హోం మంత్రిత్వ శాఖ
అధికారిక భాషా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘‘దక్షిణ్ సంవాద్’’ స్వర్ణోత్సవం
प्रविष्टि तिथि:
10 JUL 2025 3:42PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న అధికారిక భాషా విభాగం తన స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తమ విభాగాన్ని 1975 జూన్ 26న ఏర్పాటు చేసినట్లు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. స్వర్ణోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని గత నెల 26న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. దీనికి తరువాయిగా, ‘‘దక్షిణ్ సంవాద్’’ వేడుకల పరంపరలో భాగంగా నిర్వహించ తలపెట్టిన ప్రధాన వేడుకకు శుక్రవారం (ఈ నెల 11న) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది.

ఈ చరిత్రాత్మక కార్యక్రమం వివరాలను ప్రసార మాధ్యమాలకు తెలియజేసే ఉద్దేశంతో, అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ ఈ రోజు హైదరాబాద్‌లోని సీజీఓ టవర్స్‌లో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమం ఉద్దేశాలు, ముఖ్యాంశాలతో పాటు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని భావిస్తున్న ప్రముఖుల వివరాలను కూడా తెలియజేశారు. హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్ ఈ పత్రికా సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
మీడియాను ఉద్దేశించి డాక్టర్ మీనాక్షీ జాలీ ప్రసంగిస్తూ, ‘దక్షిణ్ సంవాద్’ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి మాన్య శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఉంటారని తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయ శ్రీ హరివంశ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొంటారని ఆమె వివరించారు.

దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, స్కాలర్లు, భాష పట్ల ఉత్సాహం కనబరచే వారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివస్తారని కూడా డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటకలతో పాటు పుదుచ్చేరీకి చెందిన వారు ఉంటారని ఆమె చెప్పారు.
స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలను ఈ వేడుకలో సత్కరించనున్నారు. భాషావ్యాప్తిని ప్రోత్సహించడంతో పాటు సాంస్కృతిక అనుబంధం పట్ల అధికారిక భాషా విభాగానికి ఉన్న అంకితభావాన్ని ఈ సత్కార ఘట్టం చాటిచెప్పనుంది.

నేపథ్యం:
కార్యాలయ విధులలో హిందీని ఉపయోగించే ప్రాతిపదికపై మన దేశాన్ని ఏ ప్రాంతం, బీ ప్రాంతం, సీ ప్రాంతం.. ఇలా మూడు ప్రాంతాలుగా వ్యవహరిస్తున్నారు. అధికారిక భాషా విధానాన్ని సమర్ధమంతంగా అమలు చేయడానికి మద్దతిచ్చేందుకుగాను దేశవ్యాప్తంగా టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీస్ (టీఓఎల్ఐసీస్)ను ఏర్పాటు చేశారు.
‘‘దక్షిణ్ సంవాద్’’ కార్యక్రమం ఒక వేడుక మాత్రమే కాదు.. అంతకు మించింది. ఈ కార్యక్రమాన్ని అధికారిక భాష అమలు తీరుతెన్నులలో అయిదు దశాబ్దాలుగా చోటు చేసుకొన్న ప్రగతికి ఒక ప్రతీకగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు దేశంలో భాషాపరమైన ఐకమత్యాన్ని బలపరచడంలో దక్షిణాది పోషిస్తూ వస్తున్న చురుకైన పాత్రకు ఈ వేడుక ఒక గుర్తింపుగా కూడా ఉంటోంది. భారతీయ భాషలన్నిటి మధ్య చర్చలను, సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. ఈ ప్రక్రియలో హిందీ భాష ఒక సమన్వయకర్త పాత్రను పోషిస్తోంది. హిందీ భాష ఒక స్థానాన్ని పూర్తి చేసేదిగానో లేక ప్రత్యామ్నాయంగానో కాకుండా, మన దేశంలోని సుసంపన్న బహుళ భాషల్లో ఓ వారధిలా ఉంటోందని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పనున్నారు.
***
(रिलीज़ आईडी: 2143934)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English