వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నల్గొండలో కొత్త ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి


తెలంగాణకు కేంద్రం అందిస్తున్న నిరంతర మద్దతుకు ఇది నిదర్శనం

తెలంగాణ మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, సంక్షేమ వ్యవస్థల బలోపేతానికి కట్టుబడి ఉన్న భారత ప్రభుత్వం

ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరిస్తూ 1.27 కోట్ల మంది రైతులకు సహాయం చేస్తున్నాం... రూ. 2.25 లక్షల కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నాం

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2025 6:03PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ రోజు నల్గొండలో భారత ఆహార సంస్థ నూతన డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణతో పాటు దక్షిణ ప్రాంతంలో ఎఫ్‌సీఐ కార్యాచరణ సామర్థ్యం, సేవల పంపిణీని ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎఫ్‌సీఐ ఆధునికీకరణ... సమర్థమైన, పారదర్శకమైన, ప్రజా-కేంద్రితమైన ఆహార భద్రతా కార్యకలాపాలను నిర్ధరించడం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతను ఈ కొత్త కార్యాలయం ప్రతిబింబిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

 

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం అందిస్తున్న గణనీయ మద్దతును శ్రీ జోషి ప్రధానంగా ప్రస్తావించారు. రైల్వే రంగ అభివృద్ధి కార్యక్రమాల కింద 2024–25 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రూ. 5,336 కోట్లు అందుకుందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1,830.4 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 38–40 రైల్వే స్టేషన్లను అధునాతన హంగులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తయినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ‘పీఎమ్ సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన’ కింద కేంద్రం 40.5 మెగావాట్ల పరిశుద్ధ ఇంధన సామర్థ్యాన్ని జోడిస్తూ... 20,175 ఎస్‌సీ, ఎస్‌టీ, బీపీఎల్ గృహాల వారికి మొదటి విడతగా 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను అందించేందుకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.

రైతులకు ఎఫ్‌సీఐ అందిస్తున్న బలమైన మద్దతునూ కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యం సేకరించడం ద్వారా ఏటా 1.27 కోట్ల మంది రైతులకు సహాయాన్ని అందిస్తుందనీ, 2023–24లోనే రూ. 2.25 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశామని ఆయన పేర్కొన్నారు. పంపిణీ విషయంలో ఎఫ్‌సీఐ "శక్తిమంతమైన నెట్‌వర్క్ ప్రతి నెలా 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఆహారం అందిస్తోందని – ఈ సంఖ్య యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ జనాభా కంటే ఎక్కువ" అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం కింద ఏటా 550 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు శ్రీ జోషి తెలిపారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తెలంగాణ పూర్తి కవరేజీని సాధించిందనీ, 1.97 కోట్ల మంది లబ్ధిదారులు ఎటువంటి లోటు లేకుండా తమ సరుకులను పొందుతున్నారని శ్రీ జోషి పేర్కొన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నెలవారీగా 1,07,000 మెట్రిక్ టన్నుల బియ్యం, 3,770 మెట్రిక్ టన్నుల గోధుమలు సహా 1,11,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించడం ద్వారా మద్దతునిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.

రైతులకు మద్దతునివ్వడం, ఆహార భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, తెలంగాణలో సమగ్ర అభివృద్ధిని ముందుకు నడిపించడం పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను శ్రీ జోషి పునరుద్ఘాటించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2192341) సందర్శకుల సూచీ సంఖ్య : : 96
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English