యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా నిర్వహించడం దేశానికే గర్వకారణమన్న ప్రముఖ క్రీడాకారులు.. దిగ్గజాలు...


2010 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ నుంచి సమగ్రత, సౌలభ్యం, క్రీడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగయ్యాయన్న ప్రముఖ క్రీడాకారులు

प्रविष्टि तिथि: 06 OCT 2025 5:45PM by PIB Hyderabad

ఇండియన్ ఆయిల్ న్యూఢిల్లీ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఆదివారం ముగిసింది. 100కు పైగా దేశాల నుంచి 2200 మందికి పైగా క్రీడాకారులు 186 పతకాల ఈవెంట్‌ల కోసం పోటీ పడ్డారు. తొలిసారిగా భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ క్రీడల్లో ఆతిథ్య భారత జట్టు రికార్డు స్థాయిలో 22 పతకాలను గెలుచుకుంది. వీటిలో 6 బంగారు, 9 రజత, 7 కాంస్య పతకాలున్నాయి. ఈ క్రీడల్లో ఇప్పటివరకు ఇదే భారత అత్యుత్తమ ప్రదర్శన.

2025లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ నిర్వహణ ద్వారా.. సాధారణంగా క్రీడా ప్రపంచంలో ప్రముఖ నిర్వాహకులుగా భావించే ఉన్నత స్థాయి, పేరున్న నిర్వాహకుల సరసన భారత్ నిలిచింది. ఐకానిక్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్‌ను పతకాల ఈవెంట్‌గా చేర్చారు. అంతర్జాతీయ ఈవెంట్‌ను సజావుగా నిర్వహించగల సామర్థ్యాన్ని భారత్ "అద్భుతంగా" ప్రదర్శించిందని పలువురు అంతర్జాతీయ పారా అథ్లెట్లు, ప్రపంచ ఛాంపియన్‌లు, భారతీయ క్రీడారంగ ప్రముఖులు భావిస్తున్నారు. ఖతార్, యూఏఈ, జపాన్ తర్వాత ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లను విజయవంతంగా నిర్వహించిన నాల్గో ఆసియా దేశంగా భారత్ నిలిచింది.

గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారత ప్రదర్శనను చూస్తే.. దుబాయ్-2019 ఎడిషన్‌లో తొమ్మిది పతకాలు, పారిస్-2023లో 10 పతకాలు, 2024-కోబ్ ఎడిషన్‌లో 17 పతకాలను భారత్ గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో కూడా భారత్ సాధించిన పతకాల సంఖ్య... 2004 ఏథెన్స్‌లో రెండు పతకాలు, 2016 రియో డి జనీరోలో నాలుగు పతకాలు, 2020 టోక్యోలో 19 పతకాలుగా ఉండగా, 2024 పారిస్ పారాలింపిక్స్‌లో ఏకంగా 29 పతకాలను సాధించిన భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది.

భారత పారా అథ్లెట్ల ప్రదర్శనలో గణనీయమైన మెరుగుదల వారికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు నిదర్శనం. ప్రభుత్వ టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం కింద ఎంపికైన 15 మంది అథ్లెట్లు.. ఖేలో ఇండియా కార్యక్రమం నుంచి ఎంపికైన ఒకరు డబ్ల్యూపీఏసీ-2025లో పతకాలను సాధించారు. 23 టీవోపీఎస్ గ్రూప్ అథ్లెట్లు, 22 మంది ఖేలో ఇండియా అథ్లెట్లు డబ్ల్యూపీఏసీ-2025లో పలు విభాగాల్లో పోటీ పడ్డారు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఆరుసార్లు బంగారు పతక విజేత, మూడుసార్లు పారాలింపిక్ పతక విజేత అయిన నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్లూర్ జోంగ్ భారత ఆతిథ్యాన్ని.. ఆతిథ్య దేశం తమను స్వాగతించిన తీరును ప్రశంసించారు. రెండు రకాల వైకల్యంతోనూ లాంగ్ జంప్, 100 మీటర్ల టీ64 విభాగాల్లో ఫ్లూర్ రెండు బంగారు పతకాలు సాధించారు.

"భారతదేశంలో ఇది ఒక అద్భుతమైన అనుభవం. అధికారులు, స్వచ్ఛంద సేవకులు, వైద్య సిబ్బంది, హోటల్ సిబ్బందితో సహా ప్రజలంతా చాలా ఆత్మీయంగా స్వాగతించారు. వారంతా ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు. అవకాశం వస్తే మళ్లీ భారత్‌కు రావడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని ఫ్లూర్ జోంగ్ అన్నారు.

పారాలింపిక్ గేమ్స్, ఆసియా పారా గేమ్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పలు అంతర్జాతీయ పతకాలు సాధించిన అనుభవం గల నిర్వాహకురాలు దీపా మాలిక్ మాట్లాడుతూ పారా అథ్లెట్ల విజయాలను పౌరులూ, ప్రభుత్వం గుర్తించాలన్నారు.

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లను ఇంత గొప్పగా భారత్ నిర్వహిస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని దీప పేర్కొన్నారు. "100కు పైగా దేశాలకు భారత్ విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇది దేశంలో పారా క్రీడల విభాగంలో నిర్వహించిన అతిపెద్ద వేడుక అని చెప్పడానికి ఒక అథ్లెట్‌గా.. నిర్వాహకురాలిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ప్రపంచస్థాయిలో భారత్‌కు మంచి గుర్తింపునివ్వడమే కాకుండా భారతీయుల హృదయాల్లోనూ ఈ క్రీడల పట్ల అవగాహనను, అభిమానాన్ని కలిగిస్తుంది. చివరిసారిగా 2010 కామన్వెల్త్ గేమ్స్ ద్వారా బహుళ-దేశాల స్థాయి పారా క్రీడల టోర్నీకి భారత్ ఆతిథ్యమిచ్చింది. క్రీడల నిర్వహణ విషయంలో మౌలిక సదుపాయాల నుంచి వసతి వరకు, ప్రయాణ ఏర్పాట్ల నుంచి స్వచ్ఛంద సేవకుల వరకు నేటి దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది." అని దీప వ్యాఖ్యానించారు.

"అవును.. భారత్ 2036 ఒలంపిక్స్ నిర్వహణకూ సిద్ధంగా ఉంది.  భారతదేశం ఇప్పుడు పారా అథ్లెట్లు తమ కలలను కొనసాగించడానికి, పురోగతి సాధించడానికి, తమ దేశాన్ని గర్వపడేలా చేయడానికి అవకాశాలు అపారంగా లభించే కొత్త సమ్మిళిత వికసిత్ భారత్‌గా ఉంది" అని దీప అన్నారు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలు ఏక్తా భ్యాన్, ధరంబీర్‌లకు శిక్షణనిచ్చిన పారాలింపిక్ పతక విజేత, కోచ్ అమిత్ సరోహా మాట్లాడుతూ.. డబ్ల్యూపీఏసీ-2025 ఇప్పటివరకు భారత్ ఆతిథ్యంలో అత్యుత్తమంగా నిర్వహించిన అంతర్జాతీయ ఈవెంట్‌గా నిలుస్తుందన్నారు. ఆతిథ్య దేశం ఇప్పుడు పారాలింపిక్స్‌ నిర్వహించగల సామర్థ్యాన్నీ కలిగి ఉందని స్పష్టం చేశారు.

వివిధ దేశాల నుంచి వచ్చిన పారా-అథ్లెట్లు భారత ఆటగాళ్లతో కలిసి పోటీపడిన ఈ టోర్నీని అమిత్ 2010 కామన్వెల్త్ క్రీడలతో పోల్చారు. "ఇది భారత్ నిర్వహించిన అతిపెద్ద పారా క్రీడా కార్యక్రమం. 4 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, పలు పారాలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవంతో నేను చెబుతున్నాను.. అథ్లెట్లకు అందించిన మౌలిక సదుపాయాల నాణ్యత, బస, ఆహారం, అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలు అంతర్జాతీయ అథ్లెట్లకు ఎక్కడా లభించని అత్యుత్తమమైన అనుభవాన్ని అందించాయని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా పారాలింపిక్స్‌ నిర్వహణకు మనం సిద్ధంగా ఉన్నామనీ.. ప్రపంచమూ ఇప్పుడు దానిని చూసిందని నేను భావిస్తున్నాను" అని ఆయన అన్నారు.

డబ్ల్యూపీఏసీ-2025 పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 ఈవెంట్‌లో స్వర్ణం సాధించడంతో పాటు.. ఛాంపియన్‌షిప్ రికార్డునూ సృష్టించిన మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ సుమిత్ అంటిల్ మాట్లాడుతూ.. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీవోపీఎస్) మద్దతుతో భారత పారా అథ్లెట్లకు అత్యుత్తమ స్థాయి శిక్షణ, సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

"2014లో టీవోపీఎస్ ప్రారంభం నుంచి భారత అథ్లెట్లకు సరైన మార్గదర్శనం, మద్దతు లభించాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సోనెపట్, గాంధీనగర్‌ కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కామన్వెల్త్ క్రీడలకు ముందు కనీసం విని ఉండని అత్యున్నత స్థాయి కోచ్‌లు, పోషకాహార నిపుణులు, డైట్, రికవరీ విధానాలనూ పారా అథ్లెట్లు పొందుతున్నారు. ఇది మా అథ్లెట్ల ప్రదర్శన అనేక రెట్లు మెరుగయ్యేందుకు ఎంతగానో సహాయపడింది." అని సుమిత్ తెలిపారు.

భారత్‌కు మరెన్నో ప్రశంసలూ లభించాయి.

లాంగ్ జంప్ టీ64 విభాగంలో ప్రపంచ ఛాంపియన్ అయిన జర్మనీకి చెందిన మార్కస్ రెహ్మ్ మాట్లాడుతూ.. "నేను ఇక్కడకు రావడం ఇది రెండోసారి.. కానీ భారతదేశంలో ప్రతి క్షణాన్నీ నేను ఆస్వాదించాను. ఇక్కడ ఆతిథ్యం చాలా బాగుంది. ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు." అన్నారు.

న్యూఢిల్లీలో షాట్ పుట్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కెనడాకు చెందిన గ్రెగ్ స్టీవర్ట్ మాట్లాడుతూ.. "భారతీయ సంస్కృతి కెనడాలో కంటే చాలా భిన్నంగా ఉంది. ఇక్కడి ఆతిథ్యమూ అద్భుతంగా ఉంది. నేను స్టేడియంలో.. నగరంలో ఎక్కడ చూసినా ఆ ఆత్మీయతను అనుభవించాను" అని అన్నారు.

టీ64 ఈవెంట్‌లో రజతం గెలుచుకున్న యూఎస్ఏకి చెందిన పారా లాంగ్‌జంపర్ డెరెక్ లోసిడెంట్ మాట్లాడుతూ.. "భారతదేశంలోని న్యూఢిల్లీలో నాకు గొప్ప అనుభవం లభించింది. నేను ఒక వారానికి పైగా ఇక్కడ ఉన్నాను. ఆహారం నుంచి ఈవెంట్ నిర్వహణ వరకూ ఇక్కడ అంతా అద్భుతంగా ఉంది." అని వ్యాఖ్యానించారు.

 

***


(रिलीज़ आईडी: 2175850) आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी