బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన బొగ్గు-గనుల మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీ సమావేశాలు

నాడు పోస్టు చేయడమైనది: 03 JUL 2025 4:03PM by PIB Hyderabad

బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ అనుబంధ కమిటీలైన గౌరవ పార్లమెంటు సభ్యుల సంప్రదింపుల కమిటీ సమావేశాలు ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే సహాధ్యక్షత వహించారు.



బొగ్గు మంత్రిత్వ శాఖ ఎజెండా ప్రధానంగా "వెలికితీతకు మించి: గని మూసివేత-పునర్వినియోగం" పై దృష్టి సారించగా.. గనుల మంత్రిత్వ శాఖ ప్రధానంగా "ఖనిజాన్వేషణ" గురించి చర్చించింది.

రెండు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు విధానపరమైన కీలక కార్యక్రమాలు, ప్రస్తుత పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానిక పరిశ్రమలకు మద్దతునివ్వడం, ప్రభావిత వర్గాలకు ఆర్థిక అవకాశాలను కల్పించడం లక్ష్యంగా వివిధ పర్యావరణ పునరుద్ధరణ-పునర్వినియోగ కార్యక్రమాలను గురించి బొగ్గు మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. ప్రధాన అన్వేషణ సంస్థలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎమ్ఈసీఎల్) అందించిన ప్రజెంటేషన్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఖనిజాన్వేషణను విస్తరించాలనే తన ప్రతిష్టాత్మక దార్శనికతను గనుల మంత్రిత్వ శాఖ వివరించింది.

కమిటీని ఉద్దేశించి ప్రసంగించిన గౌరవ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి.. బొగ్గు రంగంలో భారత్ కీలక దశలో ఉందన్నారు. రికార్డు స్థాయిలో 1 బిలియన్ టన్నులకు పైగా దేశీయ బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూనే, పర్యావరణ హితమైన కార్యక్రమాలూ, సుస్థిరతను భారత్ కొనసాగిస్తోందన్నారు. గనుల మూసివేతను మన జాతీయ, నైతిక బాధ్యతగా అభివర్ణించిన కేంద్ర మంత్రి.. పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం దాని లక్ష్యమని పేర్కొన్నారు.



స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా గత సంవత్సరం 10 గనులను విజయవంతంగా మూసివేసినట్లు తెలిపారు. మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న ఫాస్ట్-ట్రాక్ విధానం ద్వారా త్వరితగతిన మూసివేయాల్సిన మరో 147 గనులనూ గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఖనిజాన్వేషణ గురించి ప్రస్తావిస్తూ.. ముఖ్యంగా కీలక, వ్యూహాత్మక ఖనిజాల విషయంలో ఆత్మనిర్భరత (స్వయం సమృద్ధి) సాధించడం వికసిత్ భారత్ 2047 జాతీయ దార్శనికతను సాకారం చేసుకోవడంలో కీలక ముందడుగు అవుతుందని శ్రీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆధునిక భూభౌతిక సర్వేల వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తూ మిషన్ మోడ్‌లో ఖనిజాన్వేషణ సాగిస్తున్నట్లు ఆయన వివరించారు. అన్వేషణ ప్రయత్నాలను వేగవంతం చేయడంలో, దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాల కోసం ఖనిజ భద్రతను నిర్ధారించడంలో కీలకమైన ప్రైవేట్ రంగ పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

గౌరవ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ.. సుస్థిర మైనింగ్, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. గనుల మూసివేత, ఖనిజాన్వేషణలను వేగవంతం చేసే దార్శనికతను ప్రస్తావించిన ఆయన.. దీర్ఘకాలిక విజయాన్ని సాధించడంలో సమాజ భాగస్వామ్యం, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కీలకమన్నారు.

మంత్రిత్వ శాఖ క్రియాశీల ప్రయత్నాలను ప్రశంసించిన కమిటీ సభ్యులు.. గనుల మూసివేత ప్రాజెక్టుల సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని మెరుగుపరచడం, వారికి సంబంధించిన ప్రాంతాల్లో అన్వేషణ కార్యకలాపాలను వేగవంతం చేయడం గురించి పలు సూచనలు చేశారు.

హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థతో కలిసి రీక్లెయిమ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఈ వారం ప్రకటించింది. ఈ రీక్లెయిమ్ కార్యక్రమం కోసం కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సంస్థలు హార్ట్‌ఫుల్‌నెస్‌తో చేతులు కలిపాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన రెండు అవగాహన ఒప్పందాలపై ఆయా సంస్థలు సంతకాలు చేశాయి. హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వనంలో గల హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ మార్గదర్శి.. శ్రీ రామ్ చంద్ర మిషన్ అధ్యక్షులు రెవరెండ్ దాజీ, బొగ్గు-గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబేలతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్‌సీసీఎల్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థల ప్రతినిధులూ పాల్గొన్నారు. రీక్లెయిమ్ కార్యక్రమంలో భాగంగా హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ వనరుల ద్వారా గని మూసివేత ప్రదేశాల్లో పునరుద్ధరణ పనులను ప్రోత్సహించడం, పచ్చదనాన్ని పెపొందించడం, పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.

 



 

***


(రిలీజ్ ఐడి: 2141946) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English