ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రజారోగ్య కేంద్రాల్లో అధికారుల, సిబ్బంది లభ్యతపై తాజా సమాచారం
దేశంలో నమోదైన అలోపతి వైద్యులు 13,88,185 మంది.. ఆయుష్ చికిత్సకులు 7,51,768 మంది
దేశంలో ప్రతి 811 మందికీ ఒక డాక్టర్ ఉన్నారు.. ఇది డబ్ల్యూహెచ్ఓ ప్రామాణికమైన ప్రతి 1,000 మందికీ ఒక డాక్టర్ నిష్పత్తి కన్నా మెరుగు
దేశంలో ప్రస్తుతం నర్సింగ్ సేవల్లో ఉన్న వారు 39.40 లక్షల మంది సిబ్బంది
దేశంలో నర్సింగ్ సిబ్బంది అవసరాన్ని తీర్చడానికి 806 ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 5310 నర్సింగ్ సంస్థల్లో
ఏటా సుమారు 3.82 లక్షల మందికి పూర్తి అవుతున్న శిక్షణ
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2026 1:51PM by PIB Hyderabad
ఇండియా హెల్త్ డైనమిక్స్ (హెచ్‌డీఐ) (మౌలిక సదుపాయాలు, మానవ వనరులు), 2022-23 ఏడాదికి ఒక సారి వెలువడే ప్రచురణ. దీనిని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చే ఆరోగ్య సంరక్షణ రంగ పరిపాలన సంబంధిత సమాచారం ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రజారోగ్య కేంద్రాల్లో డాక్టరు, నర్సు, స్పెషలిస్టు లభ్యత నిష్పత్తుల వివరాలను హెచ్‌డీఐ 2022-23 లో ఇచ్చిన ఈ కింది లింకులో చూడవచ్చును.
https://mohfw.gov.in/sites/default/files/Health%20Dynamics%20of%20India%20%28Infrastructure%20%26%20Human%20Resources%29%202022-23_RE%20%281%29.pdf
దేశంలో నమోదైన ఇంగ్లిషు వైద్యులు 13,88,185 మంది, ఆయుష్ చికిత్సకులు 7,51,768 మంది ఉన్నారు. అలోపతి, ఆయుష్ .. ఈ రెండు వ్యవస్థల్లోనూ నమోదైన చికిత్సకుల్లో 80 శాతం అందుబాటులో ఉన్నారనుకొంటే.. అప్పుడు డాక్టరు, జనసంఖ్య నిష్పత్తి 1:811గా ఉండవచ్చు; అంటే ప్రతి 811 మందికి ఒక డాక్టరు చొప్పున అందుబాటులో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణం అయిన 1:1000 (ప్రతి వేయి మందికి ఒక డాక్టరు) నిష్పత్తి కన్నా మెరుగ్గా ఉంది.
భారతీయ నర్సింగ్ మండలి (ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్..ఐఎన్‌సీ) అందించిన సమాచారం మేరకు, దేశంలో 39.40 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వారిలో 80 శాతం మంది క్రియాశీలురుగా ఉన్నారనుకున్నా, అప్పుడు ప్రతి 1,000 మంది జన సంఖ్యకూ 2.23 నర్సులు ఉన్నట్లు లెక్క తేలుతుంది. దేశంలో నర్సింగ్ సిబ్బంది అవసరాలు తీర్చడానికి 806 ప్రభుత్వ సంస్థలలో సహా మొత్తం 5310 నర్సింగ్ సంస్థలు ఒక్కో సంవత్సరానికీ సుమారు 3.82 లక్షల మంది నర్సింగ్ సిబ్బందిని తీర్చిదిద్దుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం సహా ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠపరచడం ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాథమిక బాధ్యత. జాతీయ ఆరోగ్య మిషన్ (నేషనల్ హెల్త్ మిషన్..ఎన్‌హెచ్ఎం)లో భాగంగా కార్యక్రమాల అమలు ప్రణాళిక (పీఐపీ)ల రూపంలో అందుకున్న ప్రతిపాదనల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్ఠపరచడానికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నియమాలు, అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతిపాదనలకు రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ (ఆర్ఓపీ)ల రూపంలో ఆమోదాన్ని తెలియజేస్తుంది. దీర్ఘకాలానికి భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల (ఐపీహెచ్ఎస్) ప్రకారం, తగినంత సంఖ్యలో నియమిత (రెగ్యులర్) పోస్టులను కల్పిస్తూ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మానవ వనరులు లభ్యమయ్యేటట్లు చూడాల్సి ఉంటుంది. స్వల్ప కాలానికీ, మధ్య కాలానికీ కీలక లోటులను భర్తీ చేయడం కోసం ఎన్‌హెచ్ఎం పదవులను ఉపయోగించుకొంటారు. రెండో స్థాయి, ప్రాథమిక స్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రాల (జిల్లా ఆసుపత్రి, అంతకన్నా కింది స్థాయి)లో మానవ వనరుల లోటును ఐపీహెచ్ఎస్ ప్రకారం ఎన్‌హెచ్ఎమ్ భర్తీ చేసి, రెగ్యులర్ మానవ వనరులను సమకూరుస్తుంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ రాజ్యసభలో ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2226124)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3