మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆకలి సూచీ పేర్కొన్న బాలల్లో మూడోవంతు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నట్లు 7 కోట్లమందికిపైగా కొలతల్లో వెల్లడి
ఆకలిపై అంచనాల్లో ప్రపంచ ఆకలి సూచీ శోధన ప్రక్రియలు తీవ్ర
లోపభూయిష్టంగా.. అంచనాలు దురుద్దేశపూరితంగా కనిపిస్తున్నాయి;
పౌరుల ఆహార భద్రతకు భరోసాపై ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది
Posted On:
12 OCT 2023 6:45PM by PIB Hyderabad
భారతదేశంలో పోషకాహార లోపం సమస్య పరిష్కారానికి “మిషన్ సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0” (మిషన్ పోషణ్ 2.0) కింద కేంద్ర ప్రభుత్వం అనేక కీలక కార్యకలాపాలకు ప్రాధాన్యమిస్తోంది. అంతేకాకుండా వీటన్నిటిపై నిశిత పర్యవేక్షణ, ఫలితాల బేరీజు కోసం కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ “పోషణ్ ట్రాకర్” పేరిట మొబైల్ (ఐసిటి) అనువర్తనాన్ని ప్రవేశపెట్టి, దీన్నొక ముఖ్యమైన సాధనంగా వినియోగిస్తోంది. ఇప్పటిదాకా 13.96 లక్షల (1.396 మిలియన్) అంగన్‌వాడీ కేంద్రాలు ఈ అనువర్తనం పరిధిలో నమోదయ్యాయి. దీని ఆధారంగా రూపొందించిన అంచనాల ప్రకారం- ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, స్తన్యమిచ్చే తల్లులు, 6 ఏళ్లలోపు బాలలు, కౌమార బాలికలు సహా మొత్తం 10.3 కోట్ల (103 మిలియన్) మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) విస్తరిత పట్టికలను పోషణ్ ట్రాకర్ అనుసరిస్తోంది. బాలల ఎత్తు, బరువు, లింగం, వయస్సు ఆధారంగా వారిలో గిడసబారడం, కుంగుబాటు, తక్కువ బరువు, ఊబకాయం వంటి స్థితిగతులను చురుగ్గా అంచనా వేయడం కోసం రోజువారీ జడ్-స్కోరు (బాలల్లో ఎత్తు, బరువుల పోలికతో తేడా అంచనా)ను ఈ విధానం అందిస్తుంది. ఈ పద్ధతిలో అంచనాలు తీయడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు జిల్లాస్థాయి వైద్య నిపుణుల ద్వారా శిక్షణ కూడా పొందారు. మరోవైపు అంగన్‌వాడీలలో బాలల వృద్ధి పారామితుల అంచనా కోసం ప్రపంచ బ్యాంకు, బిల్ మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ వంటి సంస్థల ద్వారా దేశంలోని ప్రతి అంగన్‌వాడీకి పరికరాలు కూడా సరఫరా చేయబడ్డాయి.
మరో్వైపు యునిసెఫ్, ‘డబ్ల్యుహెచ్‌ఒ’, ప్రపంచ బ్యాంక్ వంటి అనేక కీలక అంతర్జాతీయ సంస్థలు కూడా ‘పోషణ్ ట్రాకర్’ను పోషకాహార రంగంలో కొత్త మలుపుగా గుర్తించాయి. అంతేకాకుండా ఈ ఉపకరణం ద్వారా కార్యాచరణ నిమిత్తం ప్రపంచ బ్యాంకు, ‘యునిసెఫ్’లు మంత్రిత్వశాఖకు సన్నిహిత సహకారం అందించాయి. అలాగే పోషకాహారంపై లోపరహిత దైనందిన పాలన సమాచార సేకరణకు పోషణ్ ట్రాకర్‌ను ఆదర్శప్రాయ వేదికగా ‘డబ్ల్యుహెచ్‌ఒ’ గుర్తించింది. అదేవిధఃగా భారత జి-20 అధ్యక్షత నేపథ్యంలో కూటమి సభ్య దేశాలన్నీ పోషణ్ ట్రాకర్ పనితీరును పరిశీలించాయి. ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా సేకరించే సమాచారాన్ని ఈ విశిష్ట వేదిక ఎప్పటికప్పుడు డిజటలీకరిస్తూ లక్ష్య నిర్దేశిత విధానాలు, చర్యలకు వీలు కల్పిస్తుంది.
ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్ నుంచి పోషణ్ ట్రాకర్ ద్వారా అప్‌లోడ్ చేయబడే ఐదేళ్ల లోపు బాలల శరీర కొలతల సమాచారం స్థిరంగా పెరుగుతోంది. ఈ మేరకు ఆరంభంలో (2023 ఏప్రిల్) 6.34 కోట్ల (63.4 మిలియన్లు) నుంచి 2023 సెప్టెంబరుకల్లా 7.24 కోట్లకు (72.4 మిలియన్లు) పెరిగింది. దీని ప్రకారం- పిల్లల్లో నెలవారీ కుంగుబాటు శాతం 7.2 శాతంకన్నా దిగువన నిలకడగానమోదవుతోంది. కానీ, ప్రపంచ ఆకలి సూచీ-2023 నివేదిక దీన్ని 18.7 శాతంగా చూపుతుండటం గమనార్హం.
దీన్నిబట్టి ‘ఆకలి’పై అంచనాల్లో ప్రపంచ ఆకలి సూచీ అంచనాల విధానం లోపభూయిష్టంగా ఉందని, అది భారతదేశంలోని వాస్తవికతను ప్రతిబింబించడం లేదని స్పష్టమవుతోంది. కాగా, ఐర్లాండ్, జర్మనీ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు “కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్ట్ హంగర్ హిల్ఫ్” విడుదల చేసిన ప్రపంచ ఆకలి నివేదిక-2023లో ప్రపంచంలోని 125 దేశాలకుగాను భారతదేశానికి 111వ ర్యాంక్ ఇచ్చాయి. అయితే, ఆకలిపై అంచనాల్లో ఇది అనుసరించే సూచీలు విధానపరంగా తీవ్ర లోపభూయిష్టమని చెప్పకతప్పదు. ఇది ఉపయోగించే నాలుగు సూచీలలో మూడు బాలల ఆరోగ్య సంబంధితం కాబట్టి, అవి మొత్తం జనాభాను ప్రాతిపదికగా తీసుకోజాలవు. ఇక 4వ… అత్యంత కీలకమైన ‘పోషకాహార లోపంగల జనాభా నిష్పత్తి’
(పిఒయు) సూచీ అత్యంత స్వల్ప నమూనా- కేవలం 3000 మందితో అభిప్రాయ సేకరణపై ఆధాపడినది కావడం గమనార్హం.
ఐక్యరాజ్య సమితి ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) విడుదల చేసిన “ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్-2023” (ఎస్‌ఒఎఫ్‌ఐ-2023)” నివేదిక భారతదేశంలో ‘పిఒయు’ను 16.6 శాతంగా అంచనా వేసింది. ‘గ్యాలప్ వరల్డ్ పోల్’ ద్వారా నిర్వహించబడిన “ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఎక్స్‌పీరియన్స్ స్కేల్” (ఎఫ్‌ఐఇఎస్) సర్వే ఆధారంగా ‘ఎఫ్‌ఎఒ’ తన అంచనాలను ప్రకటించింది. కాగా, ఇది కేవలం ‘8 ప్రశ్నలు, ‘3000 మంది ప్రతిస్పందకుల’ నమూనా పరిమాణంతో నిర్వహించిన ‘జనాభిప్రాయ సేకరణ’ మాత్రమే. భారీ జనాభాగల దేశంలో అత్యంత స్వల్ప నమూనా పరిమాణంతో సర్వే ఒక లోపం. కాగా, అటువంటి లోపభూయిష్ట ప్రక్రియ ద్వారా సేకరించిన సమాచారంతో సువిశాల భారతదేశం ‘పిఒయు’ను గణించడం మరో లోపం. ఒక్కమాటలో చెబితే ఇది పూర్తిగా తప్పు.. అనైతికం మాత్రమే కాకుండా భారత్‌పట్ల పక్షపాత ధోరణిని కూడా ప్రస్ఫుటం చేస్తోంది.
ఇటువంటి తప్పుడు పద్ధతులు అనుసరించిన కారణంగానే ‘ఎఫ్‌ఐఇఎస్’ సర్వే సమాచారాన్ని తన అంచనాలకు ప్రాతిపదికగా తీసుకోవద్దని ‘ఎఫ్‌ఎఒ’కు భారత్ సూచించింది. వాస్తవానికి కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ; ఆహార-ప్రజా పంపిణీ ష 00 మంత్రిత్వశాఖలతోపాటు ‘ఎఫ్‌ఎఒ’తో సంయుక్తంగా ‘ఎఫ్‌ఐఇఎస్’పై ప్రయోగాత్మక అధ్యయనం నిర్వహించాలని కేంద్ర గణాంక-పథకాల అమలు మంత్రిత్వశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఏర్పాటైన సాంకేతిక బృందం కూడా రంగంలో దిగింది. ‘ఎఫ్‌ఐఇఎస్’ అనుసరిస్తున్న విధానంలోని ప్రశ్నావళి, నమూనా రూపకల్పన-పరిమాణంసహా పలు మార్పులను ఈ బృందం సూచించింది. తదనుగుణంగా ప్రారంభమైన ప్రయోగాత్మక అధ్యయనం ముగియక ముందే ‘ఎఫ్‌ఐఇఎస్’ లోపభూయిష్ట ‘పిఒయు’ ప్రాతిపదికగా ‘ఎఫ్‌ఎఒ’ తన అంచనాలను విడుదల చేయడం శోచనీయం.
ఇక ‘గిడసబారడం, కుంగుబాటు’ అనే మరో రెండు సూచీలు పరిశుభ్రత, జన్యుకారణాలు, పర్యావరణం, ఆహార స్వీకరణ వంటి అనేక ఇతర కారకాల సంక్లిష్ట పరస్పర చర్యల ఫలితాలు. అయితే, ఆకలితోపాటు వీటిని కూడా ప్రపంచ ఆకలి సూచీలో గిడసబారడం, కుంగుబాటుకు కారకాలుగా తీసుకున్నారు. ఇక బాలల మరణాల సంబంధిత 4వ సూచీ కింద అన్నీ ఆకలి మరణాలేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి ఫలితంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పేదలు, అణగారిన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన (పిఎంజికెఎవై) ప్రారంభించింది. అప్పటికే జాతీయ ఆహార భద్రత చట్టం-2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద అందజేస్తున్న ఉచిత ఆహార ధాన్యాలకు అదనంగా ‘పీఎంజికెఎవై’ (తొలి దశ నుంచి 7వ దశవరకూ) ద్వారా 28 నెలలపాటు సుమారు 1,118 లక్షల టన్నుల (111.8 మిలియన్ టన్నులు) ఆహార ధాన్యాలు కేటాయించింది. ఇందుకోసం 2020-2021 ఆర్థిక సంవత్సరాల్లో ప్రణాళిక కేటాయింపుల ద్వారా రూ.3.91 లక్షల కోట్లు (3910 బిలియన్లు) వెచ్చించింది. ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి (800 మిలియన్లు) ప్రయోజనం చేకూరింది. ఇక ‘ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ-2013’ పరిధిలోని అంత్యోదయ అన్న యోజన (ఎఎవై), ప్రాధాన్య కుటుంబ లబ్ధిదారుల (పిహెచ్‌హెచ్)కు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కోసం 2023 జనవరి 1 నుంచి ‘పిఎంజికెఎవై’ని మరో ఏడాదిపాటు పొడిగించింది. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లు (2000 బిలియన్) ఖర్చు చేయనున్న నేపథ్యంలో ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ఆహార భద్రత కార్యక్రమం కావడం విశేషం.
(Release ID: 1967278)
Visitor Counter : 163