జల శక్తి మంత్రిత్వ శాఖ
వినియోగంలోగల ఆనకట్టలు
Posted On:
03 AUG 2023 3:25PM by PIB Hyderabad
భారత్‌లోని భారీ ఆనకట్టలపై 2019 నాటి కేంద్ర జలసంఘం (ఎన్‌ఆర్‌ఎల్‌డి) సంకలనం ప్రకారం దేశంలో పూర్తయిన భారీ ఆనకట్టల సంఖ్య 5,334గా ఉంది. ఈ భారీ ఆనకట్టలకు సంబంధించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారీగాగల జాబితా అనుబంధంగా దీనికి జోడించబడింది. వీటిలో 234 పెద్ద ఆనకట్టలు 100 సంవత్సరాలకు పైబడినవి (అంటే 1922కు ముందు నిర్మించబడివి).
ఈ ఆనకట్టలలో అధిక శాతం రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల నిర్వహణలో ఉన్నవే. వాటి భద్రత బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుంది కాబట్టి రుతుపవనాల రాకకు ముందు, ఆ తర్వాత నిర్దిష్ట కాలవ్యవధిలో ఆనకట్టల లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా తనిఖీ చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ-నిర్వహణపరంగా భద్రత అంచనా లక్ష్యంగా సమగ్ర తనిఖీ కోసం కొన్ని రాష్ట్రాలు వివిధ రంగాల నిపుణులతో ఆనకట్టల భద్రత సమీక్ష బృందాలను ఏర్పాటు చేశాయి. అయితే, వాటి జీవిత కాలం సాధారణంగా ఆ పరిసరాల్లో నివసించే ప్రజల భద్రతకు హాని కలగకుండా నిర్దే్శిత లక్ష్యం నెరవేర్చగల సామర్థ్యానికి తగినట్లుగా ఉంటుంది.
మరోవైపు ఆనకట్టల వైఫల్యం సంబంధిత విపత్తుల నివారణకు, వాటి సురక్షిత పనితీరు సంబంధిత అంశాలపై భరోసా దిశగా సంస్థాగత యంత్రాంగం ఏర్పాటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆనకట్టల భద్రత చట్టం-2021ని రూపొందించింది. ఆనకట్టలపై నిఘా, తనిఖీ, నిర్వహణ సంబంధిత అంశాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ నిపుణుల బృందం ద్వారా ప్రతి ఆనకట్ట స్థితిగతుల నిర్ధారణతోపాటు హైడ్రోలాజిక్, హైడ్రాలిక్, సీస్మిక్, నిర్వహణ భద్రత సంబంధిత సాధారణ అంచనాలు, ఆనకట్టల సమగ్ర భద్రత మూల్యాంకనానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
దేశంలోని ప్రస్తుత ఆనకట్టలలో ఎంపిక చేసిన వాటి నిర్వహణ సామర్థ్యం, భద్రత మెరుగు కోసం కేంద్ర ప్రభుత్వం బాహ్యమార్గాలలో నిధుల సమీకరణ ద్వారా ఆనకట్టల పునరుద్ధరణ-మెరుగు పథకం (డిఆర్‌ఐపి) అమలు చేస్తోంది. దీనికింద 2012 ఏప్రిల్ నుంచి 2021 మార్చివరకు ప్రపంచ బ్యాంకు నిధులతో ‘డ్రిప్’ తొలిదశ కింద 7 రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల భద్రతపై సమగ్ర తనిఖీ నిర్వహించబడింది. తదనుగుణంగా రూ.2,567 కోట్లతో వాటి పునరుద్ధరణ పనులు కూడా చేపట్టింది. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఫేజ్-II, IIIల కింద కార్యక్రమాలు చేపట్టింది. ఈ రెండు దశలకింద పదేళ్ల వ్యవధిలో రూ.10,211 కోట్ల బడ్జెట్‌తో 19 రాష్ట్రాల్లోగల 736 ఆనకట్టల పునరుద్ధరణ-భద్రత కార్యక్రమాలు చేపట్టనుంది.
లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈ సమాచారం వెల్లడించారు.
*****
Release ID: 1945398
ఎండిపోతున్న జలవనరులు
పీఐబీ ఢిల్లీ ద్వారా 2023 ఆగస్టు 3న మధ్యాహ్నం 3:28 గంటలకు పోస్ట్ చేయబడినది
దేశంలోని అన్ని జల వనరుల జాతీయ సమాచార భాండాగారం రూపొందించే లక్ష్యంతో ఆరో చిన్ననీటి వనరుల గణన (పరిశీలన సంవత్సరం 2017-18)తో కలిపి, తొలిసారి జల వనరుల గణనను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించింది. దీనికింద ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంపికచేసిన నోడల్ విభాగం ద్వారా ఆయా ప్రభుత్వాలు జల వనరుగల గణన నిర్వహించాయి. దీని ప్రకారం- దేశంలో 24,24,540 జల వనరులు ఉన్నాయని తేలింది. వీటిలో 20,30,040 వనరులు ‘వినియోగం’లో ఉండగా, మరో 3,94,500 వనరులు ‘వినియోగం’లో లేవు. కాగా, వీటిలో 93,009 పూర్తిగా ఎండిపోవడమే అవి నిరుపయోగం కావడానికి కారణమని అధ్యయన నివేదిక తేల్చింది.
ఇక కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ భూగర్భజల సంస్థ (సిజిడబ్ల్యుజి) బావుల నెట్‌వర్క్ పర్యవేక్షణ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ప్రాంతీయ స్థాయిలో భూగర్భజల మట్టం స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూంటుంది. భూగర్భజల మట్టంలో దీర్ఘకాలిక హెచ్చుతగ్గుల అంచనాలో భాగంగా 2022 నవంబరులో ‘సిజిడబ్ల్యుజి’ ద్వారా సేకరించిన భూగర్భ జలమట్టం స్థాయిపై సమాచారాన్ని నవంబరు నెల ప్రాతిపదికగా (2012-2021) దశాబ్ద సగటుతో పోల్చి చూసింది. దీని ప్రకారం పర్యవేక్షణలోగల మొత్తం బావులలో 61 శాతం భూగర్భజల మట్టం పెరుగుదల నమోదవగా, మిగిలిన 39శాతం బావులలో క్షీణత నమోదైంది.
నీరు రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి ఎండిపోయినవి సహా అన్ని జల వనరుల పునరుజ్జీవనం బాధ్యత అక్కడి ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల కృషికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కింద పేర్కొన్న కొన్ని చర్యలు చేపట్టింది:
- ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పిఎంకెఎస్‌వై) పరిధిలోని ‘ప్రతి కమతానికీ నీరు’ (హెచ్‌ఆర్‌కెపి) కింద జల వనరుల మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ (ఆర్‌ఆర్‌ఆర్-డబ్ల్యుబి) కార్యక్రమంలో భాగంగా గుర్తించబడిన పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కాగా, గడచిన మూడేళ్లలో ఈ పథకం కింద నిధులు కోరుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జల వనరుల పునరుద్ధర ప్రతిపాదనలేవీ పంపలేదు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జలశక్తి అభియాన్ వార్షిక కార్యక్రమాల కింద కేంద్రీకృత చర్యలు, సంప్రదాయ, ఇతరత్రా జల వనరులు/చెరువుల గణన-పునరుద్ధరణ, జియో-ట్యాగింగ్ సహా అన్ని జలవనరుల జాబితా తయారీ. అలాగే చెరువులు/సరస్సులలో ఆక్రమణలు-పూడిక తొలగింపుపై శ్రద్ధ వహించడం.
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) నిబంధనలకు అనుగుణంగా భూగర్భ అడ్డుకట్టలు, మట్టి ఆనకట్టలు, నిల్వ డ్యామ్‌లు, చెక్ డ్యామ్‌లు, పైకప్పు వర్షపు నీటి సంరక్షణ వంటి భూగర్భజల మట్టం పెంచే, మెరుగుపరచే చర్యలు చేపట్టడం. తద్వారా సహజ వనరుల నిర్వహణ, జల సంరక్షణ, జల సమీకరణ నిర్మాణాల సంబంధిత ప్రజా పనులు కూడా చేపట్టవచ్చు.
- స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో భాగంగా 2022 ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ‘అమృత సరోవరాలు’ కార్యక్రమం ప్రారంభించింది. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 1 ఎకరా విస్తీర్ణంతో కనిష్ఠంగా 75 జల వనరుల (అమృత సరోవరాల) తవ్వకం, పునరుద్ధరణ ఈ పథకం లక్ష్యం.
- కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోగల అటల్ మిషన్ ఫర్ రిజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకంలోని నీటి సరఫరా విభాగం కింద జల వనరుల పునరుజ్జీవనం కూడా అంతర్భాగం. తదనుగుణంగా 2021 అక్టోబరులో ‘అమృత్ 2.0’ ప్రారంభమైంది. శుద్ధిచేసిన మురుగునీటి పునఃశుద్ధి/ పునరుపయోగం, జల వనరుల పునరుద్ధరణ, జల సంరక్షణపై దృష్టి సారించే ప్రతి నగరానికీ నగర నీటి సమతౌల్య ప్రణాళిక రూపొందించడం వగైరాల ద్వారా వృత్తాకార జల ఆర్థిక వ్యవస్థను ఇది ప్రోత్సహిస్తుంది.
లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈ సమాచారం వెల్లడించారు.
*****
(Release ID: 1945695)
Visitor Counter : 101