నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2024 5:16PM by PIB Hyderabad
అయిదు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా జమ్ముకశ్మీర్‌కు చెందిన పాత్రికేయ బృందం ఈ రోజు విద్యానగర్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఎస్‌టీఐను )సందర్శించింది. పీఐబీ, శ్రీనగర్ డిప్యూటీ డైరెక్టర్ తారిక్ రాథర్ నేతృత్వం వహించిన ఈ బృందంలో 14 మంది పాత్రికేయులు ఉన్నారు. జమ్ముకాశ్మీర్ పాత్రికేయ ప్రతినిధులకు ఎన్ఎస్‌టీఐ (డబ్ల్యూ) విద్యార్థులతో కలసి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక శ్రీనివాసన్ స్వాగతం పలికారు.


ఎన్ఎస్‌టీఐ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి పాత్రికేయులకు శ్రీమతి ప్రియాంక వివరించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ), నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రధాన సంస్థల్లో ఎన్ఎస్‌టీఐ ఒకటి అని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సంస్థ అందిస్తున్న వివిధ వృత్తిపరమైన కోర్సుల గురించి, స్వయం ఉపాధి పొందేలా వారికి అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు.


వివిధ రంగాల్లోని ఆర్థిక వ్యవస్థలు, శ్రామిక మార్కెట్ రంగాల అవసరాలను ఎన్ఎస్‌టీఐ అందించే శిక్షణ కోర్సులు తీరుస్తాయని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్ పైలట్, డ్రోన్ టెక్నీషియన్ లాంటి అధునాతన కోర్సులను అందిస్తున్నామని వివరించారు.
పర్యటనలో భాగంగా ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, కాస్మెటాలజీ, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర శిక్షణ ప్రయోగశాలలను జమ్మూ కాశ్మీర్ పాత్రికేయులు సందర్శించారు. ఆధునిక శిక్షణ వసతులను పరిశీలించారు.
అంతకుముందు వివిధ కోర్సులకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులతో ముచ్చటించారు. సంస్థ వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

జమ్మూ కాశ్మీర్ పాత్రికేయ బృందం వెంట పీఐబీ- హైదరాబాద్ మీడియా కమ్యూనికేషన్ అధికారిణి వర్గంటి గాయత్రి ఉన్నారు.
***