విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-1ను జాతికి అంకితం చేసి , ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో ఎన్టీపీసీ నిర్మించనున్న 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-2 నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
Posted On:
23 FEB 2024 3:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 24 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-1 (2×800 మెగావాట్లు)ను జాతికి అంకితం చేసి , ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో ఎన్టీపీసీ నిర్మించనున్న 1,600 మెగావాట్ల (2×800 మెగావాట్ల) లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-2 నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-I ను సుమారు రూ.15,800 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. స్టేజ్-I నిర్మాణం అనంతరం అందుబాటులో ఉన్న స్థలంలో ప్రాజెక్ట్ స్టేజ్-II ను నిర్మిస్తారు. దీంతో విస్తరణకు అదనంగా భూసేకరణ అవసరం ఉండదు. స్టేజ్-2 ను రూ.15,530 కోట్ల రూపాయల ఖర్చుతో చేపడతారు.
ఈ పిట్ హెడ్ పవర్ స్టేషన్/ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును ఎన్టీపీసీ కి చెందిన తలాయిపల్లి కోల్ బ్లాక్ నుండి మెర్రీ-గో-రౌండ్ (ఎంజిఆర్) వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తారు, దీని వల్ల 24×7 సరఫరాకు అవసరమైన విద్యుత్ తక్కువ ఖర్చుతో అందుతుంది.
అత్యంత సమర్థవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-1ను నిర్మించారు. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో స్టేజ్-2 ను నిర్మిస్తారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంవల్ల బొగ్గు వినియోగం తగ్గుతుంది. కార్బన్-డయాక్సైడ్ ఉద్గారాల విడుదల తగ్గుతుంది.
స్టేజ్-1, స్టేజ్-2 లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 50 శాతం విద్యుత్ ను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కేటాయిస్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ వంటి అనేక ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీటితో పాటు విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సమీప ప్రాంతాల్లో పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
వీటిని కూడా చూడండి:
****
(Release ID: 2008431)
Visitor Counter : 110