యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సర్దార్@150 యూనిటీ మార్చ్ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఈ ప్రచారంలో భాగంగా ఎమ్‌వై భారత్ ఆధ్వర్యంలో 'వికసిత్ భారత్ పాదయాత్రలు'

Posted On: 07 OCT 2025 5:53PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఎమ్‌వై భారత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది. జాతీయ గౌరవాన్ని పెంపొందించడం, పౌరుల భాగస్వామ్యాన్ని విస్తరించడం, స్మారక-భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా యువతలో ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించారు. దేశ నిర్మాణంలో జన్ భాగీదారీ అనే గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం యువత నుంచి అనుభవజ్ఞుల దాకా అందరినీ ఈ ఉమ్మడి స్మారక కార్యక్రమం కోసం ఒకచోట చేర్చుతుంది. ఇది దేశ నిర్మాణంలో యువత.. ముఖ్యంగా అమృత్ కాలపు యువత పాత్రను బలోపేతం చేస్తుంది. భారత జాతీయ నాయకుల త్యాగాలకు నివాళులర్పిస్తుంది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఎమ్‌వై భారత్ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన సర్దార్@150 యూనిటీ మార్చ్‌ను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దేశవ్యాప్త కార్యక్రమం దేశ యువతకు ఐక్యత, దేశభక్తి, పౌరుల బాధ్యతల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రారంభమైంది. విచ్ఛిన్నమైన దేశాన్ని ఏకం చేసిన నాయకుడి వారసత్వాన్నీ ఇది గౌరవిస్తుంది. ఈ ప్రచారం ద్వారా తమ దైనందిన జీవితాల్లో, సమాజ భాగస్వామ్యంలో ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి ఆదర్శాలను స్వీకరించేలా యవతను ప్రోత్సహిస్తారు.

 

డిజిటల్ దశ ప్రారంభం:

 

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఈ నెల 6న ఎమ్‌వై భారత్ పోర్టల్‌లో డిజిటల్‌గా ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ దశలో సోషల్ మీడియా రీల్ పోటీ, వ్యాస రచన పోటీ, సర్దార్@150 యువ నాయకుల కార్యక్రమం ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 150 మంది విజేతలు జాతీయ పాదయాత్రలో పాల్గొనే అవకాశం పొందుతారు.

 

ప్రచార దశలు: సర్దార్@150 ఐక్యతా మార్చ్ దేశవ్యాప్తంగా కింది దశల్లో జరుగుతుంది:

 

1. జిల్లా-స్థాయి పాదయాత్రలు (అక్టోబరు 31 నుంచి నవంబరు 15 వరకు):

 

a. కర్ణాటకలోని 31 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 3 రోజుల పాటు 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తారు.

 

b. పాదయాత్రకు ముందు స్థానిక కమ్యూనిటీలలో అవగాహనను, ఉత్సాహాన్ని పెంపొందించడానికి పాఠశాలలు, కళాశాలల్లో వివిధ ప్రీ-ఈవెంట్ కార్యకలాపాలనూ నిర్వహిస్తారు. వీటిలో భాగంగా వ్యాసరచన, చర్చా పోటీలు, సర్దార్ పటేల్ జీవితంపై సెమినార్లు, వీధి నాటకాలు (నుక్కడ్ నాటక్స్) నిర్వహిస్తారు.

 

c. వీటితో పాటు యువతతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తారు. పలు సంస్థలు స్వదేశీ ఉత్సవాలను నిర్వహిస్తాయి. ఇందులో పాల్గొనేవారు "గర్వ్ సే స్వదేశీ" ప్రతిజ్ఞ చేస్తారు. అదనంగా ఈ ప్రాంతంలో యోగా, ఆరోగ్య శిబిరాలు, పరిశుభ్రత డ్రైవ్‌లు నిర్వహిస్తారు.

 

d. పాదయాత్రలో పాల్గొనేవారు సర్దార్ పటేల్ విగ్రహాలు లేదా చిత్రపటాలకు పుష్పాంజలి ఘటిస్తారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవాల్లోనూ వారు పాల్గొంటారు.

 

2. నేషనల్ మార్చ్ (నవంబరు 26 నుంచి డిసెంబరు 6 వరకు):

 

a. సర్దార్ పటేల్ జన్మస్థలం కరంసద్ నుంచి కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వరకు 152 కిలోమీటర్ల పాదయాత్ర

 

b. ప్రీ-ఈవెంట్‌లో భాగంగా పాదయాత్ర నిర్వహించే మార్గంలోని అన్ని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి కార్యకలాపాలు చేపడతారు. ఎమ్‌వైబీ, ఎన్ఎస్ఎస్, యువ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

c. ఈ మార్గంలోని 150 స్టాప్‌లలో సర్దార్ పటేల్ జీవితంపై ప్రదర్శనలు, భారత వైవిధ్య సంస్కృతిని ప్రదర్శించే వేడుకలూ నిర్వహిస్తారు.

 

d. ప్రతిరోజూ సాయంత్రం ప్రఖ్యాత పండితులు సర్దార్ పటేల్ జీవితం, విజయాలను వివరించే సర్దార్ గాథా సమావేశాలను నిర్వహిస్తారు.

 

అన్ని రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలు ఎమ్‌వై భారత్ పోర్టల్: https://mybharat.gov.in/pages/unitymarch ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో నమోదు చేసుకుని, అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని దేశవ్యాప్తంగా యువతను ప్రోత్సహిస్తున్నారు. 

 

****


(Release ID: 2180052) Visitor Counter : 22
Read this release in: English