గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (ఎన్ఏఏఆర్ఎం) లో నూతనంగా నిర్మించిన ‘క్షమత భవన్ ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
నాడు పోస్టు చేయడమైనది:
21 FEB 2026 9:28PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (ఎన్ఏఏఆర్ఎం) లో క్షమత భవన్ ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు (2026 ఫిబ్రవరి 21) ప్రారంభించారు. ఐసీఏఆర్ - నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ భవనం ప్రారంభం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
క్షమత భవన్ ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం మౌలిక సదుపాయాలకు ఒక ముఖ్యమైన జోడింపు. ఈ భవనం కేవలం ఒక కట్టడమే కాకుండా, వ్యవసాయ రంగంలోని వివిధ భాగస్వాముల, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రంగా పనిచేస్తుంది.
హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ సంస్థల పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. అన్ని ఐసీఏఆర్ సంస్థల కృషిని అభినందిస్తూ, ముఖ్యంగా నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేలా, రైతుల ఆదాయాన్ని పెంచేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతకుముందు, డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాంగి లాల్ జాట్ శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపారు. వ్యవసాయ శాస్త్రీయ పరిశోధనల్లో ఆలోచనలు, వనరులను వినియోగించేటప్పుడు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, వినూత్నంగా ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (మత్స్య, వ్యవసాయ విద్య) డాక్టర్ జయకృష్ణ జెనా కూడా పాల్గొన్నారు.
ఐకార్ - నార్మ్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి నార్మ్ చేపడుతున్న వివిధ సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు, సంస్థ సాధించిన విజయాల గురించి వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 2231388)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15