జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోలవరం ప్రాజెక్టు కోసం నిధుల విడుదల

Posted On: 24 JUL 2023 6:12PM by PIB Hyderabad

పోలవరం ప్రాజెక్టు గురించి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానమిచ్చారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టులో (పీఐపీ) 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.10,911.15 కోట్ల రూపాయలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతుల కోసం మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఈ ఏడాది జూన్‌ 5న విడుదల చేసిన ఆఫీస్‌ మొమెరాండం ద్వారా తెలిపిందని మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించి, కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న గత నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం మరోమారు ఆమోదించాల్సి ఉందని జలశక్తి శాఖ సహాయ మంత్రి వెల్లడించారు.

పోలవరం తొలి దశ నిర్మాణంలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు మిగిలిన పనులు పూర్తి చేయడానికి, సవరించిన అంచనాల ప్రకారం రూ.17,144.06 కోట్ల వ్యయం అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 05.06.2023న ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ ప్రతిపాదనను త్వరగా పరిశీలించి, ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే, ఇది నిర్దిష్ట కాల గడువులో పూర్తి చేయాలనడం సరికాదు.

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి 15.03.2022న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా తక్షణం రూ.10,000 కోట్లు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి 15.07.2022న ఒక లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు తొలి దశ నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తి కోసం రూ.12,911 కోట్ల విడుదలకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని 05.06.2023 నాటి ఆఫీస్‌ మొమెరాండంలో పొందుపరచడం జరిగింది.

జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

*****


(Release ID: 1942395) Visitor Counter : 198
Read this release in: English