పర్యటక మంత్రిత్వ శాఖ
మైస్ టూరిజంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలుగా డేటాబేస్ నిర్వహణ; డిజిటల్ ఆస్తుల భాగస్వామ్యం; బ్రాండింగ్
Posted On:
01 DEC 2023 7:21PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ శ్రేణి సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనల (మైస్) రంగంలో భారతదేశ స్థానాన్ని మరింత పటిష్ఠం చేయడం కోసం 2023 నవంబరు 30న పరిశ్రమ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ కంపెనీల సిఇఓలు, సీనియర్ నాయకులు హాజరై ప్రపంచ శ్రేణి వసతులు గల మైస్ గమ్యంగా భారతదేశ భవిష్యత్తుపై చర్చించారు.
భారతదేశ జి-20 అధ్యక్షత సమయంలో ప్రకటితమైన ప్రపంచ దేశాల అద్భుత ఆసక్తికి స్పందనగా టూరిజం మంత్రిత్వ శాఖ, మైస్ పరిశ్రమ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. జి-20 శిఖరాగ్రం సాధించిన విజయాలను సొమ్ము చేసుకునేందుకు భారతదేశ ఆధునిక మైస్ మౌలిక వసతులు, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంపై ఇందులో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.
సానుకూల వాతావరణం, విధాన వ్యవస్థ, స్థిరత్వం అనే మూడు అజెండాలను టూరిజం శాఖ కార్యదర్శి శ్రీమతి వి.విద్యావతి తన ప్రారంభోపన్యాసంలో ప్రస్తావించారు. భారతదేశ జి-20 అధ్యక్ష కాలంలో ఏర్పడిన వేగాన్ని ఆసరా చేసుకుని టూరిజం వ్యవస్థకు ఏ విధంగా సహాయసహకారాలందించగలం, ఈ రంగాన్ని మంత్రిత్వ శాఖ ఎంతవరకు విస్తరించగలదు వంటి అంశాలను పరిశీలించాలని ఆమె ప్రపంచ సంస్థలను, పరిశ్రమ నాయకులను కోరారు.
మైస్ పరిశ్రమకు జాతీయ వ్యూహం, విజన్, మిషన్, లక్ష్యం; భారతదేశంలో మైస్ పరిశ్రమ ప్రోత్సాహానికి మూల స్తంభాలు అనే అంశంపై పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాకేశ్ కుమార్ సమగ్ర ప్రెజెంటేషన్ ఇచ్చారు.
మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాండ్ ఏజెన్సీ ‘‘మీట్ ఇన్ ఇండియా’’ ప్రచారం; వివాహ పర్యాటకం కోసం ‘‘ఐ డు’’ ప్రచారం; ‘‘ట్రావెల్ ఫర్ లైఫ్’’ పై సమగ్ర చిత్రం ఆవిష్కరించింది. మైస్ పరిశ్రమలోకి స్థిరత్వం ఎలా తేవాలి, ఆ రంగాన్ని ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలపై సంపూర్ణ వివరాలతో ప్రెజెంటేషన్ ఇచ్చింది.
మైస్ పరిశ్రమలో భాగం అయిన హోటల్ చెయిన్లు, వృత్తిపరమైన సమావేశాల నిర్వహణ సంస్థలు, ప్రత్యేకించి మైస్ వ్యాపారంలో కీలక భాగస్వాములైన అకార్ గ్రూప్, మారియట్ హోటల్స్ గ్రూప్; లీలాల ప్యాలెసెస్, హోటల్స్, అండ్ రిసార్ట్స్; జియో వరల్డ్ సెంటర్, యశోభూమి (కైనెక్సిన్), అల్ప్ కార్డ్ నెట్ వర్క్ ట్రావెల్ అండ్ కాన్ఫరెన్సెస్ మేనేజ్ మెంట్ కంపెనీ, రాడిసన్ హోటల్ డ్రూప్ దక్షిణాసియా, ఐసిఇ ఇన్సెంటివ్ కాన్ఫరెన్స్, ఈవెంట్ మేనేజ్ మెంట్, ఇండియా ఎక్స్ పొజిషన్ మార్ట్ లిమిటెడ్ ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
మైస్ టూరిజంకు భారతదేశ సమున్నత సాంస్కృతిక వారసత్వం, ప్రాకృతిక వైరుధ్యం ప్రత్యేక ఆకర్షణలని పలువురు ప్రకటించిన అభిప్రాయాలు తెలుపుతున్నాయి. మేథోసంపత్తి కేంద్రంగా భారతదేశం హోదాను పరిశ్రమ ప్రతినిధులు గుర్తించారు. అలాగే విభిన్న రంగాలకు చెందిన మైస్ ఈవెంట్ల నిర్వహణ సామర్థ్యాన్ని కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మైస్ ప్రధాన గమ్యంగా భారతదేశాన్ని త్వరలో జరుగబోయే ఇంక్రెడిబుల్ మైస్ (ఐ మైస్) ఈవెంట్ పట్ల అత్యంత ఉత్సుకత వ్యక్తమయింది. ఈ రంగాన్ని హేతుబద్ధీకరించే లక్ష్యంతో మైస్ హోటల్స్ ను వ్యూహాత్మకంగా వర్గీకరించాలని పిలుపు ఇచ్చారు.
డేటా బేస్ నిర్వహణ, డిజిటల్ ఆస్తుల భాగస్వామ్యం, బ్రాండింగ్, మార్కెటింగ్, మైస్ పరిశ్రమ నియంత్రణలపై ఎంతో విలువైన సూచనలు ఇచ్చినందుకు పర్యాటక శాఖ కార్యదర్శి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశంలో మైస్ టూరిజం ప్రోత్సాహానికి మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని, అందరూ ఎంతగానో ఎదురు చూసే మైస్ గమ్యంగా భారతదేశాన్ని నిలిపే ప్రయత్నాన్ని ఈ రౌండ్ టేబుల్ ప్రదర్శించింది.
ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులందరికీ మంత్రిత్వ శాఖ ధన్యవాదాలు తెలియచేయడంతో పాటు భారతదేశ మైస్ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వెలికి తీయడంలో భాగస్వామ్యాలను ఆహ్వానించింది.
***
(Release ID: 1982640)
Visitor Counter : 93