రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సముద్ర, గగనతల పరమైన సమన్వయ ఆపరేషన్ ద్వారా అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ రాకెట్‌ను పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2026 10:53AM by PIB Hyderabad

అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ రాకెట్‌ను భారత తీర రక్షక దళం (ఐసీజీ) విజయవంతంగా ఛేదించింది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో సముద్ర, గగనతల బృందాల సమన్వయంతో అత్యంత పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా యుద్ధం, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల నుంచి పెద్దఎత్తున చమురు, చమురు ఆధారిత కార్గోను అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఈ ఆపరేషన్ అడ్డుకుంది.

ఫిబ్రవరి 5, 2026న ముంబైకి పశ్చిమాన సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో మూడు అనుమానాస్పద నౌకలను భారత కోస్ట్ గార్డ్ నౌకలు అడ్డుకున్నాయి. వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయటం, వాటిలో లభించిన ఎలక్ట్రానిక్ డేటాను విశ్లేషించటం, పత్రాల ధ్రువీకరణ, సిబ్బందిని విచారించటం ద్వారా ఐసీజీ స్పెషలిస్ట్ బోర్డింగ్ బృందాలు ఈ నేరానికి సంబంధించిన పూర్తి వ్యవస్థను, నేరగాళ్లు అనుసరించిన పద్ధతిని తెలుసుకోగలిగాయి.

ఈ స్మగ్లింగ్ ముఠా, తక్కువ ధరకు లభించే చమురును సముద్రంలో నౌకల ద్వారా రవాణా చేసి, అంతర్జాతీయ జలాల్లో మోటార్ ట్యాంకర్లలోకి మార్చేవారు. ఈ ముఠాలో వివిధ దేశాలకు చెందిన హ్యాండ్లర్లు ఉన్నట్లు, వారు సముద్రం మధ్యలో నౌకల ద్వారా సరుకు అమ్మకాలు, బదిలీలను నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

భారత ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) పరిధిలో అనుమానాస్పదంగా ఉన్న మోటార్ ట్యాంకర్‌ను ఐసీజీ అత్యాధునిక సాంకేతిక నిఘా వ్యవస్థలు గుర్తించాయి. దీని ఆధారంగా చేపట్టిన డిజిటల్ విచారణ, నౌకల కదలికల విశ్లేషణలో.. ఆ ట్యాంకర్ వద్దకు మరో రెండు నౌకలు వచ్చినట్లు తెలిసింది. భారత్ సహా తీరప్రాంత దేశాలకు చెల్లించాల్సిన సుంకాలను ఎగ్గొట్టేందుకు, చట్టవిరుద్ధంగా ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురును బదిలీ చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ఫిబ్రవరి 5, 2026న స్వయంగా నౌకల వద్దకు వెళ్లి డిజిటల్ సాక్ష్యాలను ధ్రువీకరించుకున్న తర్వాత, మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నారు. సముద్ర చట్టాలను అమలు చేసే సంస్థల నుంచి తప్పించుకునేందుకు ఈ నౌకలు తరచుగా గుర్తింపును మారుస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాక, ఈ నౌకల యజమానులు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న ఈ నౌకలను తదుపరి విచారణకు ముంబైకి తరలించే అవకాశముంది. చట్టపరమైన చర్యల నిమిత్తం వీటిని భారత కస్టమ్స్, ఇతర చట్ట అమలు సంస్థలకు అప్పగించనున్నారు.

అత్యాధునిక డిజిటల్ నిఘా ద్వారా ప్రారంభమై, భారత తీరరక్షక దళం విస్తృత సముద్రయాన ఉనికితో అమలైన ఈ ఆపరేషన్, సముద్ర తీర ప్రాంతంలో 'ప్రధాన భద్రతా ప్రదాత'గా, అంతర్జాతీయ సముద్ర నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసే శక్తిగా భారతదేశ పాత్రను మరోసారి స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2224876) సందర్శకుల సూచీ సంఖ్య : : 97
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam