కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ పథకం ద్వారా విస్తృత ప్రయోజనాలు: ప్రాంతీయ పి ఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్
Posted On:
03 JUL 2025 7:19PM by PIB Hyderabad
కొత్తగా చేరబోయే ఉద్యోగులు కేంద్రం ఇటీవల ఆమోదించిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక (ELI) పథకం ప్రయోజనాలను పొందాలని ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ అబ్దుల్ ఖాదర్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నూతన ELI పథకం గురించి వివరించారు. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే దీని లక్ష్యమని తెలిపారు.

తయారీ రంగంలో కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో ఈ పథకం సహాయపడుతుందని ఖాదర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తూ, త్రైమాసికానికి సగటున పది వేల మందితో, "ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 76,49,844 మంది ఉద్యోగులు ఈపిఎఫ్ఒ లో చేరారని” ఆయన అన్నారు. అయితే, ఈఎల్ఐ పథకం కొత్త నియామకాలకు మాత్రమే వర్తిస్తుందని, ఉద్యోగులు లేదా యజమానులు ఈ పథకం కింద నమోదు చేసుకోవడానికి మరియు ప్రయోజనాలను పొందడానికి https://shramsuvidha.gov.in/home ని సందర్శించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
"ఈ పథకం దేశంలోని 1.92 కోట్ల మంది మొదటిసారి కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం కింద ఉద్యోగి ప్రోత్సాహకంగా ₹15,000 వరకు ఒక నెల జీతాన్ని రెండు విడతలలో పొందుతారు. పారదర్శకత, సౌలభ్యం కోసం ఆధార్-లింక్ చేయబడిన ఉద్యోగి ఖాతాలకు మరియు పాన్-లింక్ చేయబడిన యజమాని ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేస్తారని కమిషనర్ శ్రీ ఖాదర్ తెలిపారు.
ఒక లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులకు సంబంధించి యజమానులు కూడా ప్రోత్సాహకాలను పొందుతారు. కనీసం ఆరు నెలల పాటు స్థిరమైన ఉపాధి ఉన్న ప్రతి అదనపు ఉద్యోగికి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు నెలకు మూడు వేల వరకు యజమానులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. తయారీ రంగం ఉద్యోగులకు సంబంధించి మూడవ మరియు నాల్గవ సంవత్సరాలలో కూడా ప్రోత్సాహకాలను పొడిగిస్తామని శ్రీ ఖాదర్ తెలిపారు.
ఈ సమావేశంలో పిఐబి డైరెక్టర్ పి రత్నాకర్, ఈపిఎఫ్ఒ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

***
(Release ID: 2141930)