గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డబ్ల్యూడిసీ-పీఎంకెఎస్‌వై 1.0 ప్రాజెక్టు ద్వారా రైతుల ఆదాయంలో 70% పెరుగుదల, భూగర్భ జల మట్టం సగటున 3 మీటర్ల మేర పెరిగింది
2.0 దశలో 50 లక్షల హెక్టార్లలో 1,220 ప్రాజెక్టులు రూ.12,972 కోట్లతో అమలవుతున్నాయి
రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వంలో సమన్వయం, సమాజం పాల్గొనడం కీలకమని, కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు, సాంకేతిక సహాయం అందిస్తుంది
“వాటర్‌షెడ్ అభివృద్ధి అంటే చెక్డ్యాములు కట్టడం మాత్రమే కాదు, గ్రామీణ భారతానికి పర్యావరణ పునాది నిర్మించడం”
భారత్ ను “వాటర్‌స్ట్రెస్‌డ్ నేషన్” నుంచి “వాటర్‌సెక్యూర్ నేషన్”గా మలచడమే లక్ష్యం
प्रविष्टि तिथि:
10 NOV 2025 4:09PM by PIB Hyderabad
ప్రపంచ పునరుత్పాదక జల వనరుల్లో భారతదేశం వాటా కేవలం 4% మాత్రమే అయినా, ప్రపంచ జనాభాలోని 18% మందికి నీటి అవసరాలను తీర్చాల్సి వస్తుందని, అందుకే, ప్రతీ నీటి చుక్కని జాగ్రత్తగా సంరక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి, నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశ వార్షిక వర్షపాతంలో మూడు వంతు కేవలం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల్లోనే పడుతుందని, ఆ సమయంలోనే ప్రతి చుక్క నీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టి, నిల్వ చేసుకుని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జాతీయ వాటర్ షెడ్ సదస్సు తన సొంత నియోజకవర్గంలో జరగడం తనకెంతో గర్వంగా, సంతోషంగా ఉందన్న మంత్రి, వాటర్షెడ్ వ్యవస్థలను పునరుజ్జీవింపజేయడానికి కృషి చేస్తున్న మేధావులు, గ్రామీణ స్థాయి యోధులను ఈ కార్యక్రమం ఒకే చోటకు తీసుకువస్తుందన్నారు. మన దేశ చరిత్ర ఎప్పుడూ వర్షకాలంతో ముడిపడి ఉందని, వర్షాలు సమృద్ధిగా పడితే సుభిక్షం, లేదంటే కరవు, కష్టాలే మన చరిత్ర అన్నారు. రానురాను నీటి కొరత పెరుగుతోందన్న మంత్రి.. 2021లో తలసరి నీటి లభ్యత 1,486 మీటర్ క్యూబిక్ కాగా, 2031 నాటికి 1,367 మీటర్ క్యూబిక్ కు పడిపోతుందని, ఇది “నీటి ఒత్తిడి పరిధి”లోకి వస్తుందని వివరించారు. ఉగ్రవాదానికి జీరో టోలరెన్స్ లాగానే, నీటి వ్యర్థానికి కూడా జీరో టోలరెన్స్ అవసరమని అన్నారు. ప్రపంచంలోని నీటి వనరుల్లో భారత్ వద్ద కేవలం 4% మాత్రమే ఉన్నాయని, కానీ మనం ప్రపంచ జనాభాలో 18% వాటా కలిగిన దేశ జనాభా అవసరాల్ని తీర్చాల్సి వస్తుందని అన్నారు. ఈ ఒత్తిడి కారణంగా 2016లో సంభవించిన కరవు కారణంగా దాదాపు 33 కోట్ల మంది ప్రభావితం అయ్యారని గుర్తు చేశారు.
అసమర్థమైన వాటర్షెడ్ నిర్వహణ వల్ల వర్షకాలంలో వరదలు, ఎండాకాలంలో కరువులు పెరుగుతాయన్న మంత్రి పెమ్మసాని, మట్టి ధ్వంసం వేగవంతమవుతుందని, రైతుల ఆదాయం తగ్గుతుందని, పట్టణాల్లో నీటి సంక్షోభం తీవ్రమవుతుందని వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తరచూ చెప్పే “నీటి భద్రతే-జాతీయ భద్రత” అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే డబ్ల్యూడిసీ-పీఎంకెఎస్‌వై (వాటర్‌షెడ్ డెవలప్మెంట్ కంపోనెంట్ – ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన) ద్వారా ప్రభుత్వంల నీటి సంరక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
మొదటి విడత డబ్ల్యూడిసీ-పీఎంకెఎస్‌వై 1.0 తో మంచి ఫలితాలు
తొలి విడుత చేపట్టిన కార్యక్రమాల వల్ల వార్షిక వ్యవసాయ ఆదాయం రూ.19,454 కోట్లు పెరిగి, పెట్టుబడి కంటే 6.2 రెట్లు ఎక్కువ లాభాలు లభించాయని మంత్రి పెమ్మసాని తెలిపారు. రైతుల ఆదాయం 70% పెరిగిందని, పాల ఉత్పత్తి 40% పెరిగిందని వివరించారు. ప్రభుత్వం కార్యక్రమాల కారణంగా భూగర్భ జలస్థాయులు 3 మీటర్ల మేర పెరిగాయని, నేల తేమ శాతం కూడా మెరుగుపడిందని వివరించారు. ఈ కారణంగానే.. చాలా చోట్ల రెండు, మూడో పంటలు కూడా సాధ్యమయ్యాయన్నారు. సాగు నీటితో పాటు తాగునీటి వనరులు సైతం పటిష్టమయ్యాయన్నారు.
డబ్ల్యూడిసీ-పీఎంకెఎస్‌వై 2.0 - లక్ష్యాలు
ప్రస్తుతం 50 లక్షల హెక్టార్లలో 1,220 ప్రాజెక్టులను రూ.12,972 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, 2026 నాటికి కరువు ప్రభావిత, వర్షాధార ప్రాంతాలను పునరుద్ధరించడం లక్ష్యమని చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన “వాటర్షెడ్ యాత్ర” ఇప్పటికే 8.5 లక్షల రైతులను చేరుకుందని, సమాజం ముందుకు వస్తే, మార్పు ఖచ్చితంగా జరుగుతుందని దీని ద్వారా నిరూపితమైందని మంత్రి అన్నారు. గుంటూరులో రెండు రోజుల పాటు జరుగుతున్న జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమంలో “విజయాలను పంచుకుందాం, సవాళ్లను ఎదుర్కుందాం, కలిసి పరిష్కారాలను రూపొందిద్దాం” అని పిలుపునిచ్చారు.
తక్షణ చర్యలు అవసరం
డబ్ల్యూడిసీ-పీఎంకెఎస్‌వై 2.0 కార్యక్రమాల్ని సమీక్షించి, పనుల్ని వేగవంతం చేసి, ఫలితాలు సాధించాలని రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహక అధికారులకు సూచించారు. వాటర్‌షెడ్ మహోత్సవ్, మిషన్ వాటర్‌షెడ్ పునరుత్థాన్ వంటి కార్యక్రమాలు గేమ్-చేంజర్లుగా నిలుస్తాయని, వాటిలో లైన్ డిపార్ట్‌మెంట్‌లు, పంచాయతీలు, సమాజాన్ని, ప్రైవేట్ భాగస్వాములు సహా అందరూ పాల్గొనేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం అమలు చేయడం మాత్రమే కాదని, స్థిరంగా కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను పునరుద్ధరించి, గ్రామీణాభివృద్ధికి సరికొత్త రూపు,ఉత్సాహం అందిస్తున్నారని ప్రశంసించారు. నూతన రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణం ప్రారంభమయ్యే ముందే నీటి వనరులు నిర్మించడం ద్వారా నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
డబ్ల్యూడిసీ-పీఎంకెఎస్‌వై 3.0
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దిశానిర్దేశంలో తదుపరి దశ WDC–PMKSY 3.0 కార్యక్రమంలో ఆధునిక విజ్ఞానం, సాంకేతికతను వినియోగించడంతో పాటు నదుల పునరుజ్జీవనం, సాంప్రదాయ నీటి సేకరణ పద్ధతుల పునరుద్ధరణ,ప్రాజెక్టు సరిహద్దుల దాటి ప్రయోజనాల్ని విస్తరించడం వంటి లక్ష్యాల్ని ఏర్పరుచుకోనున్నట్లు తెలిపారు. అందుకోసం విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సంస్థలు అందరూ కలిసి డబ్ల్యూడిసీ-పీఎంకెఎస్‌వై 3.0కు సూచనలు, సలహాలు అందించాలని ఆహ్వానించారు.
ముగింపు
కేంద్ర ప్రభుత్వం నిధులు, సాంకేతిక సహాయం, సవరించిన మార్గదర్శకాలతో సిద్ధంగా ఉందన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, ప్రజా భాగస్వామ్యంతో, దీర్ఘకాల కట్టుబాటుతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వాటర్షెడ్ అభివృద్ధి అంటే కేవలం చెక్ డ్యామ్లు నిర్మించడం కాదని, అది గ్రామీణ భారత పర్యావరణ మూలాన్ని పునర్నిర్మించడం, అనిశ్చిత వాతావరణంలో స్థిరత్వం సృష్టించడం, వర్షపు నీటిని వరద అనే ప్రమాదం నుంచి, భూగర్భజల మట్టాలు పెంచడం, భూమి తేమ రూపంలో ఆస్తిగా మార్పించడమని అన్నారు.
దేశ ప్రజలందరం కలిసి పనిచేసి భారతదేశాన్ని నీటి కొరత ఉన్న దేశం నుంచి నీటి భద్రత కలిగిన దేశంగా మారుద్దామని పిలుపునిచ్చారు.
***
(रिलीज़ आईडी: 2188358)
आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English