబ‌ర్ల‌తో ఉత్ప‌త్తులు స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌న్న స‌మాచారంతో అధికారులు దాడులు నిర్వ‌హించారు. బీఐఎస్ డైరెక్ట‌ర్, శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ ఆదేశాల‌తో.. డైరెక్ట‌ర్ త‌న్నీరు రాకేశ్ నేతృత్వంలోని అధికారుల‌ బృందం చేసిన ఈ తనిఖీల్లో వివిధ బ్రాండ్లకు చెందిన 200కుపైగా పీవీసీ ఇన్సులేటెడ్ విద్యుత్ వైర్లు, కేబుళ్లు నకిలీ ఐఎస్ఐ మార్క్‌తో నిల్వ ఉంచి విక్రయానికి సిద్ధం చేసినట్లు గుర్తించారు. గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తులన్నీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ల (QCOs) పరిధిలోకి వస్తాయి. వీట‌న్నింటికీ బీఐఎస్ అనుమ‌తి, ఐఎస్ఐ మార్కు త‌ప్ప‌నిస‌రి. అయితే, సంబంధిత ప‌రిశ్ర‌మ నిర్వాహ‌కులు బీఐఎస్ నుంచి ఎలాంటి అనుమ‌తులు పొంద‌కుండానే న‌కిలీ ఐఎస్ఐ మార్కు, లైసెన్సు నెంబ‌రును వినియోగించి బీఐఎస్ చ‌ట్టం-2016లోని సెక్ష‌న్ 17ను ఉల్లంఘించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. న‌కిలీ ఐఎస్ఐ ముద్ర ఉన్న డ‌బ్బాల‌తో పాటు, రూ.5ల‌క్ష‌ల విలువైన కేబుళ్ల‌నూ జ‌ప్తు చేసిన‌ట్లు తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డ‌ర్ల పరిధిలోకి వచ్చే ఉత్పత్తులను బీఐఎస్‌ ధృవీకరణ లేకుండా తయారు చేయడం, దిగుమ‌తి చేసుకోవ‌డం, నిల్వ చేయడం లేదా విక్రయించడం నిషేధం. ఇందులో తొలి ఉల్లంఘనకు రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా, తదుపరి ఉల్లంఘనలకు కనీసం రూ.5 లక్షల జరిమానా లేదా వ‌స్తువుల విలువ‌కు ప‌దిరెట్ల వ‌ర‌కూ జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంద‌ని.. నిందితుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. 

ఈ సందర్భంగా బీఐఎస్‌ హైదరాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. వినియోగ‌దారుల అప్ర‌మ‌త్త‌తోనే న‌కిలీని అరిక‌ట్ట‌డం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. వ‌స్తువులు కొనేముందు ఐఎస్ఐ ముద్ర నిజ‌మైన‌దో కాదో బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ప‌రిశీలించాల‌ని కోరారు. ఒక‌వేళ ఐఎస్ఐ ముద్ర న‌కిలీద‌ని తేలినా, నాణ్య‌త స‌రిగా లేక‌పోయినా అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయాల‌ని తెలిపారు. బంగారు ఆభ‌ర‌ణాల శుద్ధ‌త‌నూ, హాల్‌మార్కింగ్ వివ‌రాల‌తో పాటు ఎల‌క్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల నాణ్య‌త వివ‌రాల‌నూ ఈ యాప్ ద్వారా స‌రిచూసుకోవ‌చ్చ‌న్నారు. త‌యారీదారులు బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ లేకుండా ఉత్ప‌త్తులు త‌యారు చేసినా, దిగుమ‌తి చేసుకున్నా, విక్ర‌యించినా క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు.


Reach us at +91 8179524479 for more information


(రిలీజ్ ఐడి: 2232328) సందర్శకుల సూచీ సంఖ్య : : 77
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English