ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో భారత నాయకత్వం గురించి వివరిస్తూ "ఏఐ కేవలం భారత్ కోసమే కాదు.. యావత్ ప్రపంచం కోసం" అని వ్యాఖ్యానించిన కేంద్ర ఎంఈఐటీవై సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద

నైతిక వ్యవస్థ నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే భవిష్యత్ ఏఐ కోసం మొదటి రోజే పునాది వేసిన నాయకులు

భారతదేశ ఏఐ దార్శనిక ఆవిష్కరణ: 2026 ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభోత్సవ విశేషాలు

డేటా సార్వభౌమాధికారం, డిజిటల్ విశ్వాసం, శ్రామిక శక్తి నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలే లక్ష్యంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో సమావేశమైన విధాన రూపకర్తలు, పారిశ్రామిక నేతలు

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 10:34PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మొదటి రోజున అంతర్జాతీయ విధాన రూపకర్తలు, వివిధ సంస్థలు, సాంకేతిక రంగంలోని ప్రముఖులు, ఆవిష్కర్తలు, పారిశ్రామిక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

 

తొలిరోజు చర్చల్లో భాగంగా అంతర్జాతీయంగా ఏఐ రంగంలో భారతదేశం పోషించబోయే కీలక పాత్రపై ప్రపంచవ్యాప్త మేధావులు చర్చించారు. కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా పటిష్ఠమైన సంస్థాగత రూపకల్పన, మౌలిక సదుపాయాల ప్రణాళికలతో భారత ఏఐ వ్యూహానికి స్పష్టమైన మార్గసూచిని రూపొందించడంపై ప్రధానంగా చర్చలు సాగాయి.

 

బాధ్యతాయుతమైన పాలన, సార్వభౌమాధికారం, ఏఐ ద్వారా ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, సిద్ధాంతం నుంచి అమలు వరకు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ వ్యవస్థ నిర్మాణం వంటి ప్రధానాంశాలపై తొలి రోజు చర్చించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద ప్రసంగిస్తూ.. ఏఐ అభివృద్ధిలో భారత్ కీలక పాత్రను తెలియజేశారు.“ఏఐ కేవలం భారతదేశం కోసమే కాదు.. మొత్తం ప్రపంచం కోసం. యావత్ ప్రపంచానికి ఏఐ సేవల ప్రదాతగా భారత్ నిలుస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి కూడా మనం తోడ్పడాలి” అని తెలిపారు.

 

సార్వభౌమ, అందరికీ అందుబాటులో ఉండే ఏఐ హార్డ్‌వేర్ వ్యవస్థల అవసరాన్ని స్పష్టం చేస్తూ ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణ "హార్డ్‌వేర్ ఆధారిత సార్వభౌమాధికారం: గ్లోబల్ సౌత్ కోసం ధ్రువీకరించిన సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ మౌలిక సదుపాయాలు" శీర్షికన జరిగిన చర్చలో మాట్లాడారు. "డేటా సెంటర్లు, ఏఐ ఆధారిత కంప్యూట్ మౌలిక సదుపాయాలను భారీగా నెలకొల్పేందుకు ప్రైవేట్ రంగాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. ఏఐ కంప్యూట్ స్థాపనకు నేరుగా సబ్సిడీ ఇవ్వటానికి బదులుగా దాన్ని వినియోగించుకునేందుకు సబ్సిడీ కల్పిస్తామని మేం చెప్పాం. మార్కెట్‌కు భరోసా ఇస్తూ.. పరిశోధకులు, ఆవిష్కర్తలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, విద్యార్థులందరికీ సరసమైన ధరలకే ఏఐ కంప్యూట్ అందుబాటులో ఉండేలా చూశాం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దాదాపు మూడో వంతు తక్కువ ధరకే భారత్‌లో ఏఐ కంప్యూట్‌ను పొందవచ్చు" అని వివరించారు.

 

ఈ సదస్సు మొదటి రోజున అత్యంత కీలక ఘట్టం 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ బిల్డథాన్' ముగింపు వేడుక. అందరికీ ఏఐ అందుబాటులో ఉండేలా చేయటమే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమం ఇది. సదస్సుకు ముందు 21 నగరాల్లో 48 కార్యశాలలను నిర్వహించి, 10,000 మందికి పైగా విద్యార్థులను భాగస్వాములను చేశారు. దీన్ని అఖిల భారత స్థాయి హ్యాకథాన్‌గా విస్తరించగా, 100 నగరాల నుంచి 40,000 మంది శిక్షణార్థులు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు.

 

సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, సాంకేతిక రంగంతో సంబంధం లేని వారు కూడా ప్రాథమిక అవగాహన పొందేలా నాలుగు ప్రారంభ స్థాయి ఏఐ కోర్సులను పూర్తి చేశారు. ఈ ప్రతిభావంతుల సమూహం నుంచి ఎంపికైన 850 మంది ఫైనలిస్టులు 200 బృందాలుగా ఏర్పడి తుది రౌండ్లలో పోటీ పడ్డారు. ఎంపిక చేసిన అత్యుత్తమ ఆరు బృందాలు (మూడు విద్యార్థి బృందాలు, మూడు నిపుణుల బృందాలు) ఆర్థిక, డిజిటల్ మోసాలను అరికట్టేందుకు వారు రూపొందించిన ఏఐ ఆధారిత పరిష్కారాలను సదస్సు తొలి రోజున ప్రత్యక్షంగా ప్రదర్శించాయి. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యా రంగాల ప్రముఖులతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం వీరి ఆవిష్కరణలను పరిశీలించింది.

 

ఎంఈఐటీవై అదనపు కార్యదర్శి, ఇండియా ఏఐ మిషన్ సీీఈవో, ఎన్‌ఐసీ డైరెక్టర్ జనరల్ శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ.. "ప్రభావాన్ని చూపే, మార్పును తీసుకువచ్చే, పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణల నిర్మాణానికి ఇక్కడికి వచ్చిన మీలోనే భారతదేశ అసలైన శక్తి, సామర్థ్యం దాగి ఉన్నాయి" అని అన్నారు."ఐటీ సేవల నుంచి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయల వరకు సాంకేతిక రంగంలో భారతదేశ బలాన్ని ప్రపంచం ఇప్పటికే గుర్తించింది. ఆధార్, యూపీఐ వంటి వేదికలు పాలనను, చెల్లింపుల వ్యవస్థను పూర్తిగా మార్చాయి. వాస్తవానికి ఈ సదస్సు కోసం విదేశీ ప్రతినిధులకు కూడా యూపీఐ సదుపాయం కల్పించేలా మేం ఆర్బీఐ అనుమతి పొందాం. దీనివల్ల వన్ వరల్డ్ వాలెట్ ద్వారా మన దేశంలోని అంతరాయం లేని డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని వారు పొందగలుగుతారు" అని తెలిపారు.

జాతీయ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనటంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ఎంతగా దోహదపడుతుందో, అంతర్జాతీయ స్థాయిలో భారత ఏఐ స్థానాన్ని ఎలా బలోపేతం చేస్తుందో ఈ సదస్సు స్పష్టం చేసింది.

 

‘విశ్వసనీయమైన ఏఐ: ఆవిష్కరణలు, నియంత్రణల మధ్య సమతుల్యత’ అంశంపై జరిగిన చర్చలో, నియంత్రణ చట్టాలు, సాంకేతిక పురోగతి సమాంతరంగా ఎలా ముందుకు సాగాలనే అంశాన్ని నిపుణులు విశ్లేషించారు. ఇందులో భాగంగా పారదర్శకత, వివరణాత్మకత, పరిపాలనా వ్యవస్థలు, బాధ్యతాయుతమైన నిర్మాణాలు, మానవ పర్యవేక్షణ ప్రాముఖ్యతపై కీలక చర్చలు జరిగాయి.

 

‘ఓపెన్ సోర్స్ ఏఐని కార్యరూపంలోకి తీసుకురావటం: సార్వభౌమాధికారానికి మార్గాలు’ శీర్షికతో జరిగిన సదస్సులో నిపుణులు, విధాన రూపకర్తలు ఏఐ యుగంలో సార్వభౌమాధికారం పట్ల మారుతున్న నిర్వచనంపై మరింతగా చర్చించారు. కేవలం ఏఐ మోడల్‌పై యాజమాన్యం హక్కులుండటం డిజిటల్ సార్వభౌమాధికారం అనిపించుకోదని, ఏఐ స్టాక్ మొత్తంలో స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటమే అసలైన సార్వభౌమాధికారమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కంప్యూట్ మౌలిక సదుపాయాలు, పాలనా వ్యవస్థలు, తనిఖీ సామర్థ్యం గల ప్రక్రియల వంటివన్నీ ఆ దేశం లేదా సంస్థ నియంత్రణలో ఉండటం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.

 

డిజిటల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థల లేదా దేశాల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైన అంశాన్ని ప్రస్తావిస్తూ, కీలకమైన వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ పటుత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ వేదిక స్పష్టం చేసింది. ఇందులో సెమీకండక్టర్ హార్డ్‌వేర్ మొదలుకుని, పరస్పర అనుసంధానత కలిగిన పాలనా ప్రమాణాల వరకు అన్నీ భాగమేనని పేర్కొంది. ఒక దేశం డిజిటల్ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవాలంటే, సార్వభౌమాధికారం కేవలం మాటల్లో కాక.. దృఢమైన మౌలిక సదుపాయాల వ్యూహాలు, స్పష్టమైన నియంత్రణ విధానాలు, స్వదేశీ అభివృద్ధి వ్యవస్థలను ప్రోత్సహించటం ద్వారానే సాధ్యమవుతుందని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 

‘కార్మిక శక్తి పరివర్తన, ఆర్థిక చలనశీలత’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి చర్చా వేదిక, ఏఐ విప్లవం ద్వారా వస్తున్న నిర్మాణాత్మక మార్పులను పరిశీలించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఏఐ ద్వారా వస్తున్న మార్పులను ఉపయోగించుకుని ఆర్థిక చలనశీలతను పెంపొందించుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చ సాగింది. ఇందులో భాగంగా కార్మిక మార్కెట్ల క్రమబద్దీకరణ, నైపుణ్యాల బదిలీ సౌకర్యం, భవిష్యత్ కార్మిక దళంలో లింగ సమానత్వం వంటి కీలక అంశాలపై దృష్టి సారించారు.

 

ఏఐ సంసిద్ధత విడిగా చూడాల్సిన అంశం కాదని, దాన్ని జాతీయ ఉపాధి వ్యూహాలతో అనుసంధానం చేయాలని వక్తలు స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను కేవలం శిక్షణతోనే కాక.. వాటి ద్వారా పెరిగిన ఉత్పాదకత, ఆదాయ వృద్ధి ఆధారంగా కొలవాలని ఈ ప్యానెల్ సభ్యులు సూచించారు. తద్వారా కార్మిక రంగంలోని నిర్మాణపరమైన సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.

 

‘ప్రభావవంతమైన ఓపెన్ డేటాకు ఒక అవకాశంగా ఏఐ’ శీర్షికతో జరిగిన సదస్సులో ఓపెన్ డేటా వ్యవస్థలకు, కృత్రిమ మేధకు మధ్య పరస్పర పటిష్ఠతను పెంచే వ్యవస్థపై చర్చించారు. ఏఐ మోడల్స్ శిక్షణను బలోపేతం చేయటానికి ఓపెన్ డేటా సెట్లు ఎంత అవసరమో, ప్రభుత్వ సమాచారాన్ని సామాన్యులకు సైతం సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలోనూ ఏఐ సాధనాలు అంతే కీలకమని వక్తలు తెలిపారు.

 

ఈ చర్చలు "ఏఐ-రెడీ" డేటాసెట‌్ల ఆవశ్యకతను స్పష్టం చేశాయి. ఈ డేటాసెట్లు స్పష్టమైన మూలాలు, ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే ప్రమాణాలతో ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ డేటా ప్రవాహాలను సమర్థవంతంగా నిర్వహించటానికి జాతీయ గణాంక కార్యాలయాల సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని ప్యానెల్ పిలుపునిచ్చింది. ఏఐ ఆవిష్కరణలకు, సుపరిపాలనకు బలమైన పునాదిగా ప్రభుత్వ డేటా ఉపయోగపడుతుందని పేర్కొంది.

 

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 తొలి రోజు కార్యక్రమాలు, అంతర్జాతీయ ఏఐ రంగంలో ఒక శక్తిమంతమైన కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. కేవలం సాంకేతికతను వినియోగించుకునే దేశంగానే కాక భారీ స్థాయిలో విస్తరించగలిగే, బాధ్యతాయుతమైన, ఆర్థిక విప్లవాన్ని తీసుకురాగల ఏఐ పరిష్కారాలను సృష్టించే దేశంగా భారత్ ఆవిర్భవించిందని ఈ సదస్సు చాటిచెప్పింది. అత్యాధునిక ఏఐ నమూనాలు, సంస్థాగత పరివర్తన, ఏఐ భద్రత, స్టార్టప్ వ్యవస్థలు, పెట్టుబడి ధోరణులు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. విశ్వాసం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి లక్ష్యాలతో, నూతన ఆవిష్కరణల దిశగా భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని ఈ చర్చలు ప్రతిబింబించాయి.


(రిలీజ్ ఐడి: 2229065) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी