వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘‘మేక్ ఇన్ ఇండియా’’ కు దన్నుగా ‘జన్ విశ్వాస్ 2.0’పై డిపిఐఐటి కసరత్తు
Posted On:
28 SEP 2024 6:10PM by PIB Hyderabad
దేశంలో వ్యాపారానికి అనువైన స్థితిగతులను మరింత సరళతరంగా మార్చాలనే లక్ష్యంతో ‘జన్ విశ్వాస్ 2.0’కు రూపకల్పన చేయడానికి ప్రభుత్వంలో వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 నిబంధనల, చట్టాల విషయంలోపారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ తొలి వంద రోజుల పాలన కాలం ప్రాధాన్యాల లో ఒకటిగా ఈ పనిని చేపట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమానికి మద్ధతును అందించడానికి, ప్రభుత్వం జన్ విశ్వాస్ (నింబంధనల సవరణ) చట్టం, 2023 కు చట్ట రూపాన్ని ఇచ్చింది. 42 కేంద్రీయ చట్టాలలో పేర్కొన్న చిన్న అపరాధాలను అవి అపరాధాల జాబితా లో చేరకుండా చూడాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ చట్టం 19 మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు చెందిన 183 నేర సంబంధిత నిబంధనలను తొలగించింది.
ఇదే తరహాలో మరిన్ని చట్టాలలో సైతం మార్పుచేర్పులను చేస్తూ దేశ నియంత్రణ యంత్రాంగాన్ని నిరంతరాయంగా ఆధునికీకరిస్తూ ఉండాలని జన్ విశ్వాస్ బిల్లును సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది. జన్ విశ్వాస్ చట్టం ఏవైనా చిన్న సాంకేతిక విధాన పరమైన అతిక్రమణలకు సివిల్ పెనాల్టీలు విధించాలని, పరిపాలన పరమైన చర్యలను కూడా తీసుకోవాలని సూచించింది. దీనితో దేశంలో నేర పూర్వక జరిమానాల తాలూకు భయం తగ్గడంతో పాటు వ్యాపార నిర్వహణ సంబంధిత సౌలభ్యం, జీవన సంబంధిత సౌలభ్యం వృద్ది చెందడానికి మార్గం సుగమం అయింది.
రోజు రోజుకు మార్పులకు లోనవుతున్న సాంకేతిక ప్రధాన వ్యాపార స్థితిగతులకు ఇక ఎంత మాత్రం తోడ్పడనటువంటి కాలం చెల్లిన నిబంధనల తొలగింపు ‘జన్ విశ్వాస్ చట్టం’ కీలక ధ్యేయాలలో ఒకటి. ఈ సమగ్ర సంస్కరణ ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఖర్చులతో పాటు కాలాన్ని కూడా ఆదా చేయడం ఒక్కటే కాకుండా అక్కర లేనటువంటి చట్టసంబంధిత అడ్డంకులను తొలగించివేసి, వ్యాపార సంస్థలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత సానుకూల పరిస్థితులను అందించనుంది.
లోక్ సభ కిందటి ఏడాది జులై 27న ఆమోదం తెలిపిన ఈ చట్టానికి రాజ్య సభ సైతం గత ఏడాది ఆగస్టు 2న ఆమోదాన్ని తెలిపింది. ఈ చట్టానికి కిందటి ఏడాది ఆగస్టు 11న రాష్ట్రపతి కార్యాలయం సమ్మతిని తెలియజేసింది. వ్యాపార సంస్థలలో, పౌరులలో విశ్వాసాన్ని ప్రోత్సహించడం, చట్ట ప్రక్రియలను సులభతరంగా మలచడంతో పాటు, న్యాయ వ్యవస్థపైన ఉన్న భారాన్ని తగ్గించాలన్నవి ఈ చట్టం లక్ష్యాలలో కొన్ని. అపరాధాల పట్టికలో కొన్నిటిని తొలగించే ప్రయాస తాలూకు అంతిమ ధ్యేయం ఏమిటి అంటే అది అపరాధాల తీవ్రతకు తగినట్లుగా జరిమానాలు ఉండాలని సూచించడమూ, అదే కాలంలో గంభీరమైన చట్ట ఉల్లంఘనలకు కఠినమైన దండనలు అవసరమని స్పష్టం చేయడమూను. మన దేశ నియంత్రణ సంబంధిత యంత్రాంగాన్ని భౌగోళిక వ్యాపార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేటట్లు చూస్తూ పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు సాఫీగా ముందుకు సాగేందుకు సానుకూలతను ఏర్పరచే దిశలో ఇది ఒక ప్రధానమైన నిర్ణయం.
***
(Release ID: 2060489)
Visitor Counter : 40