సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని భరూచ్‌కి చెందిన వీబీఎస్‌వై లబ్ధిదారు, ఐటీఐ డిప్లొమా పూర్తి చేసిన రైతు శ్రీ అల్పేష్‌భాయ్ చందూభాయ్ నిజామాతో సంభాషించిన ప్రధాన మంత్రి
"విద్యావంతులైన యువత వ్యవసాయంలోకి ప్రవేశించడం వల్ల, పొలం నుంచి మార్కెట్ వరకు రైతులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలన్న సంకల్పానికి బలం చేకూరుతుంది": పీఎం
Posted On:
09 DEC 2023 3:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (వీబీఎస్‌వై) లబ్ధిదార్లతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలు అర్హత గల లబ్ధిదార్లందరికీ తగిన సమయంలో అందేలా చూడడం ద్వారా ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహిస్తున్నారు.
ఐటీఐ పూర్తి చేసిన రైతు, హార్డ్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన గుజరాత్‌లోని భరూచ్‌కు చెందిన రైతు, వీబీఎస్‌వై లబ్ధిదారు శ్రీ అల్పేష్‌భాయ్ చందూభాయ్ నిజామాతో ప్రధాని సంభాషించారు. వ్యవసాయం వైపు ఎందుకొచ్చారని అడిగారు. తన పూర్వీకుల 40 ఎకరాల భూమి ఉందని, కాబట్టి తాను ఉద్యోగం వదిలేసి రైతుగా మారానని అల్పేష్‌భాయ్ బదులిచ్చారు. తాను రాయితీ ధరలకు వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేశాని, రాష్ట్ర & కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందానని ప్రధానికి చెప్పారు. బిందు సేద్యం విధానంలో సాగు కోసం రూ.3 లక్షల రాయితీ పొందినట్లు తెలిపారు. “నేను మీ వయసులో ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, మీరు లక్షల గురించి మాట్లాడుతున్నారు. మార్పు అంటే ఇదే” అని ప్రధాన మంత్రి చెప్పారు.
అల్పేష్‌భాయ్ పొందుతున్న రాయితీలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పరికరాలపై తోటి రైతులకు సలహాలు ఇవ్వాలని కూడా సూచించారు. ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) ప్రాజెక్టులతో 2008 నుంచి తనకున్న అనుబంధం గురించి అల్పేష్‌భాయ్ చెప్పారు. అక్కడ, ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నానని వివరించారు. భరూచ్‌లో, ప్రధాని సమక్షంలో ఆత్మ ద్వారా ‘ఉత్తమ రైతు పురస్కారం’ కూడా తాను అందుకున్నట్లు చెప్పారు.
ఈ సంభాషణను చిరునవ్వుతో వింటున్న అల్పేష్‌భాయ్ కుమార్తెను చూసిన ప్రధాన మంత్రి, ఆమెతోనూ మాట్లాడారు. 'భారత్ మాతా కీ జై' నినాదానికి నాయకత్వం వహించాలని ఆమెకు సూచించారు.
వ్యవసాయ రంగం వైపు మొగ్గు చూపుతున్న యువతకు శ్రీ అల్పేష్‌భాయ్ వంటి వారు స్ఫూర్తి అని చెప్పిన ప్రధాన మంత్రి, సంభాషణ ముగించారు. ఆధునిక పద్ధతులు, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలతో పొలం నుంచి మార్కెట్ (బీజ్ సే బజార్ తక్) వరకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తామని ప్రధాని రైతులకు హామీ ఇచ్చారు. “విద్యావంతులైన యువత వ్యవసాయంలోకి ప్రవేశించడం ఈ తీర్మానానికి బలాన్ని ఇస్తుంది” అన్నారు. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించాలని కూడా శ్రీ మోదీ ప్రోత్సహించారు. రాబోయే 5 గ్రామాల్లో ‘మోదీ కి గ్యారెంటీ’ వాహనానికి భారీ స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని రైతులను ప్రధాన మంత్రి కోరారు.
***
(Release ID: 1984632)