గనుల మంత్రిత్వ శాఖ
గనుల తవ్వకం రంగంలో మహిళా సాధికారత: సముచిత ప్రాధాన్యం, నాయకత్వానికి పెద్దపీట
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2025 10:11PM by PIB Hyderabad
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా “మైనింగ్ రంగంలో మహిళల పాత్ర” అనే కార్యక్రమాన్ని సీఐఎల్ సహకారంతో గనుల మంత్రిత్వ శాఖ విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పాల్గొన్నారు. మైనింగ్ పరిశ్రమల్లో మహిళలు కీలక పాత్ర పోషించేలా చూసే విషయంలో తమ నిబద్ధతను వారు వ్యక్తం చేశారు.


జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గనుల తవ్వకం రంగంలో సాధికారత, పురోగతికి ప్రతీకగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కార్యక్రమానికి హాజరైన మహిళలను మంత్రులు ఆహ్వానించారు. అనంతరం మైనింగ్ రంగానికి విశేష సేవలందించిన 46 మంది నిపుణులను కేంద్ర మంత్రులు, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సన్మానించారు. ఈ రంగంలో అడ్డంకులను అధిగమించి, పరిశ్రమలను పురోగతిలో నడిపించినందుకు ఐబీఎం, టాటా, జీఎస్ఐ, అదానీ, వేదాంత వంటి ప్రముఖ సంస్థలతో పాటు 10కి పైగా ప్రైవేటు కంపెనీలు, ఎన్జీఓలు, పలు పీఎస్‌యూలకు చెందిన మహిళలను ఈ సందర్భంగా గౌరవించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మైనింగ్ విభాగాల మహిళా అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది గనుల తవ్వకం రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి చేస్తున్న సహకార చర్యలను ప్రతిబింబిస్తోంది.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ రంగంలో మహిళల ప్రాముఖ్యత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ రంగంలో మహిళల విలువైన సహకారాలను గుర్తిస్తున్నట్లు తెలిపిన ఆయన పురుషాధిక్య పరిశ్రమలో సమాన అవకాశాలను సృష్టించడానికి మరిన్ని చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, మైనింగ్‌లో మహిళా నిపుణులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సతీష్ చంద్ర దూబే వివరించారు. గనుల తవ్వకం సహా అన్ని రంగాల్లో మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు.

మైనింగ్ రంగంలో మహిళా సాధికారత: నిపుణుల చర్చ
ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన నిపుణులతో రెండు బృంద చర్చలను కూడా నిర్వహించారు. మైనింగ్ రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన సవాళ్లు, వ్యూహాలపై తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.
నిపుణుల చర్చ I: మైనింగ్ లో సమ్మిళితత్వంపై మహిళల దృక్పథం – సవాళ్లు, ముందుకు తీసుకెళ్లే మార్గాలు
మైనింగ్ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న అవరోధాలతోపాటు సమ్మిళితత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించవచ్చన్న అంశాలపై ఇందులో చర్చించారు. ఈ చర్చకు అనుసంధానకర్తగా జేఎస్, ఎఫ్ఏ శ్రీ నిరుపమ్ కొట్రు వ్యవహరించారు. మైనింగ్ రంగంలో మహిళల క్రియాశీల భాగస్వామ్యం, వారి నేతృత్వానికి అవకాశం కల్పించేలా నిర్మాణాత్మక, సాంస్కృతిక మార్పుల ఆవశ్యకత దిశగా ఆయన చర్చను ముందుకు నడిపారు. చర్చలో పాల్గొన్న నిపుణులు తమ వ్యక్తిగత ప్రస్థానానికి సంబంధించి ముఖ్యమైన అంశాలను వివరించడంతోపాటు.. మరింత సమగ్రమైన, సహాయక వాతావరణాన్ని సృష్టించేందుకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచించారు.
నిపుణుల చర్చ II: గని రంగంలో మహిళా సాధికారత – సమ్మిళితత్వం, ఆవశ్యకత, మార్గం, కొనసాగింపు
మహిళలను సాధికారులను చేయడంతోపాటు మైనింగ్ రంగాన్ని మరింత సమ్మిళితం చేయడానికి అవసరమైన చర్యలపై నిపుణులతో కూడిన రెండో బృందం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ చర్చకు అనుంధానకర్తగా జేఎస్ (ఎఫ్ఎంఎన్) శ్రీమతి ఫరీదా ఎం. నాయక్ వ్యవహరించారు. లింగపరమైన అవరోధాలను బద్దలు కొట్టడానికి, ఈ రంగంలో మహిళలకు సమాన అవకాశాలు లభించేలా చేయడానికి అవసరమైన మార్గాలను ఇందులో చర్చించారు. ఎప్పటికప్పుడు మహిళలకు సమాన అవకాశాలను అందించి ఈ రంగంలో వారు ముందుకు నడిచేలా చేయడంలో మార్గదర్శకత్వం, నాయకత్వం, విధానపరమైన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని నిపుణులు చర్చించారు.
ఈ రంగంలో మహిళలు ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాకుండా, సాధికారతను కూడా సాధించి ఉన్నతంగా ఎదగడం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఈ రెండు చర్చల్లోనూ నిపుణులు స్పష్టం చేశారు. మార్గనిర్దేశాన్ని, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం నుంచి సహాయక విధానాలను అమలు చేయడం వరకు.. మైనింగ్ రంగంలో మహిళలకు సమానావకాశాలను కల్పించడంలో ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.
మైనింగ్ రంగంలో నారీ శక్తి అస్తిత్వం పెరుగుతోందనడానికి వారి విజయాలే నిదర్శనం. భవిష్యత్తు తరాల్లో స్ఫూర్తిని నింపి ముందుకు నడిచేలా అవి ప్రోత్సాహాన్నిస్తాయి. అవకాశాలను కల్పించి, మైనింగ్ రంగంలో మహిళలకు వారి అభ్యున్నతికి, విజయాలకు భరోసానివ్వడంలో ప్రభుత్వ, పరిశ్రమల కృతనిశ్చయాన్ని ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది. సాధికారత, సమ్మిళితత్వం, నాయకత్వాల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా పేర్కొనడం ద్వారా.. మైనింగ్ పరిశ్రమ నిరంతర పురోగతి, విజయాల్లో మహిళల పాత్ర అత్యావశ్యకమని ఈ చర్చలు ప్రభావవంతంగా చాటాయి.
***
(రిలీజ్ ఐడి: 2108958)
సందర్శకుల సూచీ సంఖ్య : : 94