సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో సివిల్ సర్వీసు ఉద్యోగుల కోసం ఏఐ ఆధారిత సామర్థ్య పెంపును ప్రదర్శిస్తున్న మిషన్ కర్మయోగి
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 4:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో డిజిటల్, ఏఐ ఆధారిత అభ్యాసం ద్వారా ప్రభుత్వవ్యాప్తంగా సామర్థ్య పెంపును బలపరుస్తూ సివిల్ సర్వీసెస్ రంగంలో భారీ సంస్కరణలకు 'మిషన్ కర్మయోగి' శ్రీకారం చుట్టింది.
ప్రజా ప్రయోజనం కోసం ఏఐ పరివర్తనాత్మక వినియోగాలను అన్వేషించే లక్ష్యంతో ఢిల్లీలోని భారత్ మండపంలో 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026'లో ప్రత్యేక స్టాల్ ద్వారా ఏఐ-ఆధారిత అభ్యాసం, పరిపాలన పరిష్కారాలను మిషన్ కర్మయోగి ప్రదర్శిస్తోంది.
కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ), కర్మయోగి భారత్ (కేబీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ స్టాల్.. ఐజీఓటీ కర్మయోగి వేదికలో విలీనం చేసిన సరికొత్త ఏఐ ఆధారిత అభ్యాస సాధనాలను పరిచయం చేస్తోంది. ఈ సాధనాలు అభ్యాసాన్ని వ్యక్తిగతీకరించడానికి, బాధ్యతల ఆధారంగా బహుభాషా సౌలభ్యంతో రోజువారీ పరిపాలనా విధుల్లో అంతర్భాగంగా ఉండేలా రూపొందించారు.
ప్రదర్శనలో ఉన్న ప్రధాన ఏఐ ఆధారిత ఫీచర్లు:
-
ఏఐ ఆధారిత సామర్థ్య పెంపు ప్రణాళికలు (ఏఐ-సీబీపీ): ఇది అధికారుల బాధ్యతలు, ప్రభుత్వ పత్రాలను విశ్లేషించి వారి నైపుణ్యాలను మ్యాప్ చేయటం, సామర్థ్యాల్లోని లోపాలను గుర్తించటం, వివిధ మంత్రిత్వ శాఖలు - విభాగాల కోసం హోదా ఆధారిత అభ్యాస మార్గాలను రూపొందిస్తుంది. ఇది వేగవంతమైన, డేటా-ఆధారిత ప్రణాళికకు దోహదపడుతుంది.
-
ఏఐ సారథి: ఇది ఒక సంభాషణ రూపంలో ఉండే ఏఐ అభ్యాస గైడ్. అధికారులు హోదా, బాధ్యతలు, ప్రస్తుత పని అవసరాలకు అనుగుణంగా సరైన కోర్సులు, వనరులను కనుగొనడంలో ఇది సహాయపడుతుంది.
-
ఏఐ ట్యూటర్: ఇది కోర్సు సమయంలో సహాయపడే అసిస్టెంట్. సంక్లిష్టమైన అంశాలను సరళంగా వివరించడం, అభ్యాసకుల సందేహాలకు సమాధానమివ్వడం, కోర్సు మాడ్యూల్స్ సారాంశాలను సందర్భోచితంగా అందించడం దీని ప్రత్యేకత.
-
ఏఐ-ఆధారిత ట్రాన్స్క్రిప్షన్, బహుభాషా సబ్‌టైటిల్స్: అభ్యాసాన్ని మరింత సమ్మిళితంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు వివిధ భారతీయ భాషల్లో ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్ట్లు, సబ్‌టైటిల్స్‌ను ఇది అందిస్తుంది.
-
ఏఐ రికమెండేషన్స్ ఇంజిన్: అభ్యాసకుని ప్రొఫైల్, హోదా, గత అభ్యాస ప్రవర్తన ఆధారంగా వ్యక్తిగతీకరించిన కోర్సులను సూచిస్తుంది. ఇది నిరంతర, లక్ష్య ఆధారిత నైపుణ్యాభివృద్ధికి వీలు కల్పిస్తుంది.
ప్రభుత్వ శాఖల్లో ఏఐ అక్షరాస్యత, ఏఐ వినియోగ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏజీఓటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్న ఏఐ కోర్సుల విస్తృత జాబితాను కూడా ఈ స్టాల్ ప్రదర్శిస్తోంది. ఈ కోర్సులు ఏఐ ప్రాథమికాంశాలు, పరిపాలనలో ఏఐ అన్వయం, సంస్థాగత ఏఐ వ్యూహం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లోని రిస్కులు-అవకాశాలు వంటి అంశాల గురించి ఉంటాయి.
సదస్సు కార్యక్రమాల్లో భాగంగా 2026 ఫిబ్రవరి 20న “వికసిత్ భారత్ కోసం ఏఐ: సామర్థ్య పెంపుకు ఉన్న ఆవశ్యకత” అనే అంశంపై ప్యానెల్ చర్చ నిర్వహిస్తున్నారు. ఏఐ-ఆధారిత అభ్యాస వ్యవస్థల ద్వారా పరిపాలనా ఫలితాలు, సంస్థాగత సామర్థ్యాన్ని ఎలా వేగవంతం చేయవచ్చనే అంశంపై చర్చించేందుకు వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులు ఇక్కడ ఒకచోట చేరుతున్నారు.
దీనికి ముందు విజ్ఞాన్ భవన్‌లో “సామర్థ్య పెంపు కోసం ఏఐ: పరిపాలనలో పరివర్తన” అనే అంశంపై సదస్సు ముందు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఏఐ కార్యక్రమాలు, ప్రభుత్వ రంగ సామర్థ్య అభివృద్ధి మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించడానికి ఇది ఒక పునాదిగా నిలిచింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సర్వీసెస్ సామర్థ్య పెంపు సంస్కరణ ఈ మిషన్ కర్మయోగి. పరిపాలనను 'నిబంధనల ఆధారిత' వ్యవస్థ నుంచి 'బాధ్యతల ఆధారిత' వ్యవస్థగా మార్చాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఈ సంస్కరణకు మూలస్తంభం 'ఐజీఓటీ కర్మయోగి' వేదిక. ఇది సివిల్ అధికారుల సామర్థ్య పెంపు కోసం భారత్ రూపొందించిన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయం. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 1.4 కోట్లకు పైగా వినియోగదారులు ఈ వేదికలో చేరారు. వీరికి నిరంతర అభ్యాసం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం 4,300 కంటే ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సదస్సులో ఏర్పాటు చేసిన మిషన్ కర్మయోగి స్టాల్.. ప్రభుత్వ సేవా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, పరిపాలనా ఫలితాలను మెరుగుపరచడానికి 'బాధ్యతాయుతమైన ఏఐ'ని వినియోగించుకోవడంలో భారత ప్రభుత్వం చూపుతున్న నిరంతర నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2228935)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12