సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత్-2047పై గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్వప్నం నెరవేర్చగల చరిత్రాత్మక బడ్జెట్ ఇది: డాక్టర్ ఎల్.మురుగన్


ప్రధానిగా మూడోసారి శ్రీ నరేంద్ర మోదీ సాధించిన రికార్డు విజయంతో ఈ కల నెరవేరడం తథ్యం: సమాచార-ప్రసార..
సభా వ్యవహార శాఖల సహాయ మంత్రి డాక్టర్ మురుగన్

प्रविष्टि तिथि: 27 JUL 2024 6:12PM by PIB Hyderabad

   కేంద్ర ప్రభుత్వం జూలై నెల 23న సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2024-25 చరిత్రాత్మకమైనదని కేంద్ర సమాచార-ప్రసార; సభా వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ అన్నారు. దేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపొందించాలన్న గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్వప్న సాకారం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందిందని ఆయన పేర్కొన్నారు.

   ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌పై శనివారం (2024 జూలై 27) ఆయన విజయవాడలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధానిగా మూడోసారి శ్రీ నరేంద్ర మోదీ సాధించిన రికార్డు విజయంతో ఈ కల నెరవేరడం తథ్యమని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.

   అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) అధికారంలోకి వచ్చినందువల్ల రాష్ట్రంలో ప్రగతి ద్వంద్వచోదక శక్తితో పరుగులు పెడుతుందని ఆయన అన్నారు.

   మన దేశం 2023-24లో జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి) పరంగా 8.2 శాతం వృద్ధి సాధించిందని ఆయన గుర్తుచేశారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే రెండేళ్లలో కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) గమ్యంగా మార్చుకోగలదన్నారు. అలాగే భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా చేపట్టిన సంస్కరణలను కొనసాగించగలదని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం పెంచుకునేలా ‘ఎఫ్‌డిఐ’ నియమనిబంధనాలు, విధానాలు సరళీకృతం చేసినట్లు తెలిపారు.

   సాంఘిక సంక్షేమ రంగానికి గత బడ్జెట్‌లో కేటాయింపులు రూ.11 లక్షల కోట్లు కాగా, ఈసారి రూ.23 లక్షల కోట్లకు పెంచినట్లు మంత్రి గుర్తుచేశారు. ఈ రంగంలో చేపట్టే కార్యక్రమాల ప్రభావంపై పర్యవేక్షణ కోసం అమలు-ఫలితాలపై దృష్టి సారించే చట్రానికి ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.

   ‘పిఎం-ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల కార్యక్రమం’, ‘ప్రధానమంత్రి జనారోగ్య యోజన’ సహా మానసిక ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగినందువల్ల ఆరోగ్య సంరక్షణ రంగం మరింత మెరుగుపడుతుందని డాక్టర్ మురుగన్ అన్నారు.

   అలాగే ‘పిఎం విశ్వకర్మ, పిఎం స్వానిధి, జాతీయ జీవనోపాధి కార్యక్రమాలు, స్టాండప్ ఇండియా’ వంటి ఇతర కార్యక్రమాలకూ బడ్జెట్ మరింత ఉత్తేజమిస్తుందని చెప్పారు. అంతేకాకుండా హస్తకళాకారులు, చేతివృత్తులవారు, స్వయం సహాయ బృందాలు, ఎస్సీ/ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలు, వీధి వర్తకులు తదితర వర్గాలకు సాధికారత లభిస్తుందని, ఉద్యోగ సృష్టితోపాటు స్థానికగా ఆర్థిక వ్యవస్థల వృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.

   మౌలిక సదుపాయాలు, బోధనాభ్యసన వనరులు, పోషకాహార మద్దతు సంబంధిత ప్రధాన పథకాలకు సమగ్ర శిక్ష అభియాన్, పిఎం-పోషణ్, పిఎం-శ్రీ వంటి వాటిద్వారా బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని మంత్రి వివరించారు.

   ఆరోగ్య రంగానికీ కేటాయింపులు రూ.2.5 లక్షల కోట్ల నుంచి రెట్టింపు పెరుగుదలతో రూ.5.85 లక్షల కోట్లకు చేరాయని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరపు కేటాయింపుతో పోలిస్తే ఈసారి కేటాయింపులు 13 శాతం పెరిగాయని తెలిపారు. దేశం ఆరోగ్య సంరక్షణ రంగం బలోపేతంపై ప్రభుత్వ నిర్విరామ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి చెప్పారు.

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

   దేశవ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయం దిశగా కోటిమంది రైతులను ప్రోత్సహించనున్నట్లు డాక్టర్ మురుగన్ తెలిపారు. ఈ కృషిలో భాగంగా వారికి ధ్రువీకరణ, బ్రాండింగ్ మద్దతు లభిస్తుందని తెలిపారు. అలాగే ఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్ల కేటాయించిన నేపథ్యంలో దేశమంతటా 10,000 దాకా అవసరాధారిత జీవ-ఉత్పాదక వనరుల కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు.

   పప్పుదినుసులు, నూనెగింజల పరంగా స్వావలంబన లక్ష్యంగా వాటి ఉత్పాదన, నిల్వ, మార్కెటింగ్‌లను ప్రభుత్వం బలోపేతం చేయనుందని తెలిపారు. అలాగే ఆవాలు, వేరుసెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల విషయంలో ‘స్వయం సమృద్ధి’ సాధనకూ చర్యలు చేపట్టిందని చెప్పారు. దేశంలోని రైతులతోపాటు వారి భూ కమతాలకు వర్తించే విధంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల సౌలభ్యం కల్పిస్తుందని వెల్లడించారు.

   ఉత్పాదకత పెంపుపై దృష్టి సారిస్తూ వ్యవసాయ పరిశోధన వ్యవస్థపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేపట్టనుందని మంత్రి తెలిపారు. అలాగే 32 రకాల సాధారణ- ఉద్యాన పంటల సాగుకు సంబంధించి 109 అధిక-దిగుబడి, వాతావరణ ప్రతిరోధక వంగడాలను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.

   తూర్పు భారత ప్రాంత సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ‘పూర్వోదయ’ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు డాక్టర్ మురుగన్ తెలిపారు. ఈ ప్రణాళిక కింద ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక అవకాశాల సృష్టి తదితర అంశాలపై ఈ ప్రణాళిక దృష్టి సారిస్తుందని చెప్పారు. తద్వారా వికసిత భారత్ లక్ష్య సాధనలో తూర్పు భారతం ఒక చోదకంగా రూపొందగలదన్నారు.

   ముద్ర రుణాల గురించి మాట్లాడుతూ- ఈ పథకం కింద పొందిన రుణాన్ని సకాలంలో చెల్లించిన పారిశ్రామికులకు మళ్లీ రుణ మంజూరు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచిందని మంత్రి వివరించారు.

   ప్రభుత్వ నేతృత్వంలో వృద్ధి లక్ష్యంగా తయారీ, సేవారంగాల పరిశ్రమల బలోపేతంసహా, ‘ఎంఎస్ఎంఇ’లకు చేయూతలో భాగంగా యంత్రాల కొనుగోలుకు రూ.100 కోట్లదాకా పూచీకత్తు లేని రుణం కచ్చితంగా లభిస్తుందని మంత్రి చెప్పారు. రుణ గ్రహీతలపై ఒత్తిడి తగ్గింపు, ఆర్థిక స్థిరత్వం దిశగా టర్నోవర్ పరిమితిని  రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు.

   ప్రస్తుత బడ్జెట్ 2024-25లో నైపుణ్య కల్పనపై ప్రకటనను ప్రస్తావిస్తూ- ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 4వ పథకంగా కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రకటించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారంతో అమలు చేసే ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో సుమారు 20 లక్షల మంది యువతకు  నైపుణ్య శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. ఈ మేరకు సత్ఫలితాల సాధన లక్ష్యంగా 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటిఐ)ను కూడలి-సంస్థ విధానం ఉన్నతీకరిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు, విధానాల కింద ఎలాంటి ప్రయోజనానికీ అర్హతలేని యువతకు చేయూతగా దేశీయ విద్యా సంస్థలలో ఉన్నత చదువుల కోసం రూ.10 లక్షల వంతున రుణం లభిస్తుందని మంత్రి తెలిపారు.

   దేశవ్యాప్తంగా ‘పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద కోటి కుటుంబాలు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందటానికి వీలుగా వారి ఇళ్ల పైకప్పుమీద సౌర శక్తి యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ మురుగన్ తెలిపారు. ఈ పథకానికి నేడు విశేష స్పందన లభిస్తున్నదని ఆయన అన్నారు.

   ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) 4వ దశకింద జనాభా పెరుగుదల ప్రాతిపదికన దేశంలోని 25,000 గ్రామీణ ఆవాసాలకు అన్ని వాతావరణాలకు తగిన రహదారి అనుసంధానం కల్పిస్తామని తెలిపారు.

   ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేక కేటాయింపులు’ చేసినట్లు డాక్టర్ మురుగన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్, పారిశ్రామిక కారిడార్లు తదితరాలపై ‘‘హామీల’’ మేరకు ఐదేళ్ల తర్వాత ఈ మేరకు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం నిధులతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిధిలోనివి సహా ప్రకాశం జిల్లాను కూడా ప్రత్యేకంగా చేర్చిన నేపథ్యంలో మొత్తం 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. బహుపాక్షిక సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ‘‘ప్రత్యేక ఆర్థిక సహాయం’’ సౌలభ్యం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రైతులకు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయంతోపాటు  సత్వర పూర్తికి కేంద్రం ‘‘పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంది’’ అని మంత్రి పునరుద్ఘాటించారు.

***


(रिलीज़ आईडी: 2038112) आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English