రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు విశేష ప్రాధాన్యత
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2026 5:04PM by PIB Hyderabad
కీలకాంశాలు
- రాష్ట్రానికి ఆరు రెట్లు పెరిగిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కేటాయింపు
- 2014-15తో పోలిస్తే 2026-27లో 20 రెట్లు పెరిగిన కేటాయింపు
- ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే పనులు
- అమృత్ స్టేషన్ పథకం కింద రూ.2,015 కోట్లతో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు
- 2014 నుంచి రాష్ట్రంలో 900 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ల నిర్మాణం
తెలంగాణలో రైల్వే వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల కేటాయింపు కోసం భారీగా నిధులను మంజూరు చేస్తోంది. దీంతో గత 11 ఏళ్లలో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు భారీగా అభివృద్ధి చెందాయి.
భారీగా పెరిగిన బడ్జెట్ కేటాయింపు
తెలంగాణకు సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కేటాయింపు భారీగా పెరిగింది. 2009-14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రానికి కలిపి వార్షిక సగటు బడ్జెట్ రూ.886 కోట్లు అందగా, 2026-27లో ఆరు రెట్లు పెరిగి రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది.
- 2014-15 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.258 కోట్ల కేటాయింపు జరగగా, 2026-27 బడ్జెట్‌లో దాదాపు 20 రెట్లు అధికంగా(రూ.5,454 కోట్లు) కేటాయింపు జరిగింది.
రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రైల్వే శాఖ విశేష ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్లతో చేపట్టిన రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో కొత్త ట్రాక్ నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి, రైల్వే భద్రత పెంపొందించడం వంటి అనేక పనులు ఉన్నాయి.
- రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి కొత్త రైల్వే టర్మినల్‌ను 2025 జనవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
- తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు 499 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను రైల్వే శాఖ నిర్మించింది.
- 1,242 కిలోమీటర్ల మేర రైల్వే భద్రత వ్యవస్థ(కవచ్)ను ఏర్పాటు చేస్తోంది.
40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి
అమృత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.2,015 కోట్లు కేటాయించింది. ఇప్పటికే బేగంపేట, కరీంనగర్, వరంగల్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పూర్తయ్యింది. మిగతా చోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి.
కొత్త రైళ్లు ప్రారంభం
తెలంగాణకు రైలు అనుసంధానాన్ని సైతం రైల్వే శాఖ మెరుగుపరుస్తోంది. సరికొత్త సాంకేతికత, అధునాతనతో కూడిన కొత్త రైళ్లను రాష్ట్రం నుంచి నడిపిస్తోంది. ఇప్పటివరకు 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 3 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తెలంగాణ నుంచి నడుస్తున్నాయి.
900 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్
- తెలంగాణలో 2014 నుంచి దాదాపు 900 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగింది. ఇది యూఏఈ దేశ మొత్తం రైల్వే వ్యవస్థ కంటే కూడా ఎక్కువ.
- మరోవైపు తెలంగాణలో 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణను సైతం రైల్వే శాఖ పూర్తి చేసింది. 2014 నుంచి ఏకంగా 1,115 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయ్యింది.
- తెలంగాణలో 2009-14 మధ్యకాలంలో సగటున సంవత్సరానికి 17 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం జరగగా, 2014-24 మధ్యకాలంలో సంవత్సరానికి సగటున 65 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగింది. ఇది గతంలో పోలిస్తే 4 రెట్లు అధికం.
- తెలంగాణలో 2009-14 మధ్యకాలంలో సంవత్సరానికి సగటున 41 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ విద్యుదీకరణ జరగగా, 2014-24 మధ్యకాలంలో 110 కిలోమీటర్ల మేర జరిగింది. ఇది గతంలో పోలిస్తే 3 రెట్లు అధికం.
- తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా ఏపీలోని నంబూరుకు 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం 2024 అక్టోబర్ 24న ఆమోదం తెలిపింది.
- భద్రాచలం మీదుగా మల్కన్‌గిరి-పాండురంగాపురం మధ్య 173.6 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 2024 ఆగస్టు 9న కేంద్రం ఆమోదం తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2222285)
సందర్శకుల సూచీ సంఖ్య : : 71