వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
సవరించిన వంట నూనెల ఉత్పత్తి, లభ్యత (నియంత్రణ) ఉత్తర్వు- 2025 అమలు కోసం దేశవ్యాప్తంగా వర్క్ షాప్‌లు నిర్వహించనున్న ప్రభుత్వం
· వంటనూనెల రంగంలో పారదర్శకత, డేటా ఆధారిత పర్యవేక్షణ, దేశ ఆహార భద్రతను బలోపేతం చేయడం లక్ష్యం
प्रविष्टि तिथि:
12 NOV 2025 7:38PM by PIB Hyderabad
సవరించిన వంట నూనె ఉత్పత్తుల ఉత్పత్తి, లభ్యత (నియంత్రణ) ఉత్తర్వు- 2025ను ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రకటించింది. వంట నూనె పరిశ్రమలో పారదర్శకత, డేటా సేకరణ, పర్యవేక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా ఇదొక ముఖ్య సంస్కరణ.
సజావుగా అమలు చేసేందుకు సామర్థ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు
వంటనూనె ఉత్పత్తుల ఉత్పత్తి, లభ్యత (నియంత్రణ) ఉత్తర్వు- 2025ను సమర్థంగా అమలు చేయడం కోసం.. ఈ శాఖ ప్రధాన నగరాల్లో వరుసగా సామర్థ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లను ప్రారంభిస్తోంది. ఇందులో వంటనూనెల ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
2025 నవంబరు 15న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న సోయాబీన్ ఆయిల్ ప్రాసెసర్స్ అసోసియేషన్ (ఎస్ఓపీఏ) ఆడిటోరియంలో మొదటి వర్క్షాప్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు:
-
దేశ పురోగతి కోసం కీలక చోదక శక్తిగా పరిశ్రమలు కచ్చితమైన డేటాను అందించడం ఎంత ఆవశ్యకమో స్పష్టం చేయడం.
-
జాతీయ సింగిల్ విండో వ్యవస్థ (ఎన్ఎస్‌డబ్ల్యూఎస్), వొప్పా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌పై మౌఖిక ప్రదర్శనలు.
-
వొప్పా- 2025 కింద సజావుగా నమోదు చేయడానికి, నెలవారీ రిటర్నులను సకాలంలో సమర్పించడానికి పారిశ్రామిక భాగస్వాములకు మార్గనిర్దేశం అందించడం.
ఇండోర్ వర్క్‌షాప్ అనంతరం.. ఈ కార్యక్రమంలో పరిశ్రమలన్నీ పూర్తిగా పాల్గొనేందుకు, నిబంధనలను పాటించేందుకు వీలుగా... దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లోనూ ఇలాంటి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహకార స్ఫూర్తితో వొప్పా రిజిస్ట్రేషన్ నిబంధనలను పరిశ్రమలు చురుగ్గా పాటించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా... ఈ శాఖ సమీపంలోని వంట నూనెల యూనిట్లను సందర్శించి, వారితో సంప్రదింపులు నిర్వహిస్తుంది.
పారదర్శకత బలోపేతం, డేటా ఆధారంగా నిర్ణయాలు
సవరించిన వంట నూనె ఉత్పత్తుల ఉత్పత్తి, లభ్యత (నియంత్రణ) ఉత్తర్వు ప్రకారం... ముడి/శుద్ధి చేసిన మొక్కల ఆధారిత నూనెలు, ద్రావకాల నుంచి సేకరించిన నూనెలు, మిశ్రిత నూనెలు, వనస్పతి, మార్గరిన్, ఇతర నిర్ణీత మొక్కల ఆధారిత నూనె ఉత్పత్తిదారులంతా ఇప్పుడు వొప్పా పోర్టల్ - https://www.edibleoilindia.inలో నమోదు చేసుకోవాలి. అలాగే ఉత్పత్తి, దిగుమతులు, ప్రారంభ - ముగింపు నిల్వలు, పంపిణీ, అమ్మకాలు, వినియోగాన్ని పేర్కొంటూ నెలవారీ రిటర్నులను సమర్పించాలి. ఈ రిటర్నులను ప్రతి నెలా 15వ తేదీలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది.
పారదర్శకంగా, డేటా ఆధారితంగా ఉండే మొక్కల ఆధారిత వంట నూనెల వ్యవస్థ దిశగా.. భారత ప్రభుత్వం చేపట్టిన ఓ ముఖ్యమైన ముందడుగు ఈ సవరణ. ఈ చర్య సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణను పెంచుతుంది. కచ్చితమైన డేటాను సేకరించడానికి దోహదపడుతుంది. తద్వారా దేశ ఆహార భద్రతా లక్ష్యాల కోసం మరింత సమర్థ విధానాల రూపకల్పనకు వీలు కల్పిస్తుంది. తయారీదారుల నుంచి ఎప్పటికప్పుడు ప్రామాణికమైన సమాచారాన్ని పొందడం ద్వారా.. వంట నూనెల రంగంలో ప్రభుత్వం మరింత క్రియాశీల చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుంది.
తప్పనిసరి నమోదు, నియమపాలన
వంటనూనెల ఉత్పత్తిదారులు, ప్యాకర్లందరికీ వొప్పా నమోదు తప్పనిసరి అని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నెలవారీ రిటర్నుల నమోదులో లేదా సమర్పించడంలో విఫలమైన యూనిట్లు.. నిత్యావసర వస్తువుల చట్టం- 1955, గణాంకాల సేకరణ చట్టం- 2008 ప్రకారం జరిమానాలు, ఇతర చట్టబద్ధమైన చర్యలు సహా కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చట్టపరమైన లేదా ఆర్థిక పరిణామాల నివారణ కోసం.. అన్ని వంట నూనె యూనిట్లు వెంటనే వొప్పా పోర్టలులో (https://www.edibleoilindia.in)లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. సకాలంలో రిటర్నులను సమర్పించడం ద్వారా.. దేశ ఆహార భద్రతను బలోపేతం చేసేలా పారదర్శకమైన, మెరుగైన పర్యవేక్షణ గల వంటనూనెల రంగానికి దోహదం చేస్తుంది.
దేశ వంట నూనెల వ్యవస్థలో పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన, సమర్థమైన డేటా నిర్వహణ దిశగా సమష్టి కృషిగా సవరించిన వొప్పా-2025 ఉత్తర్వును ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టం చేసింది. ఆత్మనిర్భర, డేటా ఆధారిత, ఆహార భద్రత గల దేశ నిర్మాణం దిశగా ఇది కీలక ముందడుగు.
***
(रिलीज़ आईडी: 2189560)
आगंतुक पटल : 13