ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐటి హార్డ్‌వేర్‌ రంగంలో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం 2.0కు మంత్రిమండలి ఆమోదం

Posted On: 17 MAY 2023 4:06PM by PIB Hyderabad

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ రూ.17,000 కోట్ల బడ్జెట్‌ వ్యయంతో ఐటి హార్డ్‌వేర్‌ రంగంలో ‘ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) 2.0’కు ఆమోదం తెలిపింది.

సందర్భం:

  • భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత 8 సంవత్సరాల్లో 17 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో స్థిరమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత సంవత్సరం ఉత్పాదకతలో 105 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లు) కీలక మైలురాయిని అధిగమించింది.
  • మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. ఈ మేరకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు ఈ ఏడాది 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.90 వేల కోట్లు) కీలక మైలురాయిని అధిగమించాయి.
  • ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ భారతదేశంలో క్రమేణా స్థిరపడుతోంది. దీంతో ప్రధాన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ దేశంగా భారత్‌ దూసుకెళ్తోంది.
  • మొబైల్ ఫోన్ల తయారీ రంగానికి ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) విజయవంతమైన నేపథ్యంలో తాజాగా ఐటి హార్డ్‌వేర్ పరిశ్రమ కోసం ‘పిఎల్‌ఐ పథకం 2.0’కు కేంద్ర మంత్రిమండలి ఇవాళ ఆమోదముద్ర వేసింది.

ప్రధానాంశాలు:

  • ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్-ఇన్-వన్ ‘పిసి’లు, సర్వర్లు, అతిచిన్న ఫామ్ ఫ్యాక్టర్ పరికరాల తయారీ ఈ తాజా ‘ఐటి హార్డ్‌వేర్ ‘పిఎల్‌ఐ’ పథకం 2.0’ పరిధిలోకి వస్తాయి.
  • ఈ పథకానికి బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.17,000 కోట్లు.
  • ఈ పథకం 6 సంవత్సరాలపాటు అమలులో ఉంటుంది.
  • అదనపు ఉత్పాదకత విలువ రూ.3.35 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.
  • అదనపు పెట్టుబడులు రూ.2,430 కోట్ల మేర వస్తాయని అంచనా.
  • 75,000దాకా అదనపు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

ప్రాధాన్యం:

  • ప్రపంచంలోని అనేక ప్రధాన సంస్థలకు విశ్వసనీయ సరఫరా భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ హార్డ్‌వేర్ రంగంలో భారీ కంపెనీలు భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో ఇప్పటికే బలమైన గిరాకీగల ఐటీ సేవల పరిశ్రమ దీనికి మరింత మద్దతునిస్తుంది.

   ప్రధాన అంతర్జాతీయ సంస్థల్లో అధికశాతం భారతదేశంలో తయారయ్యే తమ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లకు సరఫరా చేయడంతోపాటు భారత్‌ను తమ ఎగుమతుల కూడలిగా మలచుకోవడంపై ఆసక్తి చూపుతున్నాయి.

 

****


(Release ID: 1925030) Visitor Counter : 157