గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సిటీస్‌ 2.0

Posted On: 03 AUG 2023 5:26PM by PIB Hyderabad

ఈ ఏడాది మే 31వ తేదీన, 'సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ 2.0'కు (సిటీస్‌ 2.0)' భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏఎఫ్‌డీ), క్రెడిటాన్‌స్టాల్ట్ ఫర్ వైడెరౌఫ్‌బౌ (కేఎఫ్‌డబ్ల్యూ),  యూరోపియన్ యూనియన్ (ఈయూ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయూఏ) భాగస్వామ్యంతో కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిటీస్‌ 2.0ను రూపొందించింది. ఈ కార్యక్రమం వ్యవధి 4 సంవత్సరాలు. సిటీస్‌ 2.0 మూడు ప్రధాన విభాగాలుగా ఉంటుంది:

విభాగం-1: సమీకృత వ్యర్థాల నిర్వహణపై దృష్టితో, వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే ప్రాజెక్టుల కోసం 18 స్మార్ట్ సిటీల వరకు ఆర్థిక, సాంకేతిక మద్దతు

విభాగం-2: వాతావరణ చర్యల కోసం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మద్దతు

విభాగం-3: అన్ని నగరాలు, పట్టణాలకు మద్దతు పెంచేలా జాతీయ స్థాయిలో కార్యకలాపాలు

సిటీస్‌ 1.0 కార్యక్రమం కింద, 12 నగరాలను ఛాలెంజ్ విధానం ద్వారా ఎంపిక చేసారు. సిటీస్‌ 1.0 కార్యక్రమం కింద ఉన్న 12 ప్రాజెక్టుల వివరాలు నగరం వారీగా అనుబంధం-Iలో ఉన్నాయి.

ఎన్‌ఐయూఏలో ఉన్న జాతీయ ప్రాజెక్టు నిర్వహణ విభాగం నిరంతరం ప్రాజెక్టులను సందర్శిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సామర్థ్యం పెంపు సహా అవసరమైన మద్దతును అందిస్తుంది. సిటీస్‌ 1.0 కింద ఉన్న ప్రతి ప్రాజెక్టుకు, క్షేత్ర స్థాయిలో వివరణాత్మక మార్గదర్శనం చేయడానికి దేశీయ నిపుణుడు, అంతర్జాతీయ మార్గదర్శకుడు ఉన్నారు. దీనికి అదనంగా, మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి & మిషన్ డైరెక్టర్ నేతృత్వంలో, అత్యున్నత కమిటీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది.

కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****



(Release ID: 1945640) Visitor Counter : 153


Read this release in: English