ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్: విజయప్రస్థానంలో మరో మెట్టును చేరుకొన్న వయ్ వందన కార్డులు దేశంలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో నవోదయం

Posted On: 18 NOV 2024 10:14AM by PIB Hyderabad

ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం.. ఈ రెండిటినీ కూడా ఈ సంవత్సరంలో అక్టోబరు 29నే జరుపుకోవాల్సివచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుమారు రూ.12,850 కోట్ల విలువైన ఆరోగ్య సంరక్షణ సంబంధిత పథకాలను న్యూ ఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ఈ ఏడాది అక్టోబరు 29న ప్రారంభించారు. 70 ఏళ్ల వయసు, అంతకు మించిన వయసు కలిగిన పౌరులందరూ ఆసుపత్రులలో చికిత్సను ఉచితంగా పొందవచ్చని  ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది ఆరోగ్యసంరక్షణ లో ఒక పెనుమార్పును తీసుకువచ్చే నిర్ణయం. ఈ వయసున్న వృద్ధులకు ఆయుష్మాన్ వయ్ వందన కార్డులను ఇవ్వనున్నారు. దీంతో, వారికి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎమ్-జేఏవై) పథకంలో భాగంగా ఆరోగ్యసంరక్షణపరంగా విస్తృత లాభాలను అందుకొనే అవకాశం అందిరానుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది చేరారు; 10 లక్షలకు పైగా సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ వయ్ వందన కార్డులను తీసుకోవడానికి వారి పేర్లను నమోదు చేయించుకొన్నారు. అంటే ఈ పథకంలో భాగంగా అందించే ఉచిత చికిత్సను, ఇతరత్రా సాయాన్ని అందుకోవడానికి వారు సిద్ధమయ్యారన్నమాటే.

నేపథ్యం

వయ్ వందన కార్డు కు ఆయుష్మాన్ భారత్ పీఎమ్ జేఏవై కార్యక్రమంలో ఒక ముఖ్య పాత్ర ఉంది. ఇది ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనకు ఊతాన్ని అందించే కార్యక్రమం. ‘‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎమ్-జేఏవై)’’ని 2018 సెప్టెంబరు 23న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.  ఈ పథకం అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలని భారత్  తీసుకున్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నది.  ఈ పథకం జనాభాలో అత్యంత బలహీన వర్గాల వారికి చెప్పుకోదగిన మేరకు ఆరోగ్య సేవలను అందించడానికి ఉద్దేశించింది.  ఇది మరింత విస్తృత పరిధిని కలిగి ఉన్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో ఒక భాగం.  అంతేకాకుండా, ఆరోగ్య సంరక్షణ రంగంలో దేశం అనుసరిస్తూ వచ్చిన విధానానికి ఇది సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.  ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్దదైన ఆరోగ్య హామీ పథకం అనే ఖ్యాతి పీఎమ్-జేఏవైకి దక్కింది.  మన దేశ జనాభాలో కింది స్థాయిలో ఉన్న 40 శాతం మంది ప్రజలలో సుమారు 55 కోట్ల మందికి ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు రెండో అంచె, మూడో అంచె ఆసుపత్రులలో చేరితే అయ్యే ఖర్చులకు సంబంధించిన ప్రయోజనాలను ఈ పథకం అందిస్తున్నది.   ఈ పథకంలో కుటుంబాలను సోషియో-ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 (ఎస్ఈసీసీ 2011)లో పేర్కొన్న వృత్తుల ప్రమాణాల, సమాజంలో నిరాదరణకు పాలైన వర్గాల ఆధారంగా నమోదు చేసుకొన్నారు.

పీఎమ్ జేఏవై లో అందే వివిధ రకాల సేవలలో:

·          వైద్య పరీక్షలు, చికిత్స, సంప్రదింపులు

·          ఆసుపత్రిలో చేరే కన్నా ముందు అయ్యే ఖర్చులు

·          మందులు, వైద్యంపరంగా రోగి సేవించవలసిన పదార్థాలు

·         ఇంటెన్సివ్ కేర్ సర్వీసులు, నాన్- ఇంటెన్సివ్ కేర్ సర్వీసులు

·         రోగ నిర్ధారణ పరీక్షలు, ప్రయోగశాల నివేదికలు

·         అవయవ మార్పిడి సేవలు

·          వసతి, ఆహార సేవలు

·         చికిత్స పరంగా ఎదురయ్యే సమస్యలు

·         ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మొదటి 15 రోజులలో సంరక్షణ.. వంటివి భాగంగా ఉంటాయి.

 

ఇంతకు ముందు అమలైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్‌బీవై) లో కుటుంబంలో ఐదుగురు సభ్యులకు ప్రయోజనాలు పరిమితమైతే దానికి భిన్నంగా, పీఎమ్-జేఏవైలో కుటుంబ సభ్యుల విషయంలో గానీ, లేదా వయస్సు పరంగా గానీ ఎలాంటి పరిమితిని విధించ లేదు.  అంతే కాదు, దీనిలో లబ్ధిదారుకు ముందే ఉన్న వ్యాధుల విషయంలో రక్షణ అనేది ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే లభిస్తున్నది. దీనితో రోగులు ఈ పథకంలో చేరిన వెనువెంటనే, చికిత్సను చేయించుకొనేందుకు వీలు ఉంటుంది.


పీఎమ్-జేఏవై పురోగతి (ఈ నెల 17వ తేదీ వరకు సేకరించిన సమాచారం)

·         పీఎమ్-జేఏవై ని ప్రారంభించినప్పటి నుంచీ ఈ పథకం అమలులో పురోగతి ఈ కింది విధంగా ఉంది:

·               తయారు చేసిన ఆయుష్మాన్ కార్డులు: మొత్తం 35,45,10,568

·         అధికారికంగా ఆసుపత్రులలో చేరినవారు: మొత్తం 6,50,59,465 మంది ఆసుపత్రులలో చేరి సేవలను పొందినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి; గత 30 రోజులలో చేరికల సంఖ్య 17,36,903; నిన్న ఒక్కరోజులోనే 28,540 మంది ఆసుపత్రులలో చేరి సేవలను అందుకొన్నారు.

·          ఈ పథకం పరిధిలోకి వచ్చే ఆసుపత్రుల సమాచారం: ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 30,745 ఆసుపత్రుల సేవలు అందుబాటులో ఉన్నాయి; వీటిలో 17,084 ప్రభుత్వ సంస్థలు, 13,661 ప్రైవేటు సంస్థలున్నాయి.

·         ఆసుపత్రులలో చేరికలతో ఆర్థికంగా పడిన భారం: మొత్తం మీద ఈ పథకంలో ఆసుపత్రులలో చేరిన రోగులకు అందించిన చికిత్సల ఖర్చు చూస్తే రూ. 81,979.07 కోట్లు అయింది.  దీనితో రూ. 2,314.77 కోట్ల భారం పడింది.  ఒక్క నిన్నటి రోజునే రూ, 47.25 కోట్ల భారం పడింది.

ఈ సంఖ్యలను బట్టి చూస్తే ప్రధానంగా తెలిసేది ఏమిటంటే, తక్కువ ఖర్చులలో ఆరోగ్య సంరక్షణ సంబంధిత ప్రయోజనాలు మన దేశంలోని లక్షల కొద్దీ ప్రజలకు పీఎమ్-జేఏవై లో భాగంగా అందుబాటులోకి వస్తున్నాయనేదే.

వయ్ వందన కార్డు: వృద్ధుల సంరక్షణ తీరుతెన్నులలో పెనుమార్పు

పీఎమ్-జేఏవై పరిధిని గణనీయంగా విస్తరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఈ ఏడాది సెప్టెంబరు 11న ఆమోదం తెలిపింది.  70 ఏళ్ళ వయసు, అంతకు మించిన వయసున్న సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా రక్షణలో పెద్ద మార్పునకు ఈ ఆమోదం వాగ్దానం చేస్తోంది. ఈ చర్య 4.5 కోట్ల కుటుంబాలలో  దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలను అందించడానికి ఉద్దేశించింది.  ఈ విస్తరణలో భాగంగా, 70 ఏళ్ళు, అంతకు మించిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లు అందరికీ ఏబీ పీఎమ్-జేఏవై ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకు రావడానికి ఒక కొత్త ప్రత్యేక కార్డును ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  ఈ వాగ్దానాన్ని ‘‘వయ్ వందన కార్డు’’ను ప్రారంభించి, అతి త్వరగా నెరవేర్చారు.  ఈ వయ్ వందన కార్డు అర్హులైన సీనియర్ సిటిజన్ లకు ఆసుపత్రిలో ఉచితంగా ఆరోగ్య చికిత్స సదుపాయాన్ని కలగజేయనున్నది.  ఈ కార్డు సార్వజనికమైంది.  దీని విషయంలో పేదవారికైనా, మధ్యతరగతికి చెందిన వారికైనా లేదా ఉన్నత తరగతికి చెందినవారికైనా ఎలాంటి ఆదాయ పరిమితీ లేదు.  కుటుంబంలోని వయోవృద్ధులకు వారి జేబులో నుంచి పెట్టుకొనే ఖర్చులను చాలా వరకు తగ్గించాలనే లక్ష్యాన్ని ఈ వయ్ వందన కార్డు నెరవేర్చనుంది.

పురోగతి

ఒక మహత్తర విషయం ఏమిటి అంటే, 70 ఏళ్లు, అంతకు పైబడిన వయస్సు కలిగిన వరిష్ఠ పౌరులు 10 లక్షల మందికి పైగా కొత్తగా ప్రారంభించిన ఆయుష్మాన్ వయ్ వందన కార్డు పథకంలో వారి పేర్లను నమోదు చేసుకొన్నారు. దీంతో వారు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎమ్-జేఏవై) పథకంలో భాగంగా ఉచితంగా అందే ఆరోగ్యసంరక్షణ ప్రయోజనాలను అందుకోవడానికి అవకాశం లభిస్తుంది. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో అక్టోబరు 29న ఈ కార్డును అమలులోకి తీసుకురావడాన్ని ప్రారంభించిన మూడు వారాల లోపే ఈ పని పూర్తి అయింది. దాదాపు 4 లక్షల మంది మహిళలు వారి పేర్లను ఆయుష్మాన్ వయ్ వందన కార్డు పథకంలో నమోదు చేయించుకొన్నారు. ఆయుష్మాన్ వయ్ వందన కార్డు ను ప్రారంభించినప్పటి నుంచి, రూ.9 కోట్లకు పైగా విలువ కలిగిన చికిత్సలకు అధికారిక ఆమోదాన్ని ఇవ్వగా,  70 ఏళ్లు, అంతకు పైబడిన వయస్సు కలిగిన వరిష్ఠ పౌరులు 4,800 మందికి పైగా ఈ పథకం ప్రయోజనాలను పొందారు. వీరిలో 1,400 మందికి పైగా మహిళలున్నారు.  ఈ చికిత్సలలో కరోనరి ఏంజియోప్లాస్టీ, విరిగిన తొడ ఎముకలు/ప్రత్యామ్నాయాన్ని అమర్చడం, పిత్తాశయాన్ని తొలగించడం, శుక్లాలకు శస్త్రచికిత్స చేయడం, ప్రొస్టేట్ రీసెక్షన్, స్ట్రోక్ తదితరాలు భాగంగా ఉన్నాయి.

వయ్ వందన కార్డు కు దరఖాస్తు పెట్టుకోవడానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు:   click here

సారాంశం

భారతదేశం ప్రగతి పథంలో మునుముందుకు సాగిపోతున్న క్రమంలో, ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంతో పాటు పెద్ద వయసు  వారికి సాయాన్ని అందించి వారు ఆత్మగౌరవంతో జీవించేటట్టు చూడాలన్న విషయంలో ప్రభుత్వం చాటుకొంటున్న అంకితభావాన్ని ఆయుష్మాన్ వయ్ వందన కార్డ్ వంటి కార్యక్రమాలు దృఢపరుస్తున్నాయి.  పౌరులకు సమగ్ర ఆరోగ్య సంరక్షక సేవలు  తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం వహిస్తున్న శ్రద్ధ దేశ ఆరోగ్య రంగంలో ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచడంలోనూ, ప్రపంచమంతటా సార్వజనిక ఆరోగ్య సంరక్షణకు ఒక నమూనాను ఇవ్వాలన్న అంశంలోనూ పీఎమ్-జేఏవై పాత్రను కీలకంగా మార్చేసింది.

 

***


(Release ID: 2074461) Visitor Counter : 22