ప్రధాన మంత్రి కార్యాలయం

వాతావరణ మార్పు మీద ప్రపంచ బాంకు కార్యక్రమంలో ప్రధాని వీడియో సందేశ పాఠం

Posted On: 15 APR 2023 9:49AM by PIB Hyderabad

ప్రపంచ బాంక్ అధ్యక్షురాలు, మొరాకో ఇంధన మార్పిడి, సుస్థిరాభివృద్ధి మంత్రి, నా మంత్రివర్గ సహచరురాలు నిర్మలా సీతారామం గారు, లార్డ్ నికోలాస్ స్టెర్న్, ప్రొఫెసర్ సన్ స్టీన్, గౌరవ అతిథులారా

నమస్కారం !

వాతావరణ మార్పు, దాని ప్రభావం మీద ప్రపంచ బాంక్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం నాకెంతో సంతోషంగా ఉంది.  ఇది నా మనసుకు చాలా దగ్గరి అంశం. పైగా, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకోవటం గొప్ప విషయం.

మిత్రులారా,

పేరు మోసిన భారతీయ తత్త్వ వేత్త చాణక్యుడు రెండు వేల సంవత్సరాల కిందట ఇలా ఆరాశాడు: జల బిందు  నిపాతేన  క్రమశః పూర్యతే ఘటః | స హేతుః సర్వ విద్యానామ్ ధర్మస్య చ ధనస్య చ ||  చిన్న చిన్న నీటి చుక్కలు చేరితే కుండనిండినట్టు జ్ఞానం, చదువు, మంచి పనులు కూడా క్రమంగా పెరుగుతాయి. ఇందులో మనకొక సందేశం ఉంది.  స్వతహాగా ఒక్కో చుక్క నీరూ పెద్దగా కనబడకపోవచ్చు. కానీ అలాంటి అనేక చుక్కలు ఒక చోట చేరినప్పుడు దాని ప్రభావం కనబడుతుంది. భూగ్రహం కోసం చేసే ప్రతి మంచి ఆలోచనా ప్రత్యేకంగా అనిపించకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కలసి పనిచేసినప్పుడు  దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.  మన భూగోళం కోసం మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులే మన గ్రహం కోసం చేసే పోరులో చాలా కీలకమని నమ్ముతున్నాం.

మిత్రులారా,

ఈ ఉద్యమ బీజాలు చాలా కాలం క్రితమే పడ్డాయి. 2015 లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో నేను ఈ ప్రవర్తనాపరమైన మార్పు రావాల్సిన అవసరం  గురించి మాట్లాడాను. అప్పటినుంచి ఎంతో దూరం వచ్చాం.2022 అక్టోబర్ లో  ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్, నేను కలసి ‘మిషన్ లైఫ్’ ప్రారంభించాం. కాప్-27 ఫలితపు  డాక్యుమెంట్ పీఠిక కూడా సుస్థిర జీవనశైలి, వినియోగం గురించి పేర్కొంది. వాతావరణ మార్పు మీద నిపుణులు కూడా ఇదే మంత్రాన్ని స్వీకరించటం చాలా అద్భుతంగా ఉంది.

మిత్రులారా,

ప్రపంచమంతటా జనం వాతావరణ మార్పు గురించి వింటూనే ఉంటారు. ఆ విషయంలో తమ వంతుగా ఏం  చేయాలో తెలియక చాలా మంది ఆతృతలో ఉంటారు.ప్రభుత్వాలకు, అంతర్జాతీయ సంస్థలకు మాత్రమే పాత్ర ఉంటుందేమోననుకుంటారు. తాము కూడా చేయవచ్చునని తెలుసుకుంటే వాళ్ళ ఆతృత కార్యాచరణలోకి వస్తుంది.  

మిత్రులారా,

వాతావరణ మార్పు మీద పోరు కేవలం సమావేశాల బల్లలమీద మాత్రమే కుదరదు. ప్రతి ఇంట్లో భోజన సమయంలో చర్చ జరగాలి. అలా ఇంటింటా చర్చ జరిగితేనే అదొక ప్రజా ఉద్యమం అవుతుంది. తమ నిర్ణయాల వల్ల గ్రహానికి మేలు జరుగుతుందని గ్రహించాలి. వాతావరణ మార్పు మీద పోరును ప్రజాస్వామ్యయుతం చేయటమే మిషన్ లైఫ్.  రోజువారీ చిన్న చిన్న పనులే శక్తిమంతమైనవని గ్రహిస్తే పర్యావరణం మీద సానుకూల ప్రభావం ఉంటుంది.

మిత్రులారా,

ప్రజా ఉద్యమాలు, ప్రవర్తనాపరమైన మార్పుతో భారతదేశ ప్రజలు గడిచిన కొన్నేళ్లలో ఎంతో చేశారు. ప్రజల చొరవ వల్ల లింగ నిష్పత్తి మెరుగు పడింది. స్వచ్చతా ఉద్యమం నడిపింది కూడా  ప్రజలే. నదులు కావచ్చు బీచ్ లు కావచ్చు, రోడ్లు కావచ్చు..  బహిరంగ ప్రదేశాలలో చెత్త లేకుండా చూస్తున్నారు. ఎల్ ఇ డి బల్బులకు మారే పని విజయవంతం చేసింది కూడా ప్రజలే. దాదాపు 37 కోట్ల బల్బులు భారత్ లో అమ్ముడుపోయాయి. దీనివల్ల ఏటా 39 మిలియన్ టన్నుల  కార్బన్ డయాక్సైడ్ వెలువడే ప్రమాదం తప్పింది. రైతులు ఏడు లక్షల హెక్టార్ల భూమిని సూక్ష్మ సేద్యం వైపు నడిపారు. ‘చుక్క చుక్కకూ ఎక్కువ  పంట’ నినాదంతో భారీగా నీటిని ఆదా  చేశారు. అలాంటి ఉదాహరణాలెన్నో ఉన్నాయి.

మిత్రులారా,

మిషన్ లైఫ్ కింద మన కృషి అనేక అంశాలకు విస్తరించింది. అందులో స్థానిక సంస్థలను పర్యావరణ హితం చేయటం, జల సంరక్షణ, ఇంధన సంరక్షణ, వ్యర్థాల, ఈ-వ్యర్థాల  తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలిని చేపట్టటం, ప్రకృతి వ్యవసాయం చేపట్టటం, చిరు ధాన్యాలను ప్రోత్సహించటం  లాంటివి ఉన్నాయి. ఈ కృషి వలన:

· 22 బిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఆదా అవుతుంది

· తొమ్మిది ట్రిలియన్ లీటర్ల ఆదా అవుతుంది.  

· మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ తన్నుల వ్యర్థాలు ఆదాయ అవుతాయి

· దాదాపు మిలియన్ టన్నుల ఈ- వ్యర్థాలను రీసైకిల్ చేయటం, 2030 నాటికి 170  మిలియన్ డాలర్ల  అదనపు ఖర్చు ఆదా చేయటం.

పైగా ఇది మన ఆహారంలో పది హేను బిలియన్ టన్నుల వ్యర్థాన్ని నిరోధిస్తుంది. ఇది ఎంత పెద్దదో మీకొక ఉదాహరణ ఇస్తాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రాథమిక పంట ఉత్పత్తి దాదాపు తొమ్మిది బిలియన్ టన్నులని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పైగా, అది పదిహేను బిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలను నియంత్రించటానికి అది ఉపయోగపడుతుంది. ఇదెంత పెద్దదో ఒక పోలిక లో చూడండి. ప్రపంచంలో ప్రాథమిక పంట ఉత్పత్తి 2020 లో తొమ్మిది బిలియన్ టన్నులే.

మిత్రులారా ,

ప్రపంచ మంతటా దేశాలను ప్రోత్సహించటంలో అంతర్జాతీయ సంస్థలు కీలకపాత్ర పోషించాలి. ప్రపంచబాంక్ బృందం వాతావరణం మీద వనరులను  మొత్తం నిధులలో 26% నుంచి 35% కు పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. వాతావరణ మార్పు మీద నిధులు అనగానే సంప్రదాయ కోణాలే ఆలోచిస్తాం. తగినంత ఆర్థిక వనరుల సమీకరణ మార్గాలు అన్వేషించాలి. ప్రపంచ బాంక్ ప్రదర్శించే అండ వలన తగిన ప్రభావం ఉంటుంది.

మిత్రులారా,

ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన  ప్రపంచ బాంకును అభినందిస్తున్నా. ఈ సమావేశాలు కొన్ని పరిష్కారాలతో ముందు కొస్తాయని ఆశిస్తున్నా, ధన్యవాదాలు.

 



(Release ID: 1917072) Visitor Counter : 142