ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) చెన్నైలో రూ. 6.26 కోట్ల విలువైన 15 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం స్వాధీనం: నలుగురి అరెస్టు
प्रविष्टि तिथि:
14 DEC 2025 4:47PM by PIB Hyderabad
నిషేధిత/నియంత్రిత ఎర్రచందనాన్ని అక్రమంగా ఎగుమతి చేసే ప్రయత్నాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అడ్డుకుంది. ఈ కేసులో రూ. 6.26 కోట్ల విలువైన మొత్తం 15 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని వివిధ గోదాముల్లో స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.
అంతరించిపోతున్న అడవి జంతువులు, వృక్ష జాతుల వాణిజ్యాన్ని నియంత్రించేందుకు రూపొందించిన అంతర్జాతీయ ఒప్పందం (ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ కన్వెన్షన్ - సీఐటీఈఎస్) రెండో అనుబంధం, వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 నాలుగో షెడ్యూల్ జాబితాలోని ఎర్రచందనం (టెరోకార్పస్ శాంటాలినస్) ఎగుమతిపై విదేశీ వాణిజ్య విధానం కింద నిషేధం/ నియంత్రణ విధించారు.
చెన్నైలోనూ, దాని శివార్లలోని వివిధ గోదాములలోనూ ఎర్రచందనాన్ని దాచి, దానిని చెన్నై నుంచి ఢిల్లీ మీదుగా ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు 09.12.2025 నుంచి 11.12.2025 వరకు మూడు ప్రాంతాలలో అత్యంత సమన్వయంతో సోదాలను నిర్వహించారు.
ఒక ప్రాంగణంలో ఏ గ్రేడ్ నాణ్యత గల 5.55 మెట్రిక్ టన్నుల బరువున్న 169 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 76 దుంగలను తెల్లటి హెచ్డీపీఈ ప్యాకింగ్ మెటీరియల్‌తో చుట్టి గృహోపకరణాల పేరుతో ట్రక్కులో ఢిల్లీ తరలించడానికి సిద్ధంగా ఉంచారు. అక్రమ ఎగుమతికి ఉద్దేశించిన నిషేధిత వస్తువులతో పాటు, వాటిని కప్పడానికి ఉపయోగించిన వస్తువులను కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల కింద స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు ప్రాంగణాలలో దుంగలు, వేర్లు, ఫర్నిచర్ రూపంలో ఉన్న 9.55 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నలుగురిలో ముఖ్య సూత్రధారితో పాటు ఎర్రచందనాన్ని ప్యాకింగ్ చేయడంలో, రవాణా చేయడంలో పాలుపంచుకున్న అతని ఇద్దరు సహచరులు, సరఫరాదారు తరఫున మధ్యవర్తి ఉన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
భారతదేశ ఆర్థిక సరిహద్దులను దెబ్బతీస్తూ, దేశ జీవవైవిధ్యానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలను కొనసాగించేందుకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2204177)
आगंतुक पटल : 9