రాష్ట్రపతి సచివాలయం
హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో రెండో ఉద్యాన ఉత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
19 DEC 2025 4:50PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో రెండో ఉద్యాన ఉత్సవాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రారంభించారు. భారత హరిత సంప్రదాయాలు, సుస్థిర పద్ధతులు, సామాజిక భాగస్వామ్యాన్ని చాటే ఈ తొమ్మిది రోజుల వ్యవసాయ, ఉద్యాన ఉత్సవం జనవరి 3, 2026 నుంచి 11వ తేదీ వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.
OKGC.jpeg)
జనవరి 2025లో జరిగిన మొదటి ఉద్యాన ఉత్సవానికి కొనసాగింపుగా ఈ ఏడాది రెండవ సంచికను నిర్వహిస్తున్నారు. మొదటిసారి ఉత్సవం జరిగిన 12 రోజుల్లో 1.3 లక్షల మంది సందర్శకుల హాజరుతో విశేష స్పందన వచ్చింది. ప్రారంభ ఉత్సవ విజయాన్ని ఆధారంగా చేసుకొని, ఉద్యాన్ ఉత్సవ్ – 2026 సుస్థిర వ్యవసాయం, ఉద్యాన పరిశ్రమ, పర్యావరణపరంగా బాధ్యతాయుత జీవనశైలి గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రెండో ఉద్యాన ఉత్సవం జనవరి 3 నుంచి జనవరి 11, 2026 వరకు రాష్ట్రపతి నిలయం ప్రధాన ప్రాంగణంలో జరుగుతుంది. ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు సందర్శన సమయం కాగా, చివరిగా రాత్రి 7:00 గంటలకు సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. ఉత్సవానికి సందర్శకులను ఎలాంటి ప్రవేశ రుసుం లేకుండా రెండో నెంబర్ గేటు ద్వారా లోనికి అనుమతిస్తారు.
J4UE.jpeg)
వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ - ఎంఏఎన్ఏజీఈ) ముఖ్య విజ్ఞాన భాగస్వామిగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఉద్యాన్ ఉత్సవ్ 2026 ప్రధాన అంశాలు
ఈ ఉత్సవంలో రకరకాల సీజనల్ పూల మొక్కలతో పాటు ప్రత్యేక పుష్పాలంకరణలు, సెల్ఫీ పాయింట్లు, నవీకరించిన ఉద్యాన ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. వ్యవసాయ, ఉద్యాన స్టాల్స్, ప్రత్యక్ష ప్రదర్శనలు, పర్యావరణ హస్త కళా వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ విజ్ఞాన కేంద్రాలలో కూడా సందర్శకులు పాల్గొనవచ్చు.
ప్రధాన ఆకర్షణలు
*సేంద్రీయ ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ వస్తువులు, ఎఫ్పీఓలు, వ్యవసాయ స్టార్టప్‌లను ప్రదర్శించే వ్యవసాయ, ఉద్యాన స్టాల్స్.
*ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కలు, నర్సరీ నిర్వహణ, సుస్థిర పద్ధతులపై వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు.
*యువతను భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు, క్విజ్‌లు, ఆచరణ ద్వారా అనుభవం పొందే అంశాలు
*చిరుధాన్యాలు, హెర్బల్ తయారీ వంటకాలను అందించే ప్రత్యేక ఫుడ్ కోర్టు
*భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలను, ప్రకృతితో వాటి సన్నిహిత సంబంధాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు.
సందర్శకుల సౌకర్యాలు
సందర్శకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సందర్శన అనుభవాన్ని అందించడానికి రాష్ట్రపతి నిలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భద్రతా నిర్వహణ, పారిశుద్ధ్య సేవలు, తాగునీటి కేంద్రాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, ఎలక్ట్రిక్ కార్ట్‌లు, ఉత్సవ రోజుల్లో ఉద్యాన ప్రాంగణం రోజువారీ నిర్వహణ వంటివి ఉన్నాయి.
ఉద్యాన్ ఉత్సవ్ 2026 సందర్భంగా రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి, ప్రకృతి, వ్యవసాయం, సంస్కృతుల గొప్ప సమ్మేళనాన్ని అనుభవించాలని రాష్ట్రపతి పౌరులను ఆహ్వానిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2206732)
సందర్శకుల సూచీ సంఖ్య : : 75