ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్ లో నార్త్ ఈస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో లో పాల్గొననున్న కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్

Posted On: 12 NOV 2024 7:54PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్‌డీఓఎన్ఈఆర్) ఈ నెల 13న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో నార్త్ ఈస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌ మెంట్ రోడ్‌షో కార్యక్రమాన్ని నిర్వహించనుంది.  ఈ కార్యక్రమంలో మిజోరాం గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి తో పాటు కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ కూడా పాల్గొననున్నారు.  ఎమ్‌డీఓఎన్ఈఆర్ శాఖ సంయుక్త కార్యదర్శి మోనాలిసా దాస్ సహా ఆ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు, వివిధ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు.

ఈశాన్య ప్రాంతాంలోని రాష్ట్రాల ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వామిగా ఎఫ్ఐసీసీఐ (‘ఫిక్కీ’), పెట్టుబడులను సమన్వయపరచే భాగస్వామిగా ఇన్వెస్ట్ ఇండియా ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్నాయి.

ఈశాన్య ప్రాంత పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశానికి ముందస్తు సన్నాహకంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలలో హైదరాబాద్ రోడ్‌షో ఓ భాగం. ఈ తరహా ప్రధాన కార్యక్రమాలలో హైదరాబాద్ రోడ్‌షో ఐదోది.  ఈ రోడ్‌షోలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోమ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలకు చెందిన ప్రతినిధులు కొన్ని ప్రత్యేక అంశాలను ఆవిష్కరించనున్నారు.  ఈ ఎనిమిది రాష్ట్రాలూ కీలకమైన ఐటీ – ఐటీఈఎస్ (ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్), ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం - వ్యవసాయ సంబంధిత రంగాలు, విద్య - నైపుణ్యాభివృద్ధి, క్రీడలు – వినోద రంగం, పర్యాటక రంగం - ఆతిథ్య రంగం, మౌలిక సదుపాయాల కల్పన – ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) లతో పాటు ఇంధన రంగాలలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను ప్రధానంగా చాటిచెప్పనున్నాయి.  

పెట్టుబడులను ఆకర్షించి, ఆర్థికాభివృద్ధికి ఊతాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్‌డీఓఎన్ఈఆర్)  ‘నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను నిర్వహిస్తోంది.  ఇప్పటికే ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరులలో నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమాలకు చక్కటి స్పందన లభించింది.

ఇదే ఏడాదిలో సెప్టెంబరు 26న బెంగళూరులో నిర్వహించిన రోడ్‌షోకు తరలివచ్చిన సభికుల సంఖ్య ఆశాజనకంగా ఉంది.  ఈ కార్యక్రమానికి కమ్యూనికేషన్‌లు, ఎమ్‌డీఓఎన్ఈఆర్ శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా హాజరయ్యారు.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్య కార్యక్రమాలను బెంగళూరు రోడ్ షోలో గౌరవనీయ మంత్రి సభికులకు వివరించారు.  దీనిలో భాగంగా, దేశ ఈశాన్య ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడాన్ని గురించి, ఆ ప్రాంతంలో చక్కని అవకాశాలు నానాటికీ వర్ధిల్లుతుండడంతో అనేక మంది ఇన్వెస్టర్లు ఆ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నారని బెంగళూరు రోడ్ షో లో మంత్రి తెలియజేశారు.

మన దేశంలోని ఈశాన్య ప్రాంత వృద్ధి యాత్రలో భాగస్తులు అవుదాం అని ఆసక్తి చూపే ఔత్సాహిక ఇన్వెస్టర్లను చాలా మందిని హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్‌షో ఆకట్టుకొంటుందన్న అంచనాలు ఉన్నాయి.

 

***


(Release ID: 2072954) Visitor Counter : 18


Read this release in: English , Urdu , Hindi