సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ) ఏర్పాటుతో వీడియో గేమింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దఎత్తున ప్రోత్సాహం: ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐడీజీసీ)లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మూడు ప్రముఖ వీడియో గేమింగ్ డెవలపర్ కాన్ఫరెన్సులలో ఒకటైన ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 16వ ఎడిషన్ హైదరాబాద్లో ప్రారంభం
వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ తో మీడియా, వినోద రంగాలలో భారత్ అసమాన అంతర్జాతీయ కేంద్రంగా ఆవిర్భవించే అవకాశం: శ్రీ సంజయ్ జాజు
వేవ్స్ 'క్రియేట్ ఇన్ ఇండియా' ఛాలెంజ్ లో పాల్గొనాలంటూ యువతకు శ్రీ జాజు పిలుపు.
Posted On:
13 NOV 2024 6:37PM by PIB Hyderabad
మూడు రోజుల పాటు జరిగే ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీలో ఈ రోజు ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది గేమింగ్ నిపుణులు దీనికి హాజరయ్యారు. ఏటా జరిగే ఈ సమావేశం.. 16 వ ఎడిషన్ లో సుమారు వంద మంది అంతర్జాతీయ, స్థానిక గేమింగ్ డెవలపర్లు, పబ్లిషర్లు తమ విశేష ప్రతిభావిష్కరణలతో సందర్శకులను ఆకట్టుకోనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ... గేమింగ్ పరిశ్రమ, దాని భవిష్యత్తును తీర్చిదిద్దడం గురించి ప్రభుత్వ ఆలోచనలు, దార్శనికతను పంచుకున్నారు. ప్రతిభను ప్రోత్సహించడానికి, గేమింగ్, యానిమేషన్, సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించడానికి, ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ను నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఏర్పాటు చేస్తోందని శ్రీ జాజు తెలిపారు. ఫిక్కీ, సీఐఐలు 52 శాతం, భారత ప్రభుత్వం 48 శాతం ఈక్విటీతో పీపీపీ పద్ధతిలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. గేమింగ్ పరిశ్రమను భారత్ కేవలం ఉదయిస్తున్న పరిశ్రమగానే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా కూడా చూస్తోందన్నారు.
ప్రముఖ వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్ టైన్ మెంట్ కంపెనీల వ్యవస్థాపకులు, సిఎక్స్ఒలతో శ్రీ సంజయ్ జాజు సమావేశమయ్యారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే, జోక్యం చేసుకునే అంశాలను పరిశ్రమ పెద్దలు ఆయన ముందు ఉంచగా, వాటిని సానుకూలంగా పరిశీలిస్తామని శ్రీ జాజు హామీ ఇచ్చారు.
వీడియో గేమింగ్ పరిశ్రమ ప్రధానంగా విషయం (కంటెంట్), సృజనాత్మకతపై ఆధారపడిందని, భారతదేశంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను సృష్టించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తుందని, తద్వారా భారతదేశం ప్రపంచ గేమింగ్ రంగంలో ఆధిపత్యం చెలాయించగలదని శ్రీ జాజు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ... 2025 ఫిబ్రవరి 5 నుండి 9 వరకు జరిగే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్- వేవ్స్ గురించి ప్రస్తావించారు. ఈ అత్యున్నత స్థాయి సదస్సు మొత్తం మీడియా, వినోద రంగాలకు అతిపెద్ద అనుసంధాన కార్యక్రమం అవుతుందని ఆయన అన్నారు. భారతీయ స్థానిక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడం, ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ కు తీసుకురావడమే ఈ సదస్సును నిర్వహించడం ఉద్దేశమని ఆయన అన్నారు. ప్రపంచ మీడియా, వినోద పరిశ్రమలో భారత్ వాటా కేవలం 2 శాతమేనని, ఇంకా ఏడాదికి 20 శాతం వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని సంజయ్ జాజు అన్నారు. లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల కోసం 237 స్థానిక ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో చానళ్లను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ త్వరలో వేలం వేయనుందని కార్యదర్శి తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభోత్సవంలో ప్రసార భారతి- ఓటీటీని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దూరదర్శన్ ఫ్రీ డిష్ లో అందుబాటులో ఉన్న దాదాపు 60 ఛానళ్లు ఇకపై ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఓటీటీ ద్వారా చాలా వరకు అలనాటి కార్యక్రమాల (ఆర్కైవ్ మెటీరియల్) ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
భారతదేశ వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమను ఏకీకృతం చేయడం, ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జిడిఎఐ) ను కూడా ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు.
********
(Release ID: 2073142)
Visitor Counter : 51