పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో ఆధునిక పరిజ్ఞానంతో
అధునాతన డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ల్యాబ్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Posted On:
09 APR 2025 8:32PM by PIB Hyderabad
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)లో ఏర్పాటు చేసిన అధునాతన డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (డీఎఫ్డీఆర్, సీవీఆర్) లాబొరేటరీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు న్యూఢిల్లీలోని ఉడాన్ భవనంలో ప్రారంభించారు. సాధారణంగా ‘‘బ్లాక్ బాక్స్ ల్యాబ్’’గా పిలిచే ఈ అత్యాధునిక వ్యవస్థను రూ. 9 కోట్లతో ఏర్పాటు చేశారు.
పౌర విమానయాన శాఖ, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్, భారతీయ వాయుసేన, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీకి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రధాన విమానయాన సంస్థలకు చెందిన భద్రతా విభాగ అధిపతులు కూడా హాజరయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ.. విమానయాన భద్రతను బలోపేతం చేయడంలో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రాముఖ్యం గురించి వివరించారు. విమాన ప్రమాదాలకు మూల కారణాలను సమర్థవంతంగా గుర్తించి, జవాబుదారీతనాన్ని తీసుకురావడంతో పాటు భారత్‌లో సురక్షితమైన విమానయానాన్ని అందిస్తుందని తెలిపారు. సమర్థవంతమైన, స్వతంత్ర దర్యాప్తుల ద్వారానే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని మంత్రి తెలిపారు.
అధునాతన డీఎఫ్డీఆర్, సీవీఆర్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయడంలో, విమానాల నుంచి సేకరించిన ఫ్లయిట్ డేటాను విశ్లేషించి, సన్నద్ధం చేయడంలో ఏఏఐబీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏల్) అందించిన సహకారాన్ని మంత్రి ప్రశంసించారు. ఎఫ్డీఆర్ల తయారీ, మరమ్మతులకు సంబంధించి హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానాన్ని కొనియాడారు. అంతర్జాతీయంగా అధునాతన ఏవియానిక్స్ వ్యవస్థలు కలిగిన ఉన్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ చోటు దక్కించుకుందని మంత్రి తెలిపారు. మన దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి 350-400 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి స్పష్టంగా తెలియజేశారు.
ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ పాడయిన బ్లాక్‌బాక్సులను మరమ్మతు చేయడానికి, డేటాను తిరిగి పొందడానికి, ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించడానికి ఏఏఐబీకి వీలు కల్పిస్తుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్, రాడార్, ప్లయిట్ డేటా రికార్డర్ నుంచి తీసుకున్న డేటా మధ్య సంబంధాన్ని గుర్తించగలిగే సామర్థ్యంతో పాటు ప్రయోగశాలలో చేపట్టిన దర్యాప్తు ఫలితాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఈ ప్రయోగశాలను నిర్మించారు. ఇది ఐసీఏవో సభ్యదేశంగా భారత్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీ జీవీజీ యుగంధర్ మాట్లాడుతూ విమానయాన దర్యాప్తుల్లో పొరుగుదేశాలకు సైతం భారత్ సహకరిస్తుందని, ప్రాంతీయ భద్రతా భాగస్వామ్యం పట్ల భారత్ నిబద్ధతను ఇది తెలియజేస్తుందని తెలిపారు. వీటికి అదనంగా, వాణిజ్య అవసరాల కోసం ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాఫ్టర్లను తయారు చేయాలనే లక్ష్యంలో ఈ ల్యాబ్ ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు. ప్రమాదాల దర్యాప్తులో మాత్రమే కాకుండా డిజైన్, కార్యాచరణను మార్చడం ద్వారా ప్రమాదాలను నివారించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
ప్రపంచ విమానయాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసే దిశగా ఈ అధునాతన వ్యవస్థ ఏర్పాటయింది. విస్తృతమైన, సురక్షితమైన విమానయాన వ్యవస్థను దేశంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా దేశంలో సౌకర్యవంతమైన విమాన ప్రయాణం అందించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2120760)
Visitor Counter : 25