రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమతుల్య సహకారం ద్వారా దేశీయ పారిశ్రామిక వ్యవస్థ బలోపేతానికి నిర్మాణాత్మక విధాన ప్రణాళిక అవసరం: రక్షణ కార్యదర్శి
प्रविष्टि तिथि:
17 OCT 2025 4:48PM by PIB Hyderabad
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమతుల్య సహకారం ద్వారా దేశీయ పారిశ్రామిక వ్యవస్థ బలోపేతం కోసం నిర్మాణాత్మక విధాన ప్రణాళిక అవసరమని రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (సీఏపీఎస్ఎస్) ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ‘వైమానిక శక్తి కోసం కీలక సాంకేతికతల దేశీయ అభివృద్ధిపై వ్యూహాత్మక అవగాహన సదస్సు’లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.
వివిధ రకాల పారిశ్రామిక వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారా కేవలం కొన్ని వ్యవస్థలపై ఆధారపడాల్సిన సమస్య పరిష్కారమవుతుందనీ.. వ్యాపార సౌలభ్యాన్నీ ఇది పెంపొందిస్తుందని.. వ్యవస్థ అంతటా ఆవిష్కరణలను ఇది ప్రోత్సహిస్తుందని రక్షణ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. భారత వైమానిక శక్తి సామర్థ్యాల బలోపేతం కోసం అధునాతన వైమానిక సాంకేతికతలు, క్షేత్రస్థాయి మూల్యాంకన పరీక్షలు, దీర్ఘ శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థలు అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తూ.. రక్షణ రంగంలో స్వయం-సమృద్ధి సాధించడం పట్ల ప్రభుత్వ దృఢమైన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నరమ్‌దేశ్వర్ తివారీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో వ్యూహాత్మక ఫలితాలను నిర్ణయించడంలో వైమానిక శక్తి సహకారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. స్వదేశీ విమానాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం కోసం సామర్థ్యాలతో పాటు... ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అధునాతన సెన్సార్లు, రాడార్లు, డేటా లింక్‌లలో నైపుణ్యాన్ని సాధించడానికి భారత్ ప్రాధాన్యమివ్వాలని ఆయన అన్నారు.
ఏఈఆర్ఓ, డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె. రాజలక్ష్మి మీనన్ మాట్లాడుతూ.. వైమానిక కార్యకలాపాల్లో యూఏవీలు, మల్టీ-సెన్సార్ ఫ్యూజన్, కృత్రిమ మేధల సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. స్టెల్త్ టెక్నాలజీ, ఏరోస్టాట్లు, మెరుగైన సెన్సార్‌లతో కూడిన ఎయిర్‌షిప్‌లలో పురోగతిని వివరించిన ఆమె... రక్షణ వ్యవస్థల్లో క్వాంటం, ఫోటోనిక్, బ్లాక్చెయిన్ టెక్నాలజీల ఏకీకరణ గురించి మాట్లాడారు.
అభివృద్ధి చెందుతున్న భద్రతా వాతావరణం, పొరుగు దేశాలతో పెరుగుతున్న సాంకేతిక పోటీ మధ్య ఆత్మనిర్భరత ప్రాముఖ్యతను సీఏపీఎస్ఎస్ ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) డీజీ అనిల్ గోలాని ప్రస్తావించారు. కృత్రిమ మేధ, అధునాతన ఏవియానిక్స్, తదుపరి తరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన ఆయన... ఇంటెలిజెంట్ కంట్రోల్ ప్రొపల్షన్, సూపర్-క్రూయిజ్ సామర్థ్యం, ఫ్లై-బై-లైట్ వ్యవస్థల అభివృద్ధి భవిష్యత్తులో భారత ఏరోస్పేస్ ఆధిపత్యాన్ని నిర్వచిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఏషియన్ డిఫెన్స్ రివ్యూ 2025: జియో-పొలిటికల్ షిఫ్ట్స్ అండ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ మల్టీలేటరలిజం ఇన్ ది ఇండో-పసిఫిక్’ అనే పుస్తకాన్ని రక్షణ శాఖ కార్యదర్శి విడుదల చేశారు. స్వదేశీ జెట్ ఇంజిన్ సహా అభివృద్ధి, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్లు, మానవరహిత వ్యవస్థలు, ఏరోస్పేస్ ఉత్పత్తి వ్యవస్థ బలోపేతంపై బహుళ సాంకేతిక సమావేశాలూ నిర్వహించారు.
ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో సాంకేతిక స్వయం-సమృద్ధి దిశగా సాగుతున్న భారత్ ప్రయాణం గురించి ఈ సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళం, డీఆర్డీఓ, పరిశ్రమల ప్రముఖులు చర్చించారు.
***
(रिलीज़ आईडी: 2180744)
आगंतुक पटल : 16