ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
Posted On:
12 FEB 2025 3:22PM by PIB Hyderabad
ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10-12 తేదీల్లో ఫ్రాన్స్‌ను సందర్శించారు. ఈ రెండు రోజుల్లో అక్కడ నిర్వహించిన కృత్రిమ మేధ (ఎఐ) కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు రెండు దేశాలూ సంయుక్తంగా అధ్యక్షత వహించాయి. బ్లెచ్లీ పార్క్ (2023 నవంబర్), సియోల్ (2024 మే) శిఖరాగ్ర సదస్సులు తీర్మానించిన మేరకు సాధించిన కీలక విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఈ సదస్సు చర్చించింది. ఇందులో వివిధ దేశాల-ప్రభుత్వాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతోపాటు చిన్న-పెద్ద వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు సహా కళాకారులు-పౌర సమాజ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగకర సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సత్ఫలితాల సాధనకు అంతర్జాతీయ కృత్రిమ మేధ రంగం సారథ్యం వహించేలా నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి అంకిత భావంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సును విజయవంతంగా నిర్వహించారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. తదుపరి శిఖరాగ్ర సదస్సును భారత్ నిర్వహించనుండటంపై ఫ్రాన్స్ హర్షం వ్యక్తం చేసింది.
ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి కాగా, 2024 జనవరిలో భారత 75వ గణతంత్ర దినోత్సవంలో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఫ్రాన్స్ వెళ్లారు. ప్రస్తుత పర్యటనలో భాగంగా వారిద్దరూ వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అత్యంత బలమైన, బహుముఖ ద్వైపాక్షిక సహకారం సంబంధిత అంశాలన్నిటితోపాటు అంతర్జాతీయ-ప్రాంతీయ ప్రాధాన్యంగల అంశాలపైనా చర్చలు సాగాయి. అనంతరం ప్రధాని మోదీ గౌరవార్థం మాసే నగరంలో మాక్రాన్ ఏర్పాటు చేసిన ప్రైవేటు విందుకు వారిద్దరూ హాజరయ్యారు. ఈ ఇద్దరు నాయకుల మధ్యగల చక్కని స్నేహబంధాన్ని ఈ విందు కార్యక్రమం ప్రతిబింబించింది. ఇందులో భాగంగా వారిద్దరూ మాసే నగరంలో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ కేంద్రాన్ని సందర్శించారు.
భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ భాగస్వామ్యంపై తమ సంయుక్త దృక్పథాన్ని అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మాక్రాన్ 2024 జనవరిలో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా చేసిన సంయుక్త ప్రకటనలో ఈ రెండు అంశాలపై వారు తమ దృక్కోణాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఉభయదేశాల వ్యూహాత్మక భాగస్వామ్య 25వ వార్షికోత్సవంలో భాగంగా 2023 జూలైలో బాస్టిల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని ఫ్రాన్స్‌లో పర్యటించినపుడు ప్రచురించిన హొరైజన్-2047 రోడ్‌మ్యాప్‌లోనూ దీని గురించి వివరించారు. ఈ నేపథ్యంలో నాటినుంచీ ద్వైపాక్షిక సహకారంలో సాధించిన ప్రగతిపై వారు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మూడు మూల సూత్రాలు ప్రాతిపదికగా సహకార విస్తరణ వేగం పెంచడంపై తమ నిబద్ధతను చాటారు.
నిష్పక్షపాత, శాంతియుత అంతర్జాతీయ నిబంధనానుసరణ సహా ప్రపంచవ్యాప్త సవాళ్ల పరిష్కారం, సాంకేతిక-ఆర్థిక రంగాలతోపాటు తాజా పరిణామాల దిశగా ప్రపంచాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఇందుకోసం సంస్కరణలతో కూడిన ప్రభావశీల బహుపాక్షికత అవసరాన్ని స్పష్టం చేస్తూ నాయకులిద్దరూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో సంస్కరణలు తక్షణావసరమని పునరుద్ఘాటించారు. దీంతోపాటు ఇతరత్రా అంశాలపై బహుపాక్షిక వేదికలపై సమన్వయం చేసుకోవాలని వారు అంగీకారానికి వచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం డిమాండుకు దృఢంగా మద్దతిస్తున్నట్లు ఫ్రాన్స్ పునరుద్ఘాటించింది. ప్రపంచవ్యాప్త సామూహిక దురాగతాలపై వీటో అధికార వినియోగం నియంత్రణపై చర్చల బలోపేతానికి కూడా నాయకులిద్దరూ అంగీకరించారు. దీర్ఘకాలిక ప్రపంచ సవాళ్లు సహా తాజా అంతర్జాతీయ పరిణామాలపైనా విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయ, ప్రాంతీయ చర్చలు ముమ్మరం చేసేదిశగా కృషితోపాటు బహుపాక్షిక కార్యకలాపాలు, సంస్థల ద్వారా కూడా ప్రయత్నాలు కొనసాగించాలని నిశ్చయించారు.
శాస్త్ర విజ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడం తక్షణావసరమని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఆయా రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్యగల దీర్ఘకాలిక, శాశ్వత సంబంధాలను వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ రంగ వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ ద్వారా న్యూఢిల్లీలో 2026 మార్చిలో నిర్వహించే వేడుకలు ప్రారంభమైనట్లు నాయకులిద్దరూ ప్రకటించారు.
సార్వభౌమత్వం – భద్రత దిశగా భాగస్వామ్యం
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా దీర్ఘకాలిక రక్షణ సహకారాన్ని అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు 2024లో ఖరారు చేసుకున్న ప్రతిష్ఠాత్మక రక్షణ పారిశ్రామిక భవిష్యత్ ప్రణాళికకు అనుగుణంగా వైమానిక- సముద్ర ఆస్తుల సహకారం కొనసాగింపుపై వారు హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో స్కార్పీన్ జలాంతర్గాముల తయారీ సంబంధిత సహకారం ప్రగతిని… ప్రత్యేకించి ‘డిఆర్‌డిఒ’ తయారు చేసిన ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఎఐపిP)ను పి75-స్కార్పీన్ జలాంతర్గాములలో అనుసంధానించే లక్ష్యంతో చేపట్టిన కృషిని వారు ప్రశంసించారు. అలాగే భవిష్యత్ సంసిద్ధ పి75-ఎఎస్ జలాంతర్గాములలో సమీకృత యుద్ధ వ్యవస్థ (ఐసిఎస్) ఏకీకరణ అవకాశాలపై విశ్లేషణను నాయకులిద్దరూ కొనియాడారు. ఈ నేపథ్యంలో పి75 స్కార్పీన్-క్లాస్ ప్రాజెక్ట్ 6వ, చివరి జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ వాఘ్షీర్’ను 2025 జనవరి 15న జలప్రవేశం చేయించడంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు. క్షిపణులు, హెలికాప్టర్-జెట్ ఇంజిన్లు తదితరాలపై కొనసాగుతున్న చర్చలను ఉభయపక్షాలూ స్వాగతించాయి. సఫ్రాన్ గ్రూప్ సంబంధిత సంస్థలు సహా వాటి భారతీయ సంస్థల నడుమ అద్భుత సహకారంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘పినాకా-ఎంబిఎల్‌ఆర్’ను క్షుణ్నంగా పరిశీలించేందుకు రావాల్సిందిగా ఫ్రాన్స్ సైనిక ఉన్నతాధికారులకు ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం పలికారు. ఫ్రాన్స్ ఈ వ్యవస్థను కొనుగోలు చేయడం భారత్-ఫ్రాన్స్ రక్షణ సంబంధాల్లో మరో కీలక ఘట్టమని ఆయన ప్రముఖంగా వివరించారు. మరోవైపు ‘ఒసిసిఎఆర్’ నిర్వహించే ‘యూరోడ్రోన్ మేల్’ (మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్- MALE) కార్యక్రమంలో భారత్‌కు పరిశీలక హోదా ఇచ్చే నిర్ణయంపై అధ్యక్షుడు మాక్రాన్ హర్షం వెలిబుచ్చారు. రక్షణ పరికరాల కార్యక్రమాల్లో రెండు దేశాల భాగస్వామ్య బలం విస్తరణలో దీన్ని మరో ముందడుగుగా పేర్కొన్నారు.
రెండు దేశాల సంయుక్త సముద్ర విన్యాసాలు, సముద్ర గస్తీ విమానాలతో ఉమ్మడి పహరా సహా అన్ని రంగాల్లో సైనిక విన్యాసాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటాన్ని నాయకులిద్దరూ ప్రశంసించారు. ఈ సందర్భంగా 2025 జనవరిలో ‘ఫ్రెంచ్ యుద్ధనౌక చార్లెస్ డి గాలె’ సహా నావికాదళ ‘క్యారియర్ స్ట్రైక్ గ్రూప్’ ఇటీవల భారత్ సందర్శించడం, అటుపైన లా పెరౌస్‌లో ఫ్రెంచ్ బహుళజాతి విన్యాసం సందర్భంగా భారత నావికాదళం పాలుపంచుకోవడం, 2025 మార్చిలో నిర్వహించబోయే ‘వరుణ’ విన్యాసం తదితరాలను కూడా వారు ప్రస్తావించారు.
హొరైజన్-2047, ఇండియా-ఫ్రాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్‌మ్యాప్ నిర్దేశిత దృక్కోణానికి అనుగుణంగా పారిస్‌లో ‘డిజిఎ’, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఏజెన్సీ సహిత ‘ఫ్రిండ్-ఎక్స్’ (ఫ్రాన్స్-ఇండియా డిఫెన్స్ స్టార్టప్ ఎక్సలెన్స్) ప్రదర్శనను 2024 డిసెంబర్ 5-6 తేదీల్లో ప్రారంభించడంపై వారు హర్షం ప్రకటించారు. రక్షణ రంగ అంకుర సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విద్యాసంస్థలు సహా రెండుదేశాల రక్షణావరణ వ్యవస్థలోని కీలక భాగస్వాములను ఏకం చేస్తూ రక్షణ ఆవిష్కరణ-భాగస్వామ్యంలో కొత్త శకారంభానికి ఈ సంయుక్త సహకార వేదిక దోహదం చేస్తుంది.
రక్షణ రంగంలో పరిశోధన-ఆవిష్కరణ భాగస్వామ్యాల విస్తరణ, ‘డిజిఎ, డిఆర్‌డిఒ’ల మధ్య రక్షణ సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారం దిశగా సాంకేతిక ఒప్పందం ద్వారా పరిశోధన-ఆవిష్కరణ చట్రాన్ని త్వరగా అమలు చేయాల్సిన అవసరాన్ని నాయకులిద్దరూ అంగీకరించారు. దీంతోపాటు పరిశోధన-ఆవిష్కరణ భాగస్వామ్యాలకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాల అన్వేషణ లక్ష్యంగా “ఎల్’ఆఫీస్ నేషనల్ డి’ఎట్యూడ్స్ ఎట్ డి రిచెర్చెస్ ఎయిరోస్పేషియల్స్”, ‘డిఆర్‌డిఒ’ల మధ్య చర్చలపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ‘డిస్ట్రిబ్యూటెడ్ ఇంటిలిజెన్స్’ ఛాలెంజ్ పోటీల్లో ఫ్రాన్, భారత విద్యార్థులు పాలుపంచుకోవడాన్ని భారత్ స్వాగతించింది. ‘ఇన్‌స్టిట్యూట్ పాలిటెక్నిక్ డి పారిస్’ ద్వారా ‘ఇంటర్ డిసిప్లినరీ సెంటర్ ఫర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ’ సంస్థ ఇటీవల ఈ పోటీలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తిని ప్రేరేపించేలా భవిష్యత్తులో మరిన్ని పోటీలను సంయుక్తంగా నిర్వహించడాన్ని ప్రోత్సహిస్తామని తెలిపింది.
మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై నాయకులిద్దరూ విస్తృతంగా చర్చించారు. ఈ నేపథ్యంలో పరస్పర సమన్వయం, క్రమం తప్పకుండా చర్చలు కొనసాగించడంపై కృషి చేయాలని వారు అంగీకారానికి వచ్చారు.
న్యూఢిల్లీలో 2023 సెప్టెంబరు నాటి జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్’ (ఐఎంఇసి)కు శ్రీకారం చుట్టడాన్ని వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లడంపై మరింత సమన్వయంతో కృషి చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ ప్రాంతాలలో అనుసంధానం, సుస్థిర వృద్ధి సాధన, పరిశుభ్ర ఇంధన లభ్యత తదితరాలను ప్రోత్సహించడంలో ‘ఐఎంఇసి’కిగల ప్రాధాన్యాన్ని వారు అంగీకరించారు. దీనికి సంబంధించి మధ్యధరా సముద్రం పరిధిలోగల మాసే నగరం వ్యూహాత్మక స్థానమని వారు గుర్తించారు.
న్యూఢిల్లీలో భారత్-ఇయు శిఖరాగ్ర సదస్సును త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో ఇయు-భారత్ సంబంధాల బలోపేతం ప్రాధాన్యాన్ని వారిద్దరూ అంగీకరించారు.
ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో త్రైపాక్షిక సహకారాన్ని వారు ప్రశంసించారు. అలాగే ఫ్రాన్స్, భారత్, ‘యుఎఇ’ల మధ్య ఇటీవలి ఉమ్మడి సైనిక విన్యాసాలతోపాటు భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా పరస్పర బహుపాక్షిక సైనిక విన్యాసాలలో పాల్గొనడాన్ని వారు కొనియాడారు. భారత్, ‘యుఎఇ’ల ఆహ్వానం మేరకు ‘మాన్‌గ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్’ కూటమిలో ఫ్రాన్స్ సభ్యత్వం స్వీకరించింది. ఇక ఆర్థిక, ఆవిష్కరణ, ఆరోగ్య, పునరుత్పాదక ఇంధన, విద్య, సాంస్కృతిక, సముద్ర రంగాల్లో త్రైపాక్షిక సహకారం సంబంధిత నిర్దిష్ట ప్రాజెక్టుల గుర్తింపులో ‘యుఎఇ’, ఆస్ట్రేలియా అధికారులతో కలిసి పనిచేయాల్సిందిగా వారిద్దరూ తమతమ దేశాల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే నిరుడు నిర్వహించిన రెండు ఆన్‌లైన్ త్రైపాక్షిక చర్చా కార్యక్రమాల్లో ప్రధానంగా దృష్టి సారించిన అంశాలకు అనుగుణంగా ‘ఐపిఒఐ’, ‘ఐఒఆర్‌ఎ’ పరిధిలోనూ సంయుక్త కృషి అవసరమని స్పష్టం చేశారు.
స్వేచ్ఛాయుత, సార్వత్రిక, సార్వజనీన, సురక్షిత, శాంతియుత ఇండో-పసిఫిక్ ప్రాంతంపై తమ సంయుక్త కట్టుబాటును నాయకులిద్దరూ ప్రస్ఫుటం చేశారు.
అంతరిక్ష రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణపై తమ ఆకాంక్షను వారు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యం దిశగా ముందడుగులో అంతరిక్ష రంగంపై భారత్-ఫ్రాన్స్ తొలిసారి రెండు విడతలుగా సాగిన చర్చలు గణనీయం దోహదం చేశాయని వారు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా 2025లో మూడో విడత చర్చల నిర్వహణకు వారు అంగీకరించారు. ఈ సందర్భంగా ‘సిఎన్‌ఇఎస్’, ‘ఐఎస్‌ఆర్‌ఒ’ (ఇస్రో)ల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని వారిద్దరూ ప్రశంసించారు. రెండు దేశాల అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకారం, సమన్వయం మరింత విస్తృతం కావడంలో తమవంతు తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు.
సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఇద్దరు నేతలు నిర్ద్వంద్వంగా ఖండించారు. ఉగ్రవాదులకు ఆర్థిక మద్దతు, ఆశ్రయం కల్పించే వ్యవస్థలను విచ్చిన్నం చేయాలని వారు కోరారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నవారికి, ప్రణాళిక వేసేవారికి, మద్దతు ఇవ్వడం లేదా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారికి ఏ దేశమూ ఆశ్రయం ఇవ్వకూడదని వారు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ జాబితా చేసిన గ్రూపులతో సంబంధం ఉన్న వారి హోదాలతో సహా ఉగ్రవాదులందరిపై సమిష్టి చర్యలు తీసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులకు అనుగుణంగా మనీలాండరింగ్ నిరోధం, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని అడ్డుకునే అంతర్జాతీయ ప్రమాణాలను పాటించవలసిన అవసరాన్ని ఇరు పక్షాలు స్పష్టం చేశాయి. ఎఫ్ఏటీఎఫ్, నో మనీ ఫర్ టెర్రర్ (ఎన్ఎంఎఫ్టీ), ఇతర బహుళపక్ష వేదికల్లో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని రెండు దేశాలు పునరుద్ఘాటించాయి.
భారత్ కు చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్ జీ), గ్రూప్ డి ఇంటర్ వెన్షన్ డి లా జెండర్ మెరీ నేషనల్ (జీఐజీఎన్ ) మధ్య ఉగ్రవాద నిర్మూలనలో కొనసాగుతున్న ఏజెన్సీ స్థాయి సహకారాన్ని వారు ప్రశంసించారు. పెరుగుతున్న భారత్ - ఫ్రాన్స్ ఉగ్రవాద నిరోధక, ఇంటెలిజెన్స్ సహకారాన్ని ప్రతిబింబించిన 2024 ఏప్రిల్ నాటి ఉగ్రవాద వ్యతిరేక చర్చల ఫలితాలను ఇరువురు నాయకులు స్వాగతించారు. న్యూఢిల్లీలో మిలిపోల్ 2025 ను విజయవంతంగా నిర్వహించాలన్న ఆసక్తిని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు.
విమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచేందుకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటుపై పురోగతిలో ఉన్న చర్చలను ఇద్దరు నాయకులు స్వాగతించారు.
సురక్షిత, బహిరంగ, భద్రతా ప్రమాణాలు కలిగిన, విశ్వసనీయమైన కృత్రిమ మేధ అభివృద్ధిపై దృష్టి సారించే విధానాలలో సైద్ధాంతిక సారూప్యాన్ని ప్రతిబింబించేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై భారత్ - ఫ్రాన్స్ రోడ్ మ్యాప్ ను ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ ప్రారంభించారు.
ఫ్రెంచ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ స్టేషన్ ఎఫ్ లో భారతీయ స్టార్టప్ లను చేర్చడాన్ని వారు స్వాగతించారు. ఫ్రాన్స్ లో భారతదేశ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) ను ఉపయోగించడానికి విస్తరించిన అవకాశాలను కూడా వారు స్వాగతించారు. సైబర్ స్పేస్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, అంతర్జాతీయ చట్టాల అమలు, సైబర్ స్పేస్ లో ప్రభుత్వ బాధ్యతాయుతమైన పనితీరు కోసం యంత్రాంగం అమలుకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో రెండు దేశాల సమన్వయాన్ని బలోపేతం చేయాలనే ఆకాంక్షను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు, అలాగే హానికరమైన సైబర్ సాధనాలు, విధానాల వ్యాప్తి నుండి ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. 2025లో జరిగే భారత్-ఫ్రాన్స్ స్ట్రాటజిక్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ డిప్లమసీ చర్చల పై ఆసక్తిని వ్యక్తం చేశారు.
భూగోళ పరిరక్షణ కోసం భాగస్వామ్యం
ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు మార్పు చెందడానికి ఇంధన మిశ్రమంలో అణు శక్తి ఒక ముఖ్యమైన భాగం అని ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ స్పష్టం చేశారు. ముఖ్యంగా జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుకు సంబంధించి భారత్-ఫ్రాన్స్ పౌర అణు సంబంధాలు, అణుశక్తి శాంతియుత వినియోగంపై సహకారం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఇరువురు నేతలు గుర్తించారు.
పౌర అణు ఇంధనంపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎమ్ఆర్), అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్ (ఎఎమ్ఆర్) పై లెటర్ ఆఫ్ ఇంటెంట్, అణు నిపుణుల శిక్షణ, విద్యలో సహకారం కోసం భారతదేశ జిసిఎన్ఇపి, డిఎఇ , ఫ్రాన్స్ ఐఎన్ఎస్టిఎన్, సిఇఎ మధ్య అమలు ఒప్పందంపై సంతకం చేయడాన్ని వారు స్వాగతించారు.
వాతావరణ మార్పులు, సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడం సహా పర్యావరణ సంక్షోభాలు, సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి తమ దేశాల నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య పర్యావరణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పునరుద్ధరించడాన్ని నాయకులు స్వాగతించారు. పేదరిక నిర్మూలన, భూగోళ పరిరక్షణ రెండింటినీ పరిష్కరించడంలో బలహీన దేశాలకు మద్దతు ఇచ్చే దిశగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికి ‘పారిస్ పాక్ట్ ఫర్ పీపుల్ అండ్ ది ప్లానెట్‘ నిర్దేశించిన సూత్రాలకు తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. సముద్రాల పరిరక్షణ, సుస్థిర వినియోగం దిశగా అంతర్జాతీయ ప్రయత్నాల్లో ఐక్యరాజ్యసమితి మహాసముద్రాల సదస్సు (యూఎన్ ఓసీ-3) ప్రాముఖ్యతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. 2025 జూన్ లో నీస్ లో జరగబోయే యుఎన్ ఒసి-3 నేపథ్యంలో, సమ్మిళిత, సమగ్ర అంతర్జాతీయ సముద్ర వ్యవహారాల నిర్వహణ మూలసూత్రాలలో ఒకటిగా సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగంపై ఒప్పందం ప్రాముఖ్యతను రెండు దేశాలు గుర్తించాయి. ఇప్పటికే ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వారు వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని కోరారు. 2025 జూన్ లో యూఎన్ ఓసీ-3 కోసం ఫ్రాన్స్ కు భారత్ మద్దతు ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని తృతీయ దేశాల నుండి వాతావరణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి)పై కేంద్రీకృతమైన ప్రాజెక్టులను మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన భారత్-ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ త్రిముఖ అభివృద్ధి సహకారం ప్రారంభాన్ని వారు ప్రశంసించారు. ఆర్థిక సమ్మిళితం, మహిళా సాధికారత రంగాల్లో 13 మిలియన్ యూరోల ఈక్విటీ ఒప్పందం కోసం ప్రోపార్కో, సంబంధిత భారతీయ మైక్రోఫైనాన్స్ సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. విపత్తు లను ఎదుర్కొనే సుస్థిర మౌలిక సదుపాయాల కూటమి, అంతర్జాతీయ సౌర కూటమికి చెందిన ఫ్రాంకో ఇండియన్ ప్రెసిడెన్సీ పరిధిలో బలమైన, ఫలవంతమైన సహకారాన్ని వారు ప్రశంసించారు.
2024లో రికార్డు స్థాయిలో జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గుర్తిస్తూ, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని వారు అంగీకరించారు. ఫ్రాన్స్ లో, భారత్ లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు బలమైన విశ్వాసాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు అంగీకరించారు. .
పట్టణాభివృద్ధి రంగంలో 2024లో ప్రకటించిన అనేక ఆర్థిక సహకార ప్రాజెక్టులను వారు ప్రశంసించారు. 2024 మేలో వెర్సైల్స్ లో జరిగిన 7వ ఫ్రాన్స్ శిఖరాగ్ర సదస్సుకు గౌరవ అతిథిగా భారత్ పాల్గొన్న విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. 2024 నవంబర్, 2025 ఫిబ్రవరిలో ద్వైపాక్షిక సిఇఒల ఫోరమ్ నిర్వహణపై ఇద్దరు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
గత జనవరిలో పారిస్ లో భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మొదటి మిషన్ తో, రెండు ఆరోగ్య మంత్రిత్వ శాఖల మధ్య సహకారం దిశగా ప్రారంభించిన అపూర్వమైన వేగం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్యం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, హెల్త్ ప్రొఫెషనల్స్ ఎక్స్ఛేంజ్ వంటి వాటిని 2025లో ద్వైపాక్షిక సహకారానికి ముఖ్య ప్రాధాన్యతలుగా గుర్తించారు. పరిసాంటే క్యాంపస్, సి-క్యాంప్ (సెంటర్ ఫర్ మాలిక్యులర్ ప్లాట్ ఫామ్స్) మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంతకం, ఇండో-ఫ్రెంచ్ జీవ శాస్త్రాల అనుబంధ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటును ఇరువురు నేతలు స్వాగతించారు.
ప్రజల కోసం భాగస్వామ్యం
2023 జూలైలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా సంతకం చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉద్దేశాన్ని వారు గుర్తు చేసుకున్నారు. 2024 డిసెంబర్లో ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం, ఫ్రాన్స్ మ్యూజియంస్ డెవెలెప్మెంట్ మధ్య ఒప్పందం కుదిరినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో మరింత సహకారానికి, భారతీయ నిపుణుల శిక్షణ సహా విస్తృత మ్యూజియం భాగస్వామ్యానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధిలో తన భాగస్వామ్యంపై సంప్రదింపులు కొనసాగించడానికి ఫ్రాన్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
భారత్ - ఫ్రాన్స్ మధ్య 1966లో మొదటి సాంస్కృతిక ఒప్పందం కుదిరిన 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఇన్నొవేషన్ సంవత్సరంగా ప్రకటించిన 2026 సందర్భంలో, సంస్కృతిని కూడా భాగస్వామ్యం చేసే బహుళ రంగాల కార్యక్రమంగా వివిధ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలను చేపట్టాలని రెండు దేశాలు అంగీకరించాయి.
పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ 2024 ను విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు మాక్రాన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.అభినందించారు. 2036 లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ, భద్రతకు సంబంధించి ఫ్రాన్స్ అనుభవం, నైపుణ్యాన్ని పంచుకోవడానికి అధ్యక్షుడు మాక్రాన్ సుముఖత వ్యక్తం చేసినందుకు మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
మెడిటరేనియన్ అంశాలపై కేంద్రీకృతమైన రైసినా డైలాగ్ ప్రాంతీయ ఎడిషన్ ను 2025లో మార్సెయిలో ప్రారంభించనుండడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక నేతలు, వాణిజ్యం, కనెక్టివిటీ అంశాల నిపుణులు, అలాగే ఇతర సంబంధిత పక్షాల మధ్య ఉన్నత స్థాయి చర్చలకు వేదికగా ఉండనుంది. దీని లక్ష్యం మధ్యధరా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని, కనెక్టివిటీని మెరుగుపరచడం.
భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ లో తాము ఎంచుకున్న కోర్సుల్లో ప్రవేశించడానికి ముందు ఒక విద్యా సంవత్సరం పాటు ఫ్రాన్స్ లోని అత్యంత ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో వారికి ఫ్రెంచ్ ను విదేశీ భాషగా బోధించే అంతర్జాతీయ తరగతుల పథకాన్ని సెప్టెంబర్ 2024 లో విజయవంతంగా ప్రారంభించడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఈ కార్యక్రమం భారత విద్యార్థుల ఫ్రాన్స్‌కు వెళ్లే అవకాశాలను పెంచేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించడంతో పాటు, 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఫ్రాన్స్‌లో చేర్పించాలనే లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంలో, 2025 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్య చారిత్రకంగా తొలిసారి 10,000కు చేరుకుంటుందన్న అంచనా పట్ల ఇద్దరు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
భారత్-ఫ్రాన్స్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (ఎంఎంపీఏ) కింద యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (వైపీఎస్) అమలును ఇరువురు నేతలు స్వాగతించారు, ఇది యువత, వృత్తి నిపుణుల ద్విముఖ కదలికను సులభతరం చేస్తుంది, ఇది రెండు దేశాల ప్రజల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాక, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయవలసిన అవసరాన్ని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఇది రెండు దేశాలకు ఈ రంగంలో సహకారాన్ని పటిష్టం చేయడానికి అవకాశాలను అందిస్తుంది.
తమ విలక్షణ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి, ద్వైపాక్షిక హారిజోన్ 2047 మార్గదర్శక ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి దీర్ఘకాలిక సహకారాన్ని నిరంతరం బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాలు తమ నిబద్ధతను ప్రకటించాయి.
***
(Release ID: 2102540)
Visitor Counter : 6