పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎంయువై)

Posted On: 24 JUL 2023 6:10PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని వయోజన మహిళా సభ్యురాలి పేరు మీద డిపాజిట్ లేకుండా ఉచితంగా ఎల్‌పిజీ కనెక్షన్‌ను అందించడానికి 01.05.2016న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) ప్రారంభించబడింది.సెప్టెంబర్, 2019లో 8 కోట్ల కనెక్షన్‌లను అందించాలన్న లక్ష్యాన్ని ఈ కార్యక్రమం చేరుకుంది. మిగిలిన పేద కుటుంబాలను కవర్ చేయడానికి 1 కోటి అదనపు పిఎంయువై కనెక్షన్‌లను విడుదల చేయాలనే లక్ష్యంతో ఆగస్టు 2021లో పిఎంయువైఫేజ్-2 (ఉజ్జ్వల 2.0) ప్రారంభించబడింది. ఇది జనవరి 2022లో లక్ష్యాన్ని అందుకుంది. అనంతరం 01.01.2023న మరో 60 లక్షల కనెక్షన్లు ఉజ్వల 2.0 కింద విడుదల చేయబడ్డాయి. 1.60 కోట్ల ఉజ్వల 2.0 కనెక్షన్ల లక్ష్యం ఇప్పటికే సాధించబడింది. ఉజ్జ్వల 2.0 కింద పిఎంయువై కనెక్షన్ కోసం దరఖాస్తు చేయడానికి చిరునామా మరియు రేషన్ కార్డ్ రుజువుకు బదులుగా స్వీయ డిక్లరేషన్‌ని ఉపయోగించే వలస కుటుంబాల కోసం ప్రత్యేక సదుపాయం కల్పించబడింది. ఉజ్వల 2.0 కింద వలస కుటుంబాలకు మొత్తం 5.43 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు అందించబడ్డాయి.

01.07.2023 నాటికి దాదాపు 9.59 కోట్ల మంది పిఎంయువై లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 8.41 కోట్ల మంది 2022-23లో కనీసం ఒక రీఫిల్‌ను తీసుకున్నారు.

పిఎంయువై లబ్ధిదారుల ఎల్‌పిజి వినియోగాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం జరుగుతుంది. ఆహార అలవాట్లు, గృహ పరిమాణం, వంట అలవాట్లు, ధర, ప్రత్యామ్నాయ ఇంధనాల లభ్యత మొదలైన అనేక అంశాలపై గృహ ఎల్‌పిజి వినియోగం  ఆధారపడి ఉంటుంది. పిఎంయువై లబ్ధిదారుల తలసరి వినియోగం 14.2 కిలోల సిలిండర్ పరంగా 3.01 (2019-20 ఆర్ధిక సంవత్సరం) నుండి 3.71 (2022-23 ఆర్ధిక సంవత్సరానికి)కి పెరిగింది. ఇంకా ఎల్‌పిజి వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో 14.2 కేజీల సిలిండర్‌కు రూ.200 సబ్సిడిని ప్రభుత్వం అందిస్తోంది. 2022-23, 2023-24 ఆర్దిక సంవత్సరాల్లో సంవత్సరానికి 12 సిలిండర్ల వరకూ ఈ సబ్సిడిని వినియోగ దారులకు అందిస్తుంది. అలాగే 5 కేజీల డబుల్ బాటిల్ కనెక్షన్ (డిబిసి),  14.2 కేజీల నుండి 5 కేజీలకు స్వాప్ ఎంపిక, ఏప్రిల్ నుండి డిసెంబర్ 2020 వరకూ పిఎంయువై లబ్దిదారులకు ప్రధానమంత్రి గరిబ్‌ కల్యాణ్ కింద 3 సిలిండర్ల వరకూ ఉచితంగా అందించడం వంటి చర్యలు ఉన్నాయి.

పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఈరోజు  అందించారు.

 

 

***



(Release ID: 1942398) Visitor Counter : 112


Read this release in: English , Urdu