ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 ఏప్రిల్ 17-19 మధ్య హైదరాబాద్ లో జి-20 డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం నిర్వహించనున్న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ


ఏర్పాట్లపై ఈరోజు ఉమ్మడి పత్రికాసమావేశంలో ప్రసంగించిన మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అల్కేశ్ కుమార్ శర్మ, టెలికాం కార్యదర్శి శ్రీ రాజారామన్

2023 ఏప్రిల్ 17 న ప్రారంభం కానున్న అనుబంధ కార్యక్రమాలు; ప్రారంభోపన్యాసం చేయనున్న
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవు సిన్హ్ చౌహాన్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఏ. నారాయణ స్వామి

కొత్తగా వస్తున్న డిజిటల్, టెలికాం సాంకేతిక పరిజ్ఞానాల మీద, సాంకేతిక పరిజ్ఞాన సారధ్యంలో సమ్మిళిత అభివృద్ధి మీద అనుభవాలు పంచుకొనున్న అంతర్జాతీయ నిపుణులు

ప్రాధాన్యతా అంశాలైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాల మీద మరింత చర్చించనున్న జి-20 సభ్యులు, ఆహూతులైన దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు

సామాన్య ప్రజలకు, ముఖ్యంగా జి-20 సభ్యుల్లోని యువతకు, వ్యాపారాభిలాషుల కోసం అధ్యక్ష హోదాలో భారత్ ప్రారంభించిన ప్రచారోద్యమం ‘ఆన్ లైన్ లో సురక్షితంగా ఉండండి’, జి-20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్

Posted On: 16 APR 2023 6:39PM by PIB Hyderabad

జి 20 డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వర్కింగ్ గ్రూప్ (డిఇడబ్ల్యుజి) లో మరింత పురోగతి సాధిస్తూ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఈ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశాన్ని 2023 ఏప్రిల్ 17-19 మధ్య హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను వివరించే క్రమంలో ఈరోజు జరిగిన ఉమ్మడి పత్రికాసమావేశంలో మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అల్కేశ్ కుమార్ శర్మ, టెలికాం కార్యదర్శి శ్రీ రాజారామన్ మాట్లాడారు.

రెండవ సమావేశాల మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 17 న అనుబంధ కార్యక్రమాలతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు మొదలవుతాయి. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవు సిన్హ్ చౌహాన్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఏ. నారాయణ స్వామి ప్రారంభోపన్యాసం చేస్తారు..

అనుబంధ కార్యక్రమాలు ప్రధానంగా డిజిటల్ అనుసంధానత మీద దృష్టి సారిస్తాయి. అందులో భాగంగా “హైస్పీడ్ మొబైల్ బ్రాడ్ బాండ్ – ప్రజలు, సమాజం, పరిశ్రమ మీద దాని ప్రభావం”; “డిజిటల్ సమ్మిళితి: అనుసంధానం కానివారిని అనుసంధానం చేయటం”; “ సుస్థిర, హరిత డిజిటల్ మౌలిక వసతులు – సవాళ్ళు, అవకాశాలు” అనే మూడు అంశాలమీద మూడు బృందాలు చర్చిస్తాయి. కొత్తగా వస్తున్న డిజిటల్, టెలికాం సాంకేతిక పరిజ్ఞానాల మీద, సాంకేతిక పరిజ్ఞాన సారధ్యంలో సమ్మిళిత అభివృద్ధి మీద అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలు పంచుకుంటారు.

సమావేశాల రెండవ, మూడవ రోజుల్లో జి 20 సభ్యులు, ఆహూతులైన దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కార్యాచరణ సాధ్యమైన, ఫలితాలు రాబట్టగల ‘డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్’, ‘సైబర్ సెక్యూరిటీ’, డిజిటల్ నైపుణ్యాలు’ అనే ప్రాధాన్య అంశాలమీద విస్తృతంగా చర్చిస్తారు.

ఈ ప్రతినిధులు హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ని సందర్శిస్తారు. కొత్తగా వస్తున్న 5 జి, 6 జి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీలలో భారత నైపుణ్యం గురించి అక్కడ నేరుగా తెలుసుకుంటారు. పౌరుల సంక్షేమానికి అవి ఉపయోగపడుతున్న తీరు కూడా పరిశీలిస్తారు. అదే విధంగా 18 న “డిజిటల్ నైపుణ్యాల పరస్పర గుర్తింపు కోసం బహుళ భాగస్వాముల సంప్రదింపులు” పేరుతో ఒక వర్క్ షాప్ జరుగుతుంది.

అధ్యక్ష హోదాలో భారత్ ప్రారంభించిన ప్రచారోద్యమం ‘ఆన్ లైన్ లో సురక్షితంగా ఉండండి’, జి-20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్ సామాన్య ప్రజలకు, ముఖ్యంగా జి-20 సభ్య దేశాలలోని యువతకు, వ్యాపారాభిలాషులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటిదాకా, ‘ఆన్ లైన్ లో సురక్షితంగా ఉండండి’ అనే ప్రచారోద్యమం కింద జరిగిన జాతీయ స్థాయి సైబర్ క్విజ్ పోటీలలో 1,58,000 మందికి పైగా పాల్గొన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్ కింద 1600 కు పైగా అంకుర సంస్థలు పోటీకి దరఖాస్తు చేసుకున్నాయి.

 

 

***

 

 

 

 

 

 

 


(Release ID: 1917121)
Read this release in: English