భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవానికి ముందురోజు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ


లోక్ సభ ఎన్నికలను పెద్ద ఎత్తున నిర్వహించి సఫలమయ్యాక వస్తున్న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవమిది

దేశ ప్రజల సేవలో 75 సంవత్సరాల ఘట్టాన్ని ఘనంగా నిర్వహించుకొంటున్న ఎన్నికల సంఘం

ఎన్నికల నిర్వహణలో శ్రేష్ఠత్వానికిగాను అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి

Posted On: 22 JAN 2025 5:44PM by PIB Hyderabad

పదిహేనో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (ఎన్‌వీడీ) జనవరి 25న దేశమంతటా నిర్వహించనున్నారు. 2024లో లోక్ సభ ఎన్నికలను చరిత్రాత్మకంగా, విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ వేడుకలు చోటుచేసుకోబోతున్నాయి. ఆ లోక్ సభ ఎన్నికలు ప్రపంచంలో అతి విశాల ప్రజాస్వామిక ప్రక్రియకు నిదర్శనంగా నిలిచాయి.  ఎన్నికల సంఘం (ఈసీ) కూడా దేశ ప్రజలకు తాను అంకిత భావంతో అందిస్తున్న సేవలకు 75 సంవత్సరాలైన ఘట్టాన్ని ఓ ఉత్సవంలా నిర్వహించుకోనుంది.

భారత్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకొంటున్న తరుణంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పెద్ద పేరు రానుంది. ఓటర్ల డేటాబేస్ ఇప్పుడు 99.1 కోట్ల స్థాయిని అందుకొంది. పౌరుల్లో ఓటు వేయడానికి అర్హత పొందిన వారి పేర్లను నమోదు చేసుకొంటున్న ప్రక్రియ కొనసాగుతోంది. రోజూ అనేక మంది తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు మొదలు 29 ఏళ్ల వయసులో ఉన్న యువ ఓటర్ల సంఖ్య 21.7 కోట్లు. ఇది మన దేశ ఓటర్ల జాబితా గొప్పతనాన్ని చాటిచెబుతోంది. 2024లో ఓటర్ల జెండర్ రేషియో 948గా ఉండగా 2025లో ఇప్పటికి ఆరు పాయింట్లు పెరిగి 954కు చేరుకొంది.  

న్యూ ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర న్యాయ, చట్ట శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇతర ప్రముఖులలో ఎన్నికల ప్రధానాధికారి, ఎలక్షన్ కమిషనర్లు కూడా ఉన్నారు.

ఈ కార్యక్రమానికి ఎన్నికల నిర్వహణ సంస్థల అధిపతులు, ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. వారు ప్రపంచంలో ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న ప్రధాన సమస్యలపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 23, 24లలో జరగనున్న 2 రోజుల సమావేశంలో చర్చిస్తారు.

‘‘ఓటింగుకు సాటివచ్చేది మరేదీ లేదు, నేను తప్పక ఓటు వేస్తాను’’ అనేది ఈ సంవత్సరం ప్రధాన ఇతివృత్తంగా ఉంది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి అందరూ ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని, ఓటర్లు వారికున్న వోటు హక్కును వినియోగించుకోవడాన్ని గర్వంగా భావించాలని వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో కిందటి సంవత్సరానికి ఎంపిక చేసిన ఇదే ఇతివృత్తాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నారు.

ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి శ్రమించి, ఇతరులకు కూడా మార్గదర్శనం చేసే తరహా పనితీరును కనబర్చిన రాష్ట్ర స్థాయి అధికారులకు, జిల్లా స్థాయిల అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డులను గౌరవనీయ రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఎన్నికల్లో వోటు వేసేటట్లు చూడడం, కిందటి సంవత్సరానికి ఎంపిక చేసిన ఇదే ఇతివృత్తాన్ని ఓటర్లలో చైతన్యాన్ని పెంచడం ప్రధానంగా వినూత్న పద్ధతుల్లో ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించడం, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా చూడడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటి వాటిపైనా, అలాగే ఎన్నికల ప్రక్రియను అందరి అందుబాటులోకి తీసుకుపోయేందుకు చేపట్టిన చర్యలపైన  ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనున్నారు.  

‘‘ఇండియా ఓట్స్ 2024: ఎ సాగ ఆఫ్ డెమోక్రసి’’ పేరుతో తీసుకువచ్చిన ఈసీఐ కాఫీ టేబుల్ బుక్ మొదటి కాపీని ఎన్నికల ప్రధానాధికారి శ్రీ రాజీవ్ కుమార్‌ రాష్ట్రపతికి బహూకరించనున్నారు. ఈ పుస్తకాన్ని 18వ లోక్ సభ ఎన్నికలు విజయవంతం కావడానికి తోడ్పడ్డ ప్రతి ఒక్క ఓటరుకు, ప్రతి ఒక్క ఎన్నికల అధికారికి, భద్రత సిబ్బందికి, ఆసక్తిదారులందరికి ప్రశంసలు తెలియజేస్తూ ప్రచురించారు. ఈ పుస్తకం ఆకట్టుకొనే ఛాయాచిత్రాలు, చదవడం మొదలుపెడితే ఆపకుండా పూర్తి చేయాలనిపించే కథనాలతో 2024లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యం చేసిన ప్రయాణాన్ని గురించి పాఠకులకు వివరిస్తుంది.

‘‘ఇండియా డిసైడ్స్’’ పేరుతో వార్నర్ బ్రాస్ డిస్కవరీ నిర్మించిన డాక్యు-డ్రామా సిరీస్‌లో నుంచి ఒక చిన్న భాగాన్ని కూడా ఇదే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. మూడు భాగాలతో కూడిన ఈ సిరీస్ ప్రపంచంలో అతి భారీ స్థాయి ఎన్నికల చరిత్ర, ఆ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను విడమరచి చెబుతుంది. ఈ డాక్యు-డ్రామా సిరీస్‌ను డిస్కవరి చానల్‌లోనూ, దాని ఓటీటీ ప్లాట్‌ఫారాల్లోనూ ప్రదర్శిస్తారు.

‘‘బిలీఫ్ ఇన్ ది బ్యాలట్: హ్యూమన్ స్టోరీస్ షేపింగ్ ఇండియాస్ 2024 ఎలక్షన్స్’’ పేరుతో ఈసీఐ తీసుకువచ్చిన ఒక పుస్తకాన్ని కూడా రాష్ట్రపతికి ఎన్నికల సంఘం బహూకరించనుంది. ఎన్నికల విశిష్టతను చాటిచెప్పే మానవాసక్తికర కథలతో ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు.

గత సంవత్సరం నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ముఖ్య అంశాలను వివరించే ఒక మల్టిమీడియా ఎగ్జిబిషనును కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన వారు స్వయంగా పాలుపంచుకొని, అనేక విషయాల్ని తెలుసుకోవడానికి అవకాశాన్నిచ్చే స్టాల్స్‌ను సైతం ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నారు.  

ఈసీఐని 1950 జనవరి 25న ఏర్పాటు చేశారు. సరిగ్గా అంతకు ఒక రోజు తర్వాత, భారత్ గణతంత్రంగా ఆవిర్భవించింది. కాగా  ఈసీఐ ఏర్పాటు దినాన్ని స్మరించుకొంటూ, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని- 2011 నుంచి- ప్రతి సంవత్సరం జనవరి 25న నిర్వహిస్తూ వస్తున్నారు. ఓటరును కేంద్ర స్థానంలో నిలుపుతూ ఓటరుకున్న ప్రాధాన్యాన్ని వివరించడం, ఎన్నికల పట్ల పౌరులలో చైతన్యాన్ని పెంచడంతోపాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు చురుకుగా పాల్గొనేటట్లు వారిలో స్ఫూర్తిని నింపడం కూడా  ఈ కార్యక్రమం ప్రధానోద్దేశాలుగా ఉన్నాయి. దేశ ఓటర్లందరికీ అంకితం చేసిన జాతీయ ఓటర్ల దినోత్సవం, కొత్త ఓటర్ల నమోదును ముఖ్యంగా ఇటీవలే అర్హతను పొందిన యువజనులను ఓటర్ల జాబితాకెక్కించడాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. దేశమంతటా, కొత్త ఓటర్లను గౌరవించడంతోపాటు వారికి ఎన్‌వీడీ కార్యక్రమాల నిర్వహణ కాలంలో ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీ)ని ప్రదానం చేయనున్నారు.

జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలతోపాటు పోలింగ్ కేంద్రం స్థాయిలో కూడా నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం దేశంలో అత్యంత విశాల స్థాయిలో నిర్వహించే ముఖ్య ఉత్సవాల్లో ఒకటిగా పేరుతెచ్చుకొంది.

 

***


(Release ID: 2095473) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Marathi , Hindi