బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశాభివృద్ధిలో బొగ్గు రంగం కీలక పాత్ర-కిషన్ రెడ్డి


రూ. 98 కోట్ల గ్రాంటుతో పర్యావరణ హిత బొగ్గు ఇంధనం, ఉద్గార రహిత అత్యున్నత ప్రామాణిక సంస్థ (CLEANZ) ను నెలకొల్పనున్న హైదరాబాద్ ఐఐటీ, కోల్ ఇండియా లిమిటెడ్

प्रविष्टि तिथि: 07 MAR 2025 6:20PM by PIB Hyderabad

మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఖనిజాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నాయని, ఐఐటీ హైదరాబాద్ ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలు చేస్తోందని, తమ మంత్రిత్వ శాఖ ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అన్నారు.  బొగ్గు మన ఇంధన వ్యూహానికి మూలస్తంభంగా ఉందని, ఇది మన ప్రాథమిక ఇంధన అవసరాలని  సగానికి పైగా తీరుస్తూ , మన పరిశ్రమలకు వెన్నెముకగా నిలబడుతోందని కేంద్ర మంత్రి అన్నారు. గత దశాబ్ద కాలంలో, ప్రధానంగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, మన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మంత్రి తెలిపారు.

భారతదేశ అభివృద్ధికి బొగ్గు రంగం చాలా ముఖ్యమైనది, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంధన వనరుగా పనిచేస్తుంది, గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించడం తో పాటు దేశీయ బొగ్గు ఉత్పత్తి ద్వారా విద్యుత్ అవసరాలలో ఎక్కువ భాగాన్ని తీర్చడం ద్వారా ఇంధన భద్రతను పెంచుతుందని  మంత్రి తెలిపారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్ లో ఐఐటీ హైదరాబాద్ లో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో (క్లీన్జ్) పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటుకు కోల్ ఇండియా లిమిటెడ్, ఐఐటీ హైదరాబాద్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

పర్యావరణ హిత బొగ్గు ఇంధనం, ఉద్గార రహిత అత్యున్నత ప్రామాణిక సంస్థ CLEANZ ను నెలకొల్పుతున్నట్టు ఐఐటీ- హైదరాబాద్ ప్రకటించింది. ఇందుకోసం రూ.98 కోట్ల ప్రారంభ గ్రాంటుతో కోల్ ఇండియా లిమిటెడ్ నిధులు సమకూర్చనుంది. బొగ్గు, ఇంధన రంగంలో పరిశోధన సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు. అధునాతన పర్యావరణ హిత బొగ్గు సాంకేతికతల రూపకల్పన, నికర శూన్య లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు వనరుల సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించడంలో భారత్ అంకిత భావాన్ని ఈ సంయుక్త కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

బొగ్గు రంగంలో పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా రాంచీలోని సీఎంపీడీఐలో జాతీయ బొగ్గు, ఇంధన పరిశోధన కేంద్రాన్ని (ఎన్ఏసీసీఈఆర్) ఏర్పాటు చేశారు. ఆ శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సంయుక్త సమావేశం అనంతరం పర్యావరణ హిత బొగ్గు సాంకేతికతల ఆవిష్కరణలను, ఆ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఐఐటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలన్న వ్యూహాత్మక నిర్ణయానికి వచ్చారు. 

క్లీన్జ్ లక్ష్యం, ప్రణాళిక 

తక్కువ నాణ్యత కలిగిన (లోగ్రేడ్), తిరస్కరించిన భారతీయ బొగ్గుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. పర్యావరణ హిత బొగ్గు సాంకేతికతలను ఆవిష్కరించడం క్లీన్జ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లక్ష్యం. కింద పేర్కొన్న వాటితో సహా పలు కీలక అంశాలపై ఇది దృష్టిపెడుతుంది: 
- బొగ్గు పొరల నుంచి, బొగ్గు గనుల నుంచి వెలువడే మీథేన్ సంరక్షణను మరింత మెరుగుపరచడం 
- కర్బన శోషణ సాంకేతికతలు, ఖనిజాల శుద్ధి 
- కర్బన పదార్థాల నుంచి వాయు ఉత్పత్తి, సంశ్లేషిత వాయు వినియోగం
- పునరావృత ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ 
- కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ అనువర్తనాలు 
- ఇంధన సమర్థత, సంరక్షణ 
బహుముఖీన సాంకేతిక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని ఈ కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సుస్థిర ఇంధన రంగానికి ఇతోధికంగా లబ్ధి చేకూర్చడం కోసం అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. 

ఈ కేంద్రం ప్రత్యేకతలు  

అత్యంత ప్రభావశీలమైన ప్రాజెక్టుల్లో క్లీన్జ్ భాగస్వామి అవుతుంది: 
- పరిశోధన ఆధారిత సాంకేతికతల ఆధారంగా మూణ్నాలుగు ప్రయోగాత్మక ప్లాంటులను నెలకొల్పుతారు. 
- 5జీ, రోబోటిక్స్, పదార్థ విజ్ఞాన శాస్త్రాల వంటి వివిధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను అమలు చేస్తుంది. 
- కీలక, అరుదైన ఖనిజాలకు సంబంధించి వెలికితీత, శుద్ధి సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది. 
- పర్యావరణ హిత బొగ్గు, ప్రత్యామ్నాయ ఇంధనాల విషయంలో అత్యాధునిక సాంకేతికతలను అందిస్తుంది.
అంతేకాకుండా కోల్ ఇండియా సిబ్బందికి వర్క్ షాపులు, సదస్సులు, శిక్షణ కార్యక్రమాల ద్వారా సామాజిక అవగాహనను పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధిపై ‘క్లీన్జ్’ దృష్టి సారిస్తుంది. 

ఆర్థిక స్వావలంబన  

నిధులందించిన అయిదేళ్లకాలం అనంతరం కూడా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగేందుకు వీలుగా ఈ సంస్థ ఆర్థిక స్వావలంబనను సాధిస్తుంది. సంస్థ స్వతంత్ర మనుగడను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 

ఆమోదం, అవగాహన ఒప్పందం  

కోల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన కోల్ ఫైనాన్స్ విభాగం 368వ సమావేశంలో ఈ గ్రాంటును ఆమోదించింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సంబంధించి అవగాహన ఒప్పందంపై మార్చి 7న హైదరాబాదులో సంతకాలు చేస్తారు. 
పర్యావరణ హితంగా బొగ్గును వినియోగించుకోవడం, ఇంధన రంగంలో పరివర్తనపై దేశ లక్ష్యాలకు అనుగుణంగా సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా భారత ప్రస్థానంలో కీలకమైన చర్యగా ఈ సంయుక్త కార్యక్రమం నిలుస్తుంది. 

కోల్ ఇండియా లిమిటెడ్ సిఎండి శ్రీ పి.ఎం.ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ శ్రీ మూర్తి, ఎస్ సిసిఎల్ సిఎండి శ్రీ ఎన్ బలరాం నాయక్, పిఐబి హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

***


(रिलीज़ आईडी: 2109181) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English