రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతర, సుస్థిర రైల్వే కార్యకలాపాలకు ఊతాన్ని అందిస్తున్న 2,626 సౌరశక్తి ప్రధాన రైల్వే స్టేషన్లు

ఇంతవరకు 898 మెగావాట్ల సౌర విద్యుత్తు అందుబాటులోకి..
దీనిలో 70 శాతం వినియోగం రైళ్లను నడపడానికే..
ఫలితంగా మెరుగైన ఇంధన భద్రత

प्रविष्टि तिथि: 16 DEC 2025 6:47PM by PIB Hyderabad

భారతీయ రైల్వే వ్యవస్థ తన రైల్ నెట్‌వర్క్‌లో సౌర ఇంధనాన్ని వినియోగించుకోవడంలో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతానికి, సౌర శక్తిని 2,626 రైల్వే స్టేషన్లు ఉపయోగించుకుంటున్నాయి. ఇంత విస్తృత స్థాయిలో దీనిని వినియోగిస్తున్న తీరు ఇంధన ఖర్చులను తగ్గించడంలో తోడ్పడుతోంది. ఇది దేశమంతటా స్వచ్ఛ, మరింత సుస్థిర రైల్వే కార్యకలాపాల దిశగా మళ్లడాన్ని కూడా సూచిస్తోంది.

 

 
image.png

 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఈ వేగంలో మరింత వృ‌ద్ధి చోటుచేసుకుంది. నవంబరు నాటికి, 318 స్టేషన్లను సౌర శక్తితో సంధానించారు. దీంతో, సౌర శక్తి ఆధారంగా నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్ల మొత్తం సంఖ్య 2,626కు చేరుకుంది.
స్వచ్ఛ ఇంధన వినియోగంలో రైల్వేలు ఒక ప్రధాన ఘట్టాన్ని ఆవిష్కరించాయి. 2025 నవంబరు కల్లా, రైల్వేల నిర్వహణకు 898 మెగావాట్ల సౌర శక్తిని వినియోగంలోకి తీసుకు వచ్చారు. ఇది 2014లో నమోదైన 3.68 మెగావాట్ల సౌర శక్తితో పోలిస్తే గణనీయ వృద్ధిని సూచిస్తోంది. ఇది 2014 స్థాయి కన్నా, దాదాపు 244 రెట్ల పెరుగుదలకు సమానం. మొత్తం వర్తమాన సామర్థ్యంలో నుంచి 629 మెగావాట్లను రైళ్లను నడపటానికి ఉపయోగిస్తున్నారు. ఇది విద్యుత్తు రైళ్ల నిర్వహణకు ఊతాన్ని అందిస్తోంది. మిగిలిన 269 మెగావాట్ల కరెంటునూ రైళ్ల రాకపోకలకు కాకుండా ఇతరత్రా వినియోగిస్తున్నారు.  వీటిలో స్టేషన్ల లైటింగు, వర్క్‌షాపులు, భవనాలు, రైల్వే క్వార్టర్ల వంటివి కలిసి ఉన్నాయి. సౌర శక్తిని సమతౌల్య ప్రాతిపదికన ఉపయోగించడం సాంప్రదాయిక శక్తిపైన ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. దీంతో మొత్తంమీద రైల్వే కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగుపడుతోంది.  
స్టేషన్లు, భవనాలు, రైల్వే భూముల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తుండటం ద్వారా, నానాటికీ పెరుగుతున్న భారతీయ రైల్వేల ఇంధన అవసరాల్నిస్వచ్ఛ, సుస్థిర పద్ధతుల్లో తీర్చగలుగుతున్నారు. ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలతో ఇంధన భద్రత కూడా మెరుగుపడుతోంది. వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువును ఎక్కువగా వెలువడకుండా నియంత్రించాలన్న లక్ష్యాలకూ దన్ను లభిస్తోంది. ఈ చర్యలు 2030 కల్లా కర్బన ఉద్గారాల్లో మొత్తంమీద సున్నా స్థాయిని అందుకోవాలన్న భారతీయ రైల్వేల నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి. 


(रिलीज़ आईडी: 2205159) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Gujarati , Urdu , Kannada