అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

రెండేళ్లలో స్పేస్ స్టార్టప్స్ 200 రెట్లు పెరిగాయన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


2030 నాటికి ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 4 రెట్లు పెరుగుతుంది: అంతరిక్ష శాఖ సహాయ మంత్రి

Posted On: 20 JUN 2024 6:18PM by PIB Hyderabad

కేవలం రెండేళ్లలో స్పేస్ స్టార్టప్స్ 200 రెట్లు పెరిగాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ(స్వతంత్ర హోదా) మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)... అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు విభాగం, పీఎంఓ సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ అన్నారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగాన్ని అనుమతించాలని, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని భారీగా ప్రోత్సహించాలని ప్రధాని మోదీ తీసుకున్న విధాన నిర్ణయం వల్ల ఈ స్థాయి పెరుగుదల సాధ్యమైందని మంత్రి తెలిపారు.

అంతరిక్ష శాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. భారత అంతరిక్ష రంగం ప్రస్తుత స్థితిగతులు, అవకాశాలు, భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలను ఆయన సమీక్షించారు.

 

ఈ సమావేశంలో ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, ఆయన బృందం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

2022లో 1 గా ఉన్న స్పేస్ స్టార్టప్‌ సంఖ్య.. 2024 నాటికి అనూహ్యంగా  200 రెట్లు పెరిగి దాదాపు 200కు చేరాయని మంత్రి పేర్కొన్నారు. ఒక్క 2023 సంవత్సరం కేవలం ఎనిమిది నెలల కాలంలోనే భారత అంతరిక్ష రంగంలో దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

 

అమృత్ కాలంలో ప్రధాని 'సబ్ కా ప్రయాస్' విజన్‌ను ధృవీకరిస్తూ దాదాపు 450 ఎంఎస్ఎంఈలు ఈ రంగానికి సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 

 

మరిన్ని లోతైన విషయాల గురించి చెబుతూ… 2021తో పోలిస్తే 2030 నాటికి ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 4 రెట్లు పెరుగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 2021లో ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో భారత్ వాటా 2 శాతం కాగా… ఇది 2030 నాటికి 8 శాతానికి, 2047 నాటికి 15 శాతానికి పెరుగుతుందని అంచనా.

అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెరుగుతుండటాన్ని డీవోపీటీ మంత్రి, ఇస్రో చైర్మన్ క్లుప్తంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను భారత్ అనుమతిస్తోంది. తద్వారా ఈ రంగానికి కొత్త ఆవిష్కరణలు, వృద్ధిని అందుతున్నాయి. 


అధునాతన చిన్న ఉపగ్రహాలు, జియోస్పేషియల్ టెక్నాలజీలు, కక్ష్య బదిలీ వాహనాలు మొదలైన వాటి అభివృద్ధికి ప్రైవేటు రంగం కొత్త పరిష్కారాలను అందించగలదని జితేంద్ర సింగ్ అన్నారు.

భారతీయ సమాజానికి సైన్స్ అందించిన సహకారం గురించి మాట్లాడుతూ.. వ్యవసాయం, పర్యావరణం, పాలన వంటి రంగాలలో ప్రైవేట్ సంస్థలు పెద్ద పాత్ర పోషిస్తాయని డాక్టర్ సింగ్ అన్నారు. 

 

సాంకేతిక పరిజ్ఞానాన్ని (టీఓటీ) ఇస్రో నుంచి ప్రైవేటు సంస్థలకు బదలాయించడంపై అధికారులకు జితేంద్ర సింగ్ పలు ఆదేశాలు జారీ చేశారు. 2020 నాటికి ఇలాంటి బదిలీలు 403 జరగగా, నేటి వరకు ఎన్ఎస్ఐఎల్/ఇన్ స్పేస్ నుంచి మరో 50 బదిలీలు జరిగాయి.

ఇస్రో తదుపరి 100 రోజుల ప్రణాళిక,, షెడ్యూల్ ప్రయోగాల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ చర్చించారు. నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంయుక్తంగా చేపడుతోన్న భూ పరిశీలన మిషన్ అయిన నిసార్ కార్యక్రమం ఇందులో ఉంది. నాసా, ఇస్రోలు తమదైన శైలిలో ఆప్టిమైజ్ చేసిన రెండు రాడార్లను ఈ మిషన్‌కు అందిస్తున్నాయి. ఒక్క రాడార్ గమనించే మార్పుల కంటే విస్తృతమైన మార్పులను గమనించడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది.

 

జీశాట్-20, పునర్వినియోగ ప్రయోగ వాహనం ల్యాండింగ్ ఎక్సర్ సైజ్, స్పేస్ డాకింగ్ ప్రయోగం తదితర కార్యక్రమాల గురించి జితేంద్ర సింగ్‌కు అధికారులు వివరించారు.


అంతరిక్ష రంగంలో ఆర్ అండ్ డీ విభాగంలో ప్రైవేటు సంస్థలు పోషించే పాత్రను కూడా శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి గుర్తించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ఎస్ సోమనాథ్, అంతరిక్ష శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***



(Release ID: 2027326) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP