అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

అణు ఖనిజ వనరులను పెంపొందించడంలో ఏఎండీ పరిధి విస్తృతమైనది: ఏఎండీ డైరెక్టర్ జనరల్ డా. మొహంతి


ఘనంగా ఏఎండీ 75వ వ్యవస్థాపక దినోత్సవం ఏఎండీ విజయాలను ప్రస్తావిస్తూ ఐదు ప్రచురణలు

प्रविष्टि तिथि: 30 JUL 2024 4:25PM by PIB Hyderabad

అణుశక్తి విభాగం (డీఏఈ) పరిధిలోని అణు ఖనిజాల అన్వేషణ, పరిశోధన డైరెక్టొరేట్ (ఏఎండీ) 2024 జూలై 29న 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంది. న్యూఢిల్లీ, బెంగళూరు, జంషెడ్ పూర్, షిల్లాంగ్, జైపూర్, నాగ్పూర్, చర్లపల్లి (హైదరాబాద్)లోని ఏడు ప్రాంతీయ కేంద్రాలు; తిరువనంతపురం, విశాఖపట్నం, కలకత్తాల్లో ఉన్న మూడు విభాగ కార్యాలయాలతో పాటు హైదరాబాద్ బేగంపేటలోని ప్రధాన కార్యాలయంలో ఏకకాలంలో ఈ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ లోని ఏఎండీ ప్రధాన కార్యాలయంలో ఉన్న డా. హోమి జె. బాబా ఆడిటోరియంలో ప్రధాన వేడుకలు జరిగాయి. విస్తృత భాగస్వామ్యం కోసం కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదిక ద్వారా వెబ్ కాస్ట్ చేశారు. 

 
ముఖ్య అతిథిగా అణుశక్తి కమిషన్ (ఏఈసీ) చైర్మన్ & అణుశక్తి విభాగం (డీఏఈ) కార్యదర్శి డా. ఎ.కె. మొహంతి, గౌరవ అతిథిగా న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ చైర్మన్ & ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. కోమల్ కపూర్, ప్రత్యేక అతిథిగా ఏఎండీ మాజీ డైరెక్టర్ డా. కె.కె. ద్వివేది సహా విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితోపాటు ఏఎండీ డైరెక్టర్ శ్రీ ధీరజ్ పాండే, అదనపు డైరెక్టర్లు డా. ప్రభాకర్ కుమార్, శ్రీ ప్రేమ్ కుమార శర్మతో పాటు పలువురు ఏఎండీ ప్రముఖులు వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సరస్వతీ ప్రార్థనతో ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది. శ్రీ ధీరజ్ పాండే స్వాగతోపన్యాసం చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత భౌగోళిక సర్వే పరిధిలోని అరుదైన ఖనిజాల సర్వే విభాగం (ఆర్ఎంఎస్ యూ) మొదలు 1949 జూలై 29న అణుశక్తి కమిషన్ పరిధిలో ఏఎండీ స్థాపన వరకూ దాని ఘనమైన చరిత్రకు సంబంధించి అవలోకనాన్ని ఆయన అందించారు. 
దేశంలోని అణు ఖనిజ వనరులను పెంపొందించడంలో ఏఎండీ ప్రస్థానం, అవిశ్రాంత కృషిని శ్రీ పాండే ప్రముఖంగా ప్రస్తావించారు. అన్వేషణ, పరిశోధనలో శ్రేష్ఠత కోసం డైరెక్టరేట్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా ఏఎండీ 75 సంవత్సరాల సేవల స్మారక ప్రత్యేక లోగోను ముఖ్య అతిథి డాక్టర్ మొహంతి ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన డాక్టర్ కోమల్ కపూర్, డాక్టర్ కె.కె. ద్వివేది ఏఎండీ విశేష సేవలను ప్రశంసించారు. డైరెక్టరేట్ సాధించిన అద్భుత విజయాలకు సంబంధించి ఐదు అంతర్గత ప్రచురణలను కూడా డాక్టర్ మొహంతి ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.


డా. హోమీ బాబా అణుశక్తి కార్యక్రమమనే భావనను రూపొందించినప్పటి నుంచి భారతదేశంలో అణు ఖనిజాల కోసం ఏఎండీ అన్వేషణ వ్యూహం, అణు విజ్ఞానం & సాంకేతికత అభివృద్ధి దేశీయంగా జరిగాయని డా. మొహంతీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏఎండీ తన సామర్థ్యంలో వైవిధ్యాన్ని కనబరుస్తున్నదని; అరుదైన ఖనిజాలు, అరుదైన భూ మూలకాల వంటి కీలకమైన, వ్యూహాత్మక అంశాలపై అన్వేషణ ప్రారంభించిందని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. దేశంలో హరిత ఇంధన పరివర్తన నేపథ్యంలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంధన మిశ్రమంలో అణుశక్తి వాటా కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయం, తదితర రంగాలలో అణు సాంకేతిక పరిజ్ఞాన ఇంధనయేతర అనువర్తనాలను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డైరెక్టరేట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, భూమాత నుంచి నిరంతర ఖనిజ సంపద లభ్యత దృష్ట్యా అణు ఖనిజ వనరులను పెంపొందించడంలో ఏఎండీ కార్యకలాపాల పరిధి ఇప్పటికీ చాలా విస్తృతంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరి ప్రశంసలు పొందాయి. అనంతరం ముఖ్య పరిపాలన, గణాంక అధికారి ఎస్.ఎస్. ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు.


(रिलीज़ आईडी: 2039080) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English