మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జంతువుల రక్త మార్పిడి, బ్లడ్ బ్యాంకుల కోసం తొలిసారిగా జాతీయ మార్గదర్శకాలు-ఎస్‌వోపీలు జారీ చేసిన భారత్


రాష్ట్రాల నియంత్రణలో వెటర్నరీ బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు లక్ష్యంగా మార్గదర్శకాలు

జంతువుల రక్త మార్పిడిలో బయోసేఫ్టీ, అత్యాధునిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న మార్గదర్శకాలు

Posted On: 25 AUG 2025 7:03PM by PIB Hyderabad

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక-పాడిపరిశ్రమల విభాగం (డీఏహెచ్‌డీ) “దేశంలో జంతువుల రక్త మార్పిడి, బ్లడ్ బ్యాంకుల కోసం తొలిసారిగా మార్గదర్శకాలు-ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌వోపీలు)” జారీ చేసింది. ప్రాణాలు రక్షించడంలో రక్త మార్పిడి ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జంతువుల్లో గాయాలు, తీవ్రమైన రక్తహీనత, శస్త్రచికిత్స కారణంగా రక్తం పోవడం, అంటు వ్యాధులు, రక్తం గడ్డకట్టడంలో సమస్యలు ఉన్న సందర్భాల్లో రక్త మార్పిడి అవసరమవుతుంది. ఇప్పటివరకు దేశంలో పశువైద్యంలో రక్త మార్పిడి కోసం సమగ్ర జాతీయ విధానం ఏదీ లేదు. చాలా జంతువులకు అత్యవసరాల్లో రక్త మార్పిడి చేసేటప్పుడు ప్రామాణిక పద్ధతిలో దాతల స్క్రీనింగ్, రక్త వర్గాన్ని నిర్ణయించడం, రక్తాన్ని నిల్వ చేసే నిబంధనలను పట్టించుకునేవారు కాదు. జంతువుల్లో రక్త మార్పిడి కోసం దాతల ఎంపిక, రక్త సేకరణ, విభాగాల ప్రాసెసింగ్, నిల్వ, మార్పిడి పద్ధతులు, పర్యవేక్షణ, భద్రతాపరమైన జాగ్రత్తలను అనుసరించడంలోని అంతరాలను తగ్గించడానికి శాస్త్రీయ, నైతిక, నిర్మాణాత్మక విధానాలను ఈ మార్గదర్శకాలు-ఎస్‌వోపీలు అందిస్తాయి. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాక్టీస్ చేస్తున్న పశువైద్యులు, నిపుణులతో విస్తృత సంప్రదింపుల అనంతరం రూపొందించిన ఈ మార్గదర్శకాలు భారత్ అనుసరించే విధానాలను ప్రపంచ అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చేస్తాయి.

మార్గదర్శకాలు-ఎస్‌వోపీల్లోని ముఖ్యాంశాలు:

· బయోసేఫ్టీకి అనుకూలమైన మౌలిక సదుపాయాలతో రాష్ట్రాల నియంత్రణలో వెటర్నరీ బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు.

· రక్త వర్గాలు సరిపోలని కారణంగా తలెత్తే రియాక్షన్స్ నివారించడానికి రక్త వర్గాన్ని నిర్ణయించే పరీక్షలు, క్రాస్-మ్యాచింగ్ తప్పనిసరి చేయడం.

· ఆరోగ్యం, తీసుకున్న టీకాలు, వయస్సు, బరువు, వ్యాధి ముప్పును తెలుసుకునే పరీక్షల నిబంధనలు భాగంగా ఉన్న దాత అర్హత ప్రమాణాలు.

· స్వచ్ఛంద, చెల్లింపు లేని రక్త దానాలకు, దాత హక్కుల పత్రంతో కూడిన సమాచారాత్మక సమ్మతికి ప్రాధాన్యమివ్వడం.

· జూనోటిక్ ముప్పును నిర్వహించడానికి వన్ హెల్త్ సూత్రాలను సమీకృతం చేయడం.

· దాతల నమోదు, రక్తమార్పిడి పర్యవేక్షణ, ప్రతికూల రియాక్షన్ కోసం ప్రామాణిక ఎస్‌వోపీలు, ఫారంలు, చెక్‌లిస్టులు.

· డిజిటల్ రిజిస్ట్రీలు, రియల్-టైమ్ ఇన్వెంటరీలు, అత్యవసర హెల్ప్‌లైన్‌తో నేషనల్ వెటర్నరీ బ్లడ్ బ్యాంక్ నెట్‌వర్క్ (ఎన్‌-వీబీబీఎన్) ఏర్పాటు కోసం రోడ్‌మ్యాప్.

· బీవీఎస్‌సీ, ఏహెచ్ పాఠ్యాంశాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములు, నిరంతర పశువైద్య విద్యలో శిక్షణ మాడ్యూళ్లను చేర్చడం.

భవిష్యత్తులో ఈ మార్గదర్శకాలు మొబైల్ రక్త సేకరణ యూనిట్లు, అరుదైన రక్త వర్గాల కోసం క్రయోప్రిజర్వేషన్, దాత-గ్రహీతలను సరిపోల్చే మొబైల్ అప్లికేషన్లు, అధునాతన రక్తమార్పిడి పరిశోధనల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి.

దేశంలోని పశువులు, పెంపుడు జంతువుల రంగాలు ప్రపంచంలోనే అతిపెద్దవి, వైవిధ్యమైనవి. వీటిలో 537 మిలియన్లకు పైగా పశువులు, 125 మిలియన్లకు పైగా పెంపుడు జంతువులు ఉన్నాయి. ఈ రంగాలు జాతీయ జీడీపీకి 5.5 శాతం, వ్యవసాయ జీడీపీకి 30 శాతానికి పైగా సహకారం అందిస్తున్నాయి. ఆహార భద్రత, గ్రామీణ జీవనోపాధి, ప్రజారోగ్యానికి మూలస్తంభంగా ఉన్నాయి. పశువుల్లో రోగ నిర్ధారణ, చికిత్సా విధానాల పురోగతితో ప్రత్యేక అత్యవసర పశుసంరక్షణ కోసం ప్రత్యేకించి వివిధ జాతుల జంతువుల్లో రక్త మార్పిడి సహాయం కోసం డిమాండ్ పెరుగుతోంది.

ఈ మార్గదర్శకాల జారీ భారత పశువైద్య ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వైద్య సంరక్షణను బలోపేతం చేయడం.. జంతువుల ప్రాణాలను కాపాడడం.. గ్రామీణ జీవనోపాధిని పరిరక్షించడం, దేశవ్యాప్తంగా జంతు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గణనీయమైన విజయాన్ని సూచిస్తుంది. సూచనలుగా, చట్టబద్ధం కాని విధానాలుగా రూపొందించిన ఈ మార్గదర్శకాల పత్రం, జంతు సంక్షేమం, బయోసేఫ్టీ, ప్రజల విశ్వాసం పరంగా అత్యున్నత ప్రమాణాలను నిర్ధారిస్తూనే నూతన శాస్త్రీయ ఆధారాలు, క్షేత్రస్థాయి అనుభవాలు, సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలతో క్రియాశీలంగా, నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది.

మార్గదర్శకాలు, ఎస్‌వోపీల పత్రం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి


 

****


(Release ID: 2160769)
Read this release in: English , Urdu , Hindi